
లక్ష్యం..దూరం
నత్తనడకన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం
జిల్లాలో నివాసమున్న కుటుంబాలు : 4,77,712
వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరమున్న కుటుంబాలు: 2,61,992
ఈ ఏడాది వందగ్రామాల్లో లక్ష్యం: 20,000
ఇప్పటి వరకు నిర్మించిన మరుగుదొడ్లు: 4200
వివిధ దశల్లో ఉన్న మరుగుదొడ్లు: 2600
ఇంకా మొదలుపెట్టనివి: 13,200
కడప ఎడ్యుకేషన్: సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించే దిశగా జిల్లాలో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. రెండేళ్లు గడిచినా మరుగుదొడ్ల నిర్మాణంలో ఆశించిన పురోగతి మాత్రం కన్పించడంలేదు. గ్రామీణ ప్రాంతంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్న చోట కొంత ఫర్వాలేదనిపించినా నూరుశాతం సాధించడంలో మాత్రం వెనుకబడిపోయారనే చెప్పొచ్చు.
జిల్లాలో 2014 అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 51 మండలాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించే లక్ష్యంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువ కింద 2,61,992 కుటుంబాలను గుర్తించారు. ఇందులో భాగంగా 790 గ్రామపంచాయతీలు ఉండగా ఇందులో 2015-16కు గాను 59 పంచాయతీల్లో గత ఏడాది 11,225 మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
కానీ లబ్ధిదారులు సహకరించకపోవడం, సరైన అవగాహన లేకపోవడంతో ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో అధికారులు వెనుకబడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది 2016-17 ఏడాదికి గాను వంద గ్రామ పంచాయతీల్లో 20 వేలు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో ఇప్పటికి 4200 మరుగుదొడ్లను పూర్తి చేయగా, 2600 వివిధ దశల్లో ఉన్నాయి. ఈ లక్ష్యం 2017 మార్చి నాటికి కనుక ఈ ఏడాది లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందులో భాగంగా మండలాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం వచ్చే వారికి అవగాహన కల్పించడంతోపాటు వారికి అవసరమైన డాటాను నమోదు చేసేందుకు మండలానికి ఒక ఎమ్మార్పీని ఈ ఏడాది ఏర్పాటు చేసింది.
లబ్ధిదారుల్లో నిర్లిప్తత
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి గతంలో మంజూరు చేసిన నిధుల కంటే అధికంగా పెంచి రూ. 15 వేలు చొప్పున నిధులను మంజూరు చేస్తోంది. గతంలో నిధులు తక్కువగా మంజూరు చేయడం, లబ్దిదారులు సైతం సొంత డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం నిధులు పెంచి మంజూరు చేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో నిర్లిప్తత కనిపిస్తోంది. ఆరుబయట మలవిసర్జన వల్ల పారిశుద్ధ్య సమస్య, నీరు కలుషితం కావడం వంటి ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అయితే వీరిలో చైతన్యం తీసుకువచ్చే విధంగా అవగాహన సదస్సులతోపాటు ప్రదర్శనలు నిర్వహిస్తే కొంతమేర ప్రయోజనం ఉంటుంది.