బాలికల హాకీ విజేత నెరిమెట్ల
- బాలుర విజేత తలుపూరు జట్టు
- నేటి నుంచి జిల్లా స్థాయి హాకీ టోర్నీ
అనంతపురం సప్తగిరిసర్కిల్ : అనంతపురం 9వ రీజియన్ హాకీ టోర్నీ బాలికల విజేతగా నెరిమెట్ల జెడ్పీ ఉన్నత పాఠశాల జట్టు నిలిచింది. రన్నరప్‌గా వెంకటాద్రిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల జట్టు నిలిచింది. స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో బుధవారం జరిగిన ఫైనల్ పోరులో నెరిమెట్ల, వెంకటాద్రిపల్లి జట్లు తలపడ్డాయి. ఉత్కంఠంగా సాగిన పోరులో ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు 0–0 తో సమంగా నిలిచాయి. దీంతో నిర్వాహకులు ఇరు జట్లు టోర్నీలో చేసిన స్కోరును పరిగణలోకి తీసుకుని నెరిమెట్ల జట్టు టోర్నీలో మొత్తం 4 గోల్స్‌తో ఆధిక్యం ప్రదర్శించడంతో నెరిమెట్ల జట్టును టోర్నీ విన్నర్‌గా ప్రకటించారు.
వెంకటాద్రిపల్లి జట్టు టోర్నీలో 1 గోల్‌తో వెనుకబడింది. దీంతో వెంకటాద్రిపల్లి జట్టు రన్నరప్‌గా ప్రకటించారు. బాలుర విన్నర్‌గా తలుపూరు జట్టు నిలిచింది. ఫైనల్ పోరులో తలుపూరు, వెంకటాద్రిపల్లి బాలుర ఉన్నత పాఠశాల జట్లు తలపడ్డాయి. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు ఎలాంటి స్కోరు చేయలేక పోయాయి. దీంతో నిర్వాహకులు మ్యాచ్‌ను పది నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. ఆ సమయంలో ఇరు జట్లు వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక పోయాయి.
దీంతో ఇరు జట్లు ఎలాంటి స్కోరు చేయకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లకు షూటవుట్‌ను నిర్వహించారు. షూటవుట్‌లో తలుపూరు జట్టు 2 గోల్స్ సాధించింది. జట్టులో చందు–1, మధు–1 గోల్ చేశారు. వెంకటాద్రిపల్లి జట్టు 1 గోల్(వేణు) మాత్రమే చేయగలిగింది. దీంతో తలుపూరు జట్టును విన్నర్‌గా ప్రకటించారు. బాలుర, బాలికల విభాగంలో వెంకటాద్రిపల్లి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. విన్నరప్, రన్నరప్‌గా నిలిచిన ఇరు జట్లు గురువారం అనంత క్రీడా మైదానంలో జరిగే జిల్లాస్థాయి హాకీ టోర్నీలో తలపడతాయని ఆర్డీటీ కోచ్ చౌడేశ్వరి ప్రసాద్ తెలిపారు.
నైపుణ్యాలను పెంచేందుకు టోర్నీలు ఉపయోగపడతాయి : నెదర్లాండ్ కోచ్‌లు వెస్సీ, రాడ్రిక్‌లు
క్రీడాకారుల్లో నైపుణ్యాలను పెంచేందుకు టోర్నీలు ఉపయోగపడతాయని నెదర్లాండ్ హాకీ కోచ్‌లు వెస్సీ, రాడ్రిక్‌లు అభిప్రాయపడ్డారు. బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన అనంతపురం రీజియన్ హాకీ టోర్నీ బహుమతుల ప్రదానోత్సవానికి వారు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారుల ఆట తీరు ఆకట్టుకుందన్నారు. మెళుకువల ద్వారా మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఆటతీరు మరింత మెరుగు పడేందుకు జిల్లాలో ఆయా సెంటర్లలో తమ కోచింగ్ క్యాంపులను అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి విజయ్‌బాబు, బాబయ్య, పీడీలు వెంకటనాయుడు, జబీవుల్లా తదితరులు పాల్గొన్నారు.