మైపాడు రిసార్ట్స్‌కు అదనపు హంగులు
-
రూ.7 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
-
ముమ్మరంగా సాగుతున్న పనులు
మైపాడు బీచ్‌లో ఉన్న రిసార్ట్స్‌లో రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పర్యాటకశాఖ విడదుల చేసిన నిధులతో ఈ పనులు జరుగుతున్నాయి. నిర్మాణాలు పూర్తయితే మైపాడు సముద్ర తీరానికి సందర్శకులకు మరెన్నో సౌకర్యాలు ఏర్పడుతాయి.
ఇందుకూరుపేట : జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మైపాడు బీచ్‌లో 2013 సంతవ్సరంలో హరితా బీచ్ రిసార్ట్స్‌ను ప్రారంభించారు. అందులో 16 గదులతో పాటు పర్యాటకుల కోసం రెస్టారెంట్, పిల్లలు ఆటలాడేందుకు పార్క్‌ను ఏర్పాటుచేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించే వీలు ఉండటం, రిసార్ట్స్ ఏర్పాటుతో సందర్శకుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా ఆదివారం, సెలవు రోజుల్లో పర్యాటకులు వందలాది మంది ఇక్కడకు వస్తున్నారు. దీంతో కొన్నిసార్లు గదుల కొరత ఏర్పడుతోంది.
గదుల పెంపు..
పర్యాటకుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో పర్యాటక శాఖ గదులు పెంచాలని నిర్ణయించింది. మరో 7 అదనపు గదుల నిర్మాణాలు చేపట్టింది. దీంతోపాటు ఉడెన్‌డెక్, తీరం వెంబడి లైటింగ్, పార్కింగ్ ఏర్పాటు చేయనుంది. అలాగే రిసార్ట్స్‌కు ఎదురుగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. కల్యాణోత్సవాలు, పుట్టినరోజు, పెళ్లిరోజులు వంటి శుభకార్యాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో డైనింగ్ హాలు, వంటగది, డ్రస్సింగ్ రూం, మేకప్‌రూం, టాయ్‌లెట్స్, పార్కింగ్ ఏరియా, కాంపౌండ్ వాల్ తదితర అభివృద్ధి పనులను చేపడుతుంది. అసలే సముద్ర తీరం కావడంతో ఇక్కడ ఆహ్లాదంగా ఉంటుందని శుభకార్యాలు ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంది.
వేడుకలకు అనుకూలం : శ్రీహరికోట ప్రసాద్, ఎంపీటీసీ సభ్యుడు, మైపాడు
బీచ్‌లో అభివృద్ధి పనులు పూర్తయితే సందర్శకులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతోపాటు పర్యాటకులు, గ్రామస్తులు శుభకార్యాలు, సమావేశాలు నిర్వహించుకునే అవకాశం ఉంది.
సౌకర్యవంతం : కే రాజేష్, కోవూరు
బీచ్‌లో తీరం వెంబడి లైటింగ్, పార్కింగ్ తదితర వసతులు ఏర్పాటయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మరింత సంతోషంగా గడపవచ్చు. అలాగే గదులు కొరత తీరుతుంది.