విశాఖలోనూ నయీమ్ కదలికలు
రైల్వే ప్లాట్‌ఫారాల సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న సిట్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో కూడా నేర సామ్రాజ్యాన్ని విస్తరించాలని చూశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నయీ మ్ గత రెండు, మూడు నెలల్లో పలుమార్లు విశాఖకు వచ్చి వెళ్లాడని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆదివారం సిట్ అధికారులు విశాఖలో పర్యటించారు. ప్రధానంగా రైల్వేస్టేషన్‌పై దృష్టి సారించి.. ఆర్‌పీఎఫ్, రైల్వే పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. విశాఖ నుంచి వెళ్లే గోదావరి, దురంతో ఎక్స్‌ప్రెస్‌ల రిజర్వేషన్ టికెట్ల వివరాలను తీసుకున్నారు. ప్లాట్‌ఫారాల సీసీ టీవీ ఫుటేజీలను తీసుకున్నారు.
విశాఖ నుంచి హైదరాబాద్‌కు రైళ్లలో ప్రయాణించిన సందర్భాల్లో నయీమ్ నేరుగా సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో కాకుండా ముందు స్టేషన్లలోనే దిగిన ట్టు అధికారులు గుర్తించారు. వరంగల్, జనగామ, ఘట్‌కేసర్‌లలో దిగినట్టు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నేరసామాజ్రాన్ని విస్తరించుకున్న నయీమ్ విశాఖ ఎందుకొచ్చినట్టు? ఏమైనా సెటిల్‌మెంట్లు, దందాలు చేశాడా? ఇక్కడ పోలీసు అధికారులతో కూడా అతనికి పరిచయాలు ఉన్నాయా? ఇక్కడ కూడా అతనికి అనుచరులు ఉన్నా రా? అన్న అంశాలపై సిట్ అధికారులు విచారణ చేపట్టినట్టు సమాచారం.