
'రూ.2 కోట్లు ఇవ్వాలని నయీం బెదిరించాడు'
నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని భువనగిరిలో గ్యాంగ్‌స్టర్ నయీం ఆగడాలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో నయీం ఆగడాలతో బాధింపబడిన బాధితులందరూ నయీం ఎన్‌కౌంటర్ అనంతరం ఒక్కొక్కరూ నెమ్మదిగా బయటకు వస్తున్నారు. గతంలో నయీం ముఠా ఓ ఎలక్ట్రానిక్స్ యాజమానిని రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందిగా బెదిరించిన వైనం తాజాగా గురువారం వెలుగులోకి వచ్చింది. నందిని ఎలక్ట్రానిక్స్‌కు చెందిన యాజమని నరహరి.. తనను అప్పట్లో నయీం బెదిరించి కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్టు మీడియాను ఆశ్రయించాడు. తాను భువనగిరి మెయిన్ రోడ్డు ప్రక్కన భవనం నిర్మిస్తున్న విషయం తెలుసుకుని నయీం అనుచరులు డబ్బులు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో నయీం అనుచరులు తనవద్దకు వచ్చి తన కళ్లకు గంతలు కట్టి నయీం వద్దకు తీసుకెళ్లినట్టు బాధితుడు వాపోయాడు. తన భార్య పిల్లలను చంపేస్తానంటూ బెదిరించి.. రెండు కోట్ల రూపాయలను డిమాండ్ చేయడంతో తాను అంత సొమ్ము ఇచ్చులేనంటూ నయీం కాళ్లపై పడినట్టు తెలిపాడు. చివరికి నయీం రసీదుపై రూ. 25 లక్షలు ఇవ్వాలని రెడ్ ఇంక్‌తో రాసినట్టు బాధితుడు నరహరి మీడియాకు వివరించాడు. నయీం ఆగడాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డానని తనకు ఎలాగైనా న్యాయం చేయాలని నరహరి ప్రాధేయపడ్డాడు.