
'జాతీయ మీడియా నిర్లక్ష్యం చేస్తోంది'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడమేనని, నిరుద్యోగాన్ని పారద్రోలడమేనని సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో నాడు కేంద్రంలోని అధికార పార్టీ, ప్రతిపక్ష బీజేపీ హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. మరోపక్క, ప్రత్యేక హోదా కోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహారా దీక్షను జాతీయ మీడియా నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోందని చెప్పారు.
సాధారణంగా జాతీయ మీడియా పట్టించుకున్నప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి సమస్య తెలుస్తుందని, అలాంటిది ఆ మీడియా ఎందుకు ఈ విషయాన్ని పక్కకు పెట్టాయో అర్థం కావడం లేదని చెప్పారు. స్థానిక మీడియా బాగానే ప్రచారం చేస్తుందని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని, కొంత ఆందోళన కరంగా ఉందని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పారు. ఈ దీక్ష వైఎస్ జగన్ కోసం చేస్తున్నది కాదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసమే దీక్ష చేస్తున్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.