ఔటా నూతన కార్యవర్గంలోని ఆఫీసు బేరర్లు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ భూములలో అంగుళం స్థలాన్ని కూడా వదులుకోమని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షులు ప్రొ.భట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఔటా సంయుక్త కార్యదర్శికి జరిగిన పోటీలో ప్రొ.భట్టు సత్యనారాయణ ప్యానెల్ అభ్యర్థులు డాక్టర్ దిప్లా, డాక్టర్ శ్రీరాంరామిరెడ్డి అత్యధిక ఓట్ల మోజార్టీతో గెలుపొందారు. ఔటా అధ్యక్షునిగా ప్రొ.భట్టు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ప్రొ.మనోహార్, ఉపాధ్యక్షులుగా ప్రొ.కృష్ణయ్య, మహిళా ఉపాధ్యక్షులుగా డాక్టర్ లావణ్య, కోశాధికారిగా డాక్టర్ శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విధితమే.
కేవలం సంయుక్త కార్యదర్శి పదవీ జరిగిన ఎన్నికల్లో సైతం ప్రొ.భట్టు ప్యానెల్ అభ్యర్థులు విజయం సాధించారు. ఔటా విజయం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఔటా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు ప్రొ.భట్టు సత్యనారాయణ మాట్లాడుతూ... అధ్యాపకుల సమస్యలతో పాటు, యూనివర్సిటీ అభివృద్ధి, బోధన పరిశోధనలకు ఔటా కృషి చేస్తుందన్నారు. ఓయూ భూములను అంగుళం కూడా వదులుకోబోమని ప్రొ.సత్యనారాయణ పేర్కొన్నారు.
క్యాంపస్‌లోని ప్రైవేటు వాహనాల నియంత్రణకు బై పాస్ రోడ్డు నిర్మిస్తే అభ్యంతరం లేదన్నారు. కానీ క్యాంపస్‌లో అక్రమంగా నివాసముంటున్న వారి కోసం ఓయూ భూములలో నివాసాలు ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామన్నారు. పేదల పై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఇతర ప్రదేశాలలో క్యాంపు వాసులకు ఇళ్లు నిర్మించాలన్నారు. గతంలో అన్యక్రాంతం అయిన ఓయూ భూములను పరిరక్షించాల్సిన బాధ్యతన ప్రభుత్వానిదే అన్నారు.