పైశాచికం!
► నారాయణలో విద్యార్థిపై అధ్యాపకుడి దాడి
► మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం
► యాజమాన్యంతోడీల్ కుదుర్చుకొని కేసు పెట్టని తల్లిదండ్రులు
► అధ్యాపకుడి సస్పెండ్ చేశామన్న యాజమాన్యం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):
కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తాలో నివాసం ఉంటున్న శివాజీ సింగ్ కుమారుడు రాజారాణా ప్రతాప్. ఆర్‌ఎంకే ప్లాజాలోని నారాయణ జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు. జూనియర్ ఇంటర్‌లో 93 శాతం మార్కులతో పాసయ్యాడు. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఎప్పటిలాగే బుధవారం రాజారాణా ప్రతాప్ కళాశాలకు వెళ్లాడు. మధ్యాహ్నం కెమిస్ట్రీ అధ్యాపకుడు ముర్తుజావలి క్లాస్ జరుగుతుండగా వెనుకన ఉన్న ఓ విద్యార్థి రాజారాణాప్రతాప్‌ను గురువారం జరిగే సంస్కతం పరీక్ష సిలబస్ అడిగాడు. అందుకు కోపించిన అధ్యాపకుడు ముర్తుజావలి విద్యార్థిపై పైశాచికంగా దాడిచేశాడు. గొంతు, మెడ, వీపు, యదల భాగంలో గోళ్లతో బరికాడు. ఇష్టమొచ్చినట్లు చేతితో కొట్టి తరగతి గది నుంచి బలవంతంగా బయటకు నెట్టివేశాడు. అంతేకాకుండా దాదాపు గంటసేపు ఎండలో నిలబెట్టాడు.
మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం
తోటి విద్యార్థుల ఎదుట అధ్యాపకుడు చేసిన దాడికి రాజారాణా ప్రతాప్ తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. రాత్రి 8.30 గంటలకు ఇంటికి వెళ్లి గదిలో తలుపులు వేసుకుని సారీ అమ్మా..అంటూ సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే తల్లిదండ్రులు కనుగొని వారించారు. సూసైడ్ నోటును స్వాధీనం చేసుకొని ఏం జరిగిందని అడగడంతో తరగతి గదిలో తనకు కలిగిన అవమానాన్ని ఆ విద్యార్థి వివరించారు. ఇదిలా ఉంటే 20 రోజుల క్రితం అధ్యాపకుడు కొట్టాడని ఇదే కళాశాలకు చెందిన విద్యార్థి సందీప్ ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన విషయం తెలిసిందే.
కేసు లేకుండా యాజమాన్యం తల్లిదండ్రులతో ఒప్పందం
ఆత్మహత్యయత్నం ఘటన బయటకు రాకుండా నారాయణ కళాశాల యాజమాన్యం తీవ్ర లాబీయింగ్ చేసింది. రాజా రాణా ప్రతాప్ తల్లిదండ్రులతో మాట్లాడి కేసు పెట్టకుండా ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ ఓ విద్యార్థి సంఘం నాయకులు మధ్యవర్తిత్వం నడపడం గమనార్హం.
అధ్యాపకుడి సస్పెన్షన్..
మరోవైపు కళాశాల యాజమాన్యం రాజా రాణా ప్రతాప్‌పై దాడి చేసిన అధ్యాపకుడు ముర్తుజావలిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిచింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.