దామరకుంటలో ప్రారంభానికి సిద్ధంగా సబ్‌స్టేషన్
- వారంలో పనులు పూర్తి.. తీరనున్న రైతుల వెతలు
ములుగు: విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్ట పరిచే దిశగా ప్రభుత్వం కొత్త సబ్‌స్టేషన్‌లకు శ్రీకారం చుడుతుంది.మెరుగైన విద్యుత్ సరఫరాకు వీలుగా ములుగు మండలంలో మరో కొత్త 5ఎంవీఏ సామర్థ్యంతో విద్యుత్ సబ్‌స్టేషన్ తుది మెరుగులు దిద్దుకుంటుంది. వ్యవసాయానికి నాణ్యతాయుతమైన విద్యుత్ సరఫరాతో పాటు గృహావసరాలకు, సమీప పరిశ్రమలకు కరెంట్ కష్టాలు తీరబోతున్నాయి. దీంతో సమీప సబ్‌స్టేషన్‌లపై భారం తగ్గనుంది.
ఇందులో భాగంగా ములుగు మండలం దామరకుంట గ్రామంలో రూపు దిద్దుకుంటున్న నూతన సబ్‌స్టేషన్‌పై ప్రత్యేక కథనం.. ములుగు మండలంలో ఇప్పటివరకు ములుగు, అలియాబాద్, క్షీరసాగర్, వంటిమామిడి, కొక్కొండ, కర్కపట్ల, మర్కుక్, కొట్యాల, తున్కిబొల్లారం గ్రామాల్లో 33.11కేవీ సబ్‌స్టేషన్‌లున్నాయి. తాజాగా రూ.1.6 కోట్ల వ్యయంతో దామరకుంటలో మరో 33.11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టారు.
5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. దీనిని దామరకుంట, ఇండస్ట్రీయల్, వ్యవసాయం కొరకు 3 ఫీడర్లుగా విభజించి మొత్తం 250 ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా విద్యుత్ సరఫరా కొనసాగించనున్నారు. ఈ కొత్త సబ్‌స్టేషన్ నిర్మాణం వల్ల సమీప పరిశ్రమలకు సరఫరా మెరుగు పడుతుంది. అదేవిధంగా వ్యవసాయ బోర్లకు అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా జరుగుతుంది.
పక్కనే ఉన్న కర్కపట్ల, అలియాబాద్ సబ్‌స్టేషన్లపై కూడా భారం తగ్గనుంది. ఇప్పటికే సబ్‌స్టేషన్ వద్ద స్ట్రక్చర్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు, కంట్రోల్ నిర్మాణాలు పూర్తయ్యాయి. చాలా వరకు లైన్లు కూడా పూర్తి చేశారు. మరో వారం రోజుల్లో కరెంట్ సరఫరాకు వీలుగా సర్వ సన్నద్ధం చేసేందుకు పనులు వేగవంతం చేశారు.
వారం రోజుల్లో ప్రారంభిస్తాం
దామరకుంట వద్ద సబ్‌స్టేషన్ నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను సైతం బిగించాం. ఈ సబ్‌స్టేషన్ ఏర్పాటుతో దామరకుంట రైతులకు, పరిశ్రమలకు, గృహావసరాలకు నాణ్యమైన కరెంట్‌ను అందిస్తాం. సబ్‌స్టేషన్ల మధ్య దూరభారం తగ్గడం వల్ల విద్యుత్ సరఫరాలో చాలావరకు అంతరాయాలు తగ్గుతాయి. మరో వారంరోజుల్లో సబ్‌స్టేషన్ ప్రారంభిస్తాం. - సత్యనారాయణగౌడ్, విద్యుత్ ఏఈ ములుగు