పార్టీ మారి.. ప్రాజెక్టు వద్దంటారా?
నారాయణపేట రూరల్ : ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు ప్రజల అవసరాలను తీర్చడం మాని స్వప్రయోజనాల కోసం పనిచేయడం అవివేకమని, పార్టీలు మరిన మరుక్షణం ప్రాజెక్టులపై అభిప్రాయాలను మార్చేసుకోవడం సరికాదని మక్తల్, నారాయణపేట ఎమ్మెల్యేల తీరుపై జలసాధన సమితి సభ్యులు మండిపడ్డారు. మంగళవారం ‘పేట’లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి అధ్యక్షుడు అనంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలు సస్యశ్యామలం చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఎప్పటికీ నిలువ ఉండే నికరజలాల నుంచి నీటిని తరలించేలా ప్రాజెక్టుల రూపకల్పన చేయాలని అన్నారు.
వరద జలాలపై ఆధారపడి ప్రాజెక్టుల రూపకల్పన చేస్తే అది నిరుపయోగమేనని విమర్శించారు. నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల ప్రజలకు తాగు,సాగునీరు అందాలంటే జీఓ నెం.69 ప్రకారం ‘పేట’ - కొడంగల్’ ఎత్తిపోతల పథకం ద్వారానే సాధ్యపడుతుందని అన్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు, ఐదు లక్షల జనాభాకు తాగునీటిని జూరాల నికరజలాల నుంచి అందించేలా ప్రాజెక్టు రూపకల్పన చేయడం సరైనదని చెప్పారు. ఎక్కువ దూరం, ఎక్కువ వ్యయంతో కూడిన పాలమూర్ ప్రాజెక్టును ప్రభుత్వం తెరపైకి తీసుకునిరావడం వెనక కాంట్రాక్టర్ల నుంచి వచ్చే కమీషన్లకే ఆశపడినట్లు కనిపిస్తుందని విమర్శించారు.
‘పేట’ - కొడంగల్ ప్రాజెక్టు విషయాన్ని సీఎంను కలిసి విన్నవి స్తామని, సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమిస్తామని అ న్నారు. ఈ సమావేశంలో జలసాధన సమితి మండల కన్వీనర్లు వెంకోబ, సత్యనారాయణరెడ్డి, సరాఫ్‌కృష్ణ, నర్సింహులుగౌడ్, లక్ష్మణ్, రఘురామయ్యగౌడ్, కెంచ్శైవాస్, లప్పఅశోక్, బి.రాము, రాజ్‌గోపాల్, కాశీనాత్, బలరాం పాల్గొన్నారు.