
కలిచేటి వెంకారెడ్డి
రాష్ట్రపతి, ప్రధానికి నెల్లూరు జిల్లా రైతు వేడుకోలు
నెల్లూరు: 13 ఏళ్లుగా కొందరు వ్యక్తులు, అధికారులు పెడుతున్న ఇబ్బందుల నుంచి ఇప్పటికీ ఉపశమనం కలగకపోవడంతో తనకు స్వచ్ఛంద మరణానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి, ప్రధానికి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రైతు వేడుకుంటున్నాడు.
విడవలూరు మండలం ఊటుకూరుకు చెందిన రైతు కలిచేటి వెంకారెడ్డి శనివారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ఊటుకూరులోని సర్వేనంబరు 817లో పెద్దల నుంచి సంక్రమించిన ఎకరా 80 సెంట్లలో కొబ్బరితోట ఉందన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొందరు తన తోట చుట్టూ ఆక్వాసాగు చేయడంతోపాటు తన తోటలోకి నీరు రానీయకుండా, వెలుపలికి పోకుండా చేశారన్నారు. దీంతో ఏడాదికి రూ.60 వేలు ఆదాయం వచ్చే కొబ్బరితోట నిలువునా ఎండిపోయిందని వివరించారు.
తనకు జరిగిన అన్యాయంపై 13 ఏళ్ల క్రితం నాటి కలెక్టరు నుంచి నేటి కలెక్టర్ వరకు, అధికారులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, ముఖ్యమంత్రులకు పలు పర్యాయాలు ఫిర్యాదు చేశానన్నారు. అయినా అధికారులు నామమాత్రంగా స్పందించారని వెంకారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితిలో తనకు, తన కుటుంబానికి చావే శరణ్యమన్నారు. దీంతో స్వచ్ఛంద మరణానికి అనుమతి ఇవ్వాలని, లేనిపక్షంలో తనను ఆదుకోవాలని కోరారు.
కలిచేటి వెంకారెడ్డి