
నర్సాపూర్‌కు రెవెన్యూ డివిజన్ హోదా.
నర్సాపూర్:నర్సాపూర్ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి పాలనాపరంగా పలు మార్పులు చెందుతూ వస్తూ ఎట్టకేలకు రెవెన్యూ డివిజన్ హోదా దక్కించుకుంది. 1957లో నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం ఏర్పాటైంది. అనంతరం పాలçనాపరంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గం ఏర్పడిన అనంతరం నియోజకవర్గ పరిధిలో ఆరు ఫిర్కాలు ఏర్పాటు చేశారు. నర్సాపూర్, కౌడిపల్లి, హత్నూర, తుర్కలఖానాపూర్, గుమ్మడిదల్ల, శివ్వంపేటలో ఫిర్కాలు ఏర్పాటు చేసి ఒక్కో ఫిర్కాకు ఒక్కో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను నియమించారు. రెవెన్యూ అధికారిగా తహసీల్దార్ నర్సాపూర్‌లో ఉండేవారు. కాగా ప్రజాప్రతినిధులుగా గ్రామ స్థాయిలో సర్పంచులు, నియోజకవర్గ స్థాయిలో శాసనసభ్యునితో పాటు పంచాయితీ సమితి అధ్యక్షుడు ఉండేవారు.
నియోజకవర్గంలో ఐదు మండలాల ఏర్పాటు
1985లో నియోజకవర్గాలను విభజించి మండల వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో ఐదు మండలాలను ఏర్పాటు చేశారు. నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంగా ఉండగా జిన్నారం, కౌడిపల్లి, హత్నూర, శివ్వంపేట మండలాలతో నియోజకవర్గం ఏర్పాటు చేశారు. మండల వ్యవస్థ రావడంతో ఫిర్కాలు కనుమరుగయ్యాయి. కాగా మండలాల ఏర్పాటుతో పంచాయతీ సమితి అధ్యక్ష పదవుల స్థానంలో ఎంపీటీసీ సభ్యులతో పాటు ఎంపీపీ అధ్యక్ష పదవులు, జెడ్పీటీసీ సభ్యులుగా ప్రజాప్రతినిధులు కొత్తగా వచ్చారు.
పునర్విభజనలో పెరిగిన మండలాలు
మండల వ్యవస్థ అమలైన అనంతరం నర్సాపూర్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండేవి. 2009 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజనతో ఒక మండలం పోయి రెండు మండలాలు రావడంతో నియోజకవర్గ పరిధి ఆరు మండలాలకు పెరిగింది. నియోజకవర్గంలోని జిన్నారం మండలం కొత్తగా ఏర్పడిన పటాన్‌చెరు నియోజకవర్గంలోకి వెళ్లగా నర్సాపూర్ పరిధిలోకి ఇతర నియోజకవర్గల్లోని వెల్దుర్తి, కొల్చారం మండలాలు వచ్చి చేరడంతో మండలాల సంఖ్య ఐదు నుంచి ఆరు మండలాలకు పెరిగింది.
కొత్త జిల్లాల నేపథ్యంలో డివిజన్ కేంద్రంగా..
ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టిన నేపథ్యంలో నర్సాపూర్ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటు చేసిన మెదక్ జిల్లాలో చేరింది. అంతేకాకుండా రెవెన్యూ డివిజన్ కేంద్రం హోదా దక్కింది. నర్సాపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి పరిధిలోకి నర్సాపూర్‌తో పాటు కౌడిపల్లి, శివ్వంపేట, కొల్చారం మండలాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన చిలిపిచెడ్ మండలాలను చేర్చారు. కాగా రెవెన్యూ డివిజన్ కేంద్రం పరిధిలోకి వచ్చే మండలాల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని, సోమవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే గెజిట్‌లో మార్పులు, చేర్పులు ఉండవచ్చని స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. నర్సాపూర్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయడంతో ఆర్‌డీఓ ఆఫీసుతో పాటు పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.