నల్లగొండలో నయీంకు నాలుగు ఇళ్లు
నల్లగొండ క్రైం: గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుల నుంచి పోలీసులకు విస్మయకర సమాచారాలు లభిస్తున్నాయి. తవ్వేకొద్ది నయీం దురాగతాలు బయటపడుతూనే ఉన్నాయి. నయీం ఎన్‌కౌంటర్ అయిన రోజే నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన నయీం సోదరి(చిన్నమ్మ కూతురు) అస్మత్‌బేగంను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టుకు తరలించారు. న్యాయస్థానం ఆమెను పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఆమెను విచారిస్తున్న పోలీసులు నయీంకు నల్లగొండ జిల్లా కేంద్రంలో నాలుగు ఖరీదైన ఇళ్లు ఉన్నాయని.. వాటితో పాటు కనగల్ మండలం పర్వతగిరి మండలంలో ఓ డెన్ ఉన్నట్లు గుర్తించారు. నల్లగొండలోని నాలుగు ఇళ్లలో ఆయన సమీప బంధువులు ఉంటుండగా.. పర్వతగిరిలోని ఇళ్లు మాత్రం ఖాళీగా ఉందని.. ఆ ఇంటికి అయిన సెటిల్‌మెంట్లకు, అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లడానికి మాత్రమే వినియోగించేవాడని తెలుస్తోంది.
నయీం హత్య జరిగిన రోజు అస్మత్‌బేగం ఇంట్లో జరిపిన సోదాల్లో ఓ తుపాకి, ల్యాప్‌టాప్, వందలకొద్ది దస్తావేజులు లభించాయి. ఇప్పటివరకు నల్లగొండలో ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా.. గ్యాంగ్‌స్టర్ నయీం తమ్ముడు అలిమొద్దీన్ కూతురికి అస్మత్‌బేగం కొడుకుతో గతేడాది హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిశ్చితార్థం ఘనంగా జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ పెళ్లికి నయీం కట్న కానుకలుగా రూ. 12 కోట్లు సమర్పించుకున్నట్లు సమాచారం.