వో కౌన్ హై మాలూమ్..?
* ఖమ్మంలోని డాక్టర్‌కు సీఐ బెదిరింపులు
* 2012లో భూమిని కబ్జా చేసిన ‘నయీమ్ గ్యాంగ్’
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘సీఐ గారూ.. నా భూమి కబ్జా చేశారు. వాళ్లెవరో తెలియదు. కొంచెం పట్టించుకోండి’. అంటూ ఖమ్మానికి చెందిన ఓ ప్రముఖ వైద్యుడు సీఐకి ఫిర్యాదు చేశాడు. ‘కబ్జా చేసిన వారి వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..? పట్టించుకోకండి.. మీకే ఇబ్బంది అవుతుంది.. అంటూ డాక్టర్‌కు సీఐ బెదిరింపులు’. ఇది 2012 డిసెంబర్‌లో నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి భూమిని కబ్జా చేసినందుకు.. సదరు వైద్యుడు ఫిర్యాదు చేసేందుకు వెళితే.. సీఐకి.. అతడికి మధ్య జరిగిన చర్చ. అయితే, ఈ భూమిపై కన్నేసింది నయీమ్ గ్యాంగ్ అని.. ఆ గ్యాంగ్‌కు ఓ సీఐ వత్తాసు పలికాడని తెలుస్తోంది.
గ్యాంగ్ స్టర్ నయీమ్ ఖమ్మం జిల్లా కేంద్రంలోనూ భూముల కబ్జాకు యత్నించి.. ప్రయత్నం సఫలం కాకపోవడంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నట్లు తెలుస్తోంది. 2012లోనే ఓ భూమిపై కన్నెసిన గ్యాంగ్ అక్కడ 15 రోజుల పాటు టెంట్ వేసుకుని కూర్చొగా.. ఈ గ్యాంగ్‌కు ఓ సీఐ సైతం వత్తాసు పలికినట్లు తెలుస్తోంది. నగరంలోని వైరా రోడ్డులో రూ.కోట్ల విలువ చేసే భూమిపై గ్యాంగ్‌స్టర్ నయీమ్ కన్ను పడింది. దీంతో ఆ భూమిలో 15 రోజులపాటు టెంట్ వేయించి.. తన గ్యాంగ్ ను ఇక్కడే ఉంచాడు. ఈ భూమి తనదని, ఎవరో కబ్జా చేశారని అప్పట్లో ప్రముఖ డాక్టర్ సీఐకి ఫిర్యాదు చేశారు.
న్యాయం చేయాల్సిన సీఐనే వైద్యుడిని బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం. దీంతో సీఐపై వరంగల్ డీఐజీకి సదరు డాక్టర్ ఫిర్యాదు చేశాడు. డీఐజీ ఆగ్రహించడంతో సీఐ ఎట్టకేలకు ఆక్రమించిన స్థలంలో టెంట్లను తీయించాడు. ఇదంతా నయీమ్ గ్యాంగే చేసిందని, అప్పట్లో నయీమ్‌కు సీఐ మద్దతు పలికాడని తెలుస్తోంది. డాక్టర్ కూడా ధైర్యంతో భూమి కబ్జా చేసింది నయీమ్ గ్యాంగ్ అని తెలియకున్నా.. డీఐజీ దాకా వెళ్లడం గమనార్హం. ఆ తర్వాత సదరు డాక్టర్ భూమిని కబ్జా చేసింది నయీమ్ అని తెలిసి.. తనకు సన్నిహితంగా వారి వద్ద ఈ విషయం చెప్పినట్లు సమాచారం.
అంతేకాక నగరంలో పలువురు ప్రముఖ డాక్టర్లకు నయీమ్ గ్యాంగ్ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిందని, అలాగే కొందరు నయీమ్ గ్యాంగ్ సభ్యులు బెదిరించి చికిత్స చేయించుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. గాంధీనగర్ కాలనీలో ఉన్న నయీమ్ గ్యాంగ్ ఖమ్మంలో ఉన్న విలువైన స్థలాలపై దృష్టి పెట్టి.. అందులో భాగంగానే వైరా రోడ్డులో భూమిని ఆక్రమించిందని సమాచారం.
గ్యాంగ్‌లో ఓ సర్వేయర్
వైరా రోడ్డులోని ఓ కాలనీలో టెంట్ వేసి.. 15 రోజులపాటు నయీమ్ గ్యాంగ్ జల్సా చేసింది. అయితే భూ కబ్జా విషయంలో అప్పట్లో నగరానికి చెందిన ఓ సర్వేయర్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాక నగరంలో విలువైన స్థలాలు ఎవరి చేతిలో ఉన్నాయి.. వివాదాస్పదంగా ఉన్నవేమిటని ఈ సర్వేయర్ ద్వారా నయీమ్ గ్యాంగ్ పూర్తి సమాచారం సేకరించి నయీమ్‌కు పంపినట్లు సమాచారం.