ఉస్మానియా మెడపై న్యాక్ కత్తి
రూ.150 కోట్ల్లు ఆగిపోయే ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం మెడపై న్యాక్ గుర్తింపు కత్తి వేలాడుతోంది.‘ఏ’ గ్రేడ్ గుర్తింపుతో దేశంలోనే ఓ వెలుగు వెలుగుతున్న ఉస్మా నియాపై చీకట్లు కమ్ముకోనున్నాయి. పరిశోధనలకు ఏటా యూజీసీ నుంచి మంజూరవుతున్న ఫెలోషిప్‌లు, ఇత ర అభివృద్ధి పనుల కోసం ఇస్తున్న నిధులు నిలిచిపోనున్నాయి. ఇన్నోవేటివ్ యూనివర్సిటీల పథకంలో భాగంగా ఇప్పటి వరకు వర్సిటీకి మంజూరైన రూ.150 కోట్ల నిధులు ఆగిపోయే ప్రమాదముంది.
అసలేం జరిగిందంటే...: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన వర్సిటీలకు న్యాక్ గుర్తింపు వస్తుంది. ఈ గుర్తింపు ఉన్న వర్సిటీలకు ఫెలోషిప్‌లు, ఇతర అభివృద్ధి పనుల కోసం ఏటా యూజీసీ అదనంగా నిధు లు మంజూరు చేస్తుంది. 2018తో వందేళ్లు పూర్తి చేసుకోనున్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 2001లో తొలిసారిగా న్యాక్ గుర్తింపు లభిం చింది. 2008లో రెండోసారి లభించిన ఈ గుర్తింపు 2013 ఫిబ్రవరితో ముగిసింది. గుర్తింపు రెన్యూవల్ కోసం 2014 జూన్ ఒకటిలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే గడువు ముగిసినా వర్సిటీ అధికారులు దీన్ని పట్టించుకోలేదు. వీసీ, ఇతర అధికారుల నిర్లక్ష్యం వల్ల న్యాక్ గుర్తింపును కోల్పోవాల్సి రావడంతో పాటు ఇప్పటి వరకు యూజీసీ నుంచి విద్యార్థులకు అందుతున్న వివిధ రకాల ఫెలోషిప్‌లు, అభివృద్ధి నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
కేంద్ర మంత్రి దృష్టికి గుర్తింపు రగడ..: ఉస్మానియా నాక్ గుర్తింపు విషయంలో పాలక మండలి, ఉస్మానియా టీచర్స్ అసోసియేషన్(ఔటా) మధ్య నెలకొన్న వివాదం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతి ఇరానీ దృష్టికి వెళ్లింది. త్వరలో తానే స్వయంగా వర్సిటీని సందర్శించి, న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చినట్లు తెలిసింది.