sub-station
-
దామరకుంటలో కొత్త సబ్‌స్టేషన్
వారంలో పనులు పూర్తి.. తీరనున్న రైతుల వెతలు ములుగు: విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్ట పరిచే దిశగా ప్రభుత్వం కొత్త సబ్స్టేషన్లకు శ్రీకారం చుడుతుంది.మెరుగైన విద్యుత్ సరఫరాకు వీలుగా ములుగు మండలంలో మరో కొత్త 5ఎంవీఏ సామర్థ్యంతో విద్యుత్ సబ్‌స్టేషన్ తుది మెరుగులు దిద్దుకుంటుంది. వ్యవసాయానికి నాణ్యతాయుతమైన విద్యుత్ సరఫరాతో పాటు గృహావసరాలకు, సమీప పరిశ్రమలకు కరెంట్ కష్టాలు తీరబోతున్నాయి. దీంతో సమీప సబ్స్టేషన్లపై భారం తగ్గనుంది. ఇందులో భాగంగా ములుగు మండలం దామరకుంట గ్రామంలో రూపు దిద్దుకుంటున్న నూతన సబ్‌స్టేషన్‌పై ప్రత్యేక కథనం.. ములుగు మండలంలో ఇప్పటివరకు ములుగు, అలియాబాద్, క్షీరసాగర్, వంటిమామిడి, కొక్కొండ, కర్కపట్ల, మర్కుక్, కొట్యాల, తున్కిబొల్లారం గ్రామాల్లో 33.11కేవీ సబ్స్టేషన్లున్నాయి. తాజాగా రూ.1.6 కోట్ల వ్యయంతో దామరకుంటలో మరో 33.11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టారు. 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. దీనిని దామరకుంట, ఇండస్ట్రీయల్, వ్యవసాయం కొరకు 3 ఫీడర్లుగా విభజించి మొత్తం 250 ట్రాన్స్ఫార్మర్ల ద్వారా విద్యుత్ సరఫరా కొనసాగించనున్నారు. ఈ కొత్త సబ్‌స్టేషన్ నిర్మాణం వల్ల సమీప పరిశ్రమలకు సరఫరా మెరుగు పడుతుంది. అదేవిధంగా వ్యవసాయ బోర్లకు అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా జరుగుతుంది. పక్కనే ఉన్న కర్కపట్ల, అలియాబాద్ సబ్స్టేషన్లపై కూడా భారం తగ్గనుంది. ఇప్పటికే సబ్‌స్టేషన్ వద్ద స్ట్రక్చర్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, కంట్రోల్ నిర్మాణాలు పూర్తయ్యాయి. చాలా వరకు లైన్లు కూడా పూర్తి చేశారు. మరో వారం రోజుల్లో కరెంట్ సరఫరాకు వీలుగా సర్వ సన్నద్ధం చేసేందుకు పనులు వేగవంతం చేశారు. వారం రోజుల్లో ప్రారంభిస్తాం దామరకుంట వద్ద సబ్‌స్టేషన్ నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే పవర్ ట్రాన్స్ఫార్మర్ను సైతం బిగించాం. ఈ సబ్‌స్టేషన్ ఏర్పాటుతో దామరకుంట రైతులకు, పరిశ్రమలకు, గృహావసరాలకు నాణ్యమైన కరెంట్‌ను అందిస్తాం. సబ్స్టేషన్ల మధ్య దూరభారం తగ్గడం వల్ల విద్యుత్ సరఫరాలో చాలావరకు అంతరాయాలు తగ్గుతాయి. మరో వారంరోజుల్లో సబ్‌స్టేషన్ ప్రారంభిస్తాం. - సత్యనారాయణగౌడ్, విద్యుత్ ఏఈ ములుగు -
వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలి
గాగిళ్ళాపూర్(మద్దూరు) : అప్రకటిత కరెంటు కోతలను నివారించి వ్యవసాయానికి ఏడు గంటల నిరంతర విద్యత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని నర్సాయపల్లి, గాగిళ్లాపూర్ గ్రామాలకు చెందిన రైతులు సోమవారం గాగిళ్లాపూర్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అప్పులు చేసి సాగు చేసిన పంటలు అప్రకటిత కరెంట్ కోతలతో నీరందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా చేయగా ప్రస్తుతం రెండు గంటల కూడా ఉండడం లేదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగానైనా ఐదు గంటల విద్యుత్‌ను కోతలు లేకుండా నిరంతరంగా సరఫరా చేయాలం టూ సబ్‌స్టేషన్ ఆపరేటర్ మల్లారపు అశోక్ ను నిలదీశారు. మద్దూరు ఏఈఈ నాగేం దర్ తమ గోడు పట్టించుకోవడం లేదని, అందుకే అతను ఇక్కడికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ కమింగ్ కటింగ్ సమాయాన్ని తిరిగి కలపాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. మండలంలోని లద్నూరు ఎస్ఎస్ 6 ట్రాన్ఫార్మర్ కాలిపోగా మూడు సార్లు మరమతులు చేసి బిగించినా 20 రోజుల నుంచి ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదు. దీంతో రైతులు ట్రాన్స్ఫార్మవద్ద నిరసన తెలిపారు. జనగామ డీఈఈ వారితో మాట్లాడి మరో ట్రాన్స్ ఫార్మర్ను సాయంత్రం వరకు పంపిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రెండు గ్రామాల రైతులు ప్రభాకర్‌రెడ్డి, వెంకట్ నారాయణ, బండి కిష్టయ్య, మంద బాలయ్య, లక్ష్మణ్, బాలమల్లు, క్రిష్ణారెడ్డి, దాసరి పద్మారెడ్డి, రేకుల నర్సయ్య, పుట్ట ప్రభాకర్, బంగ్ల భాస్కర్, చంద్రం, కాసర్ల కిష్టయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన రైతన్న
వ్యవసాయానికి కరెంటు కోతలపై కన్నెర్ర సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో సారంగాపూర్ : వ్యవసాయానికి అందించే త్రిఫేజ్ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాన్ని నిరసిస్తూ సోమవారం సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. సుమారు 150 మంది రైతులు చించోలి(బి) సబ్‌స్టేషన్ ఎదుట స్వర్ణ-నిర్మల్ ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. కొద్ది రోజులుగా వ్యవసాయానికి అందించే విద్యుత్ సరఫరాలో పదేపదే అంతరాయం కలగడంతో సక్రమంగా నీరందక పంటలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సరఫరా నిలిచిన సమయంలో సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేస్తే పైనుంచి పవర్ పోయిందని అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో పక్కనే ఉన్న సారంగాపూర్, స్వర్ణ గ్రామాల్లోని సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా ఉంటోందని పేర్కొన్నారు. సమస్యను సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కార చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఆదివారం సైతం త్రిఫేజ్ సరఫరాలో నాలుగుసార్లు అంతరాయం కలిగిందని, సుమారు రెండు గంటల విద్యుత్ సరఫరాను నష్టపోయామని తెలిపారు. ట్రాన్స్‌కో ఏఈ మల్లేశ్ సబ్‌స్టేషన్‌కు చేరుకొని రైతులతో మాట్లాడారు. ఆదివారం జరిగిన కరెంటు నష్టాన్ని మిగతా రోజుల్లో భర్తీ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి వెనుదిరిగారు. -
కరెంటు కోసం రైతన్న ఆందోళన
దోమకొండ, లింగంపేట, రెంజల్, వర్ని : వ్యవసాయ బావులవద్ద నిరంత రంగా ఏడు గం టల పాటు కరెంట్ ఇవ్వాలంటూ దోమకొండ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద రైతులు రాస్తారోకో చేశారు. దోమకొండతో పాటు గొట్టిముక్కుల గ్రామానికి చెందిన రైతులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఏఈ వచ్చి తమకు సమాధానం ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. వర్షాలు కురవక పంటలు వేయలేదని, బోరుబావుల కింద వేసిన పంటలు కరెంటు లేక ఎండిపోతున్నాయని వారు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న లైన్ ఇన్స్పెక్టర్ గోపాల్ అక్కడికి చేరుకోగా రైతులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు. రైతులు మైసాగౌడ్, సందెల నర్సింహులు, రాజయ్య, రాజిరెడ్డి, నారాయణ, కిష్టయ్య తదితరులు ఉన్నారు. రెంజల్లో త్రీఫేజ్ కరెంట్‌ను సక్రమంగా అందించాలని డి మాండ్ చేస్తూ మండలంలోని వీరన్నగుట్టకు చెందిన రైతులు రెంజల్‌లోని సబ్‌స్టేషన్‌కు తరలివచ్చి ఆందోళన నిర్వహించారు. ఏఈ అందుబాటులో లేకపోవడంతో సిబ్బందిపై మండిపడ్డారు. రైతులు ఫోన్‌చేసినా ఏఈ లక్ష్మీనారాయ ణ స్పందించలేదు. అధికారులు స్పందించకుం టే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు. రైతులు ఆసాని రమణ, కృష్ణ, గంగారెడ్డి, రవి, లక్ష్మణ్, నగేష్, వెంకట్, యూసూఫ్, రామలక్ష్మణ్ పాల్గొన్నారు. లింగంపేట మండలంలో మండలంలోని పోల్కంపేట గ్రామానికి చెందిన రైతులు గ్రామ శివారులోని సబ్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్‌లో ఉన్న లైన్మెన్ శంకర్, జేఎల్ఎం బాలయ్య, తిరుపతిరెడ్డిలను సబ్‌స్టేషన్‌లోని ఆపరేటర్ గదిలో అరగంట సేపు నిర్బందించారు. సబ్‌స్టేషన్ పరిధిలో కన్నాపూర్,పోతాయిపల్లి,పోల్కంపేట పీడర్లు ఉండగా పోతాయిపల్లి పీడర్‌కు ఎక్కువ సమయం కరెంట్ సరఫరా చేస్తున్నారనీ ఆరోపించారు. అధికారులకు ఫోన్ చేసినా స్పందించడంలేదని ఆరోపించారు. కరెంట్ కోతల వల్ల వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం జేశారు. పోల్కంపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పని చేస్తున్న నలుగురు ఆపరేటర్లను వెంటనే మార్చాలని లేకుంటే, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. గ్రామ మాజీ సర్పంచ్ బండారు రమేశ్‌రెడ్డి, రైతులు దివిటిబాగయ్య,రమేశ్, రాజశేఖర్‌రెడ్డి, వడ్లఎల్లేషం మాసుల భీమయ్య తదితరులు పాల్గొన్నారు. వర్ని మండలంలో మండలంలోని లక్ష్మాపూర్, చందూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని రైతులు ఆందోళన చేపట్టారు. చందూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్నిస్తామని ప్రకటించి మూడు గంటలే ఇస్తున్నారని ఆరోపించారు. లక్ష్మాపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు మేడిపల్లి, లక్ష్మీసాగర్ తాండా, లకా్ష్మపూర్ రైతులు మూకుమ్మడిగా తరలి వెళ్లారు. అక్కడ అపరేటర్ ఒక్కరే ఉండటంతో ఏఈ చందూర్‌లో ఉన్న విషయాన్ని తెలుసుకుని సబ్‌స్టేషన్‌కు తాళం వేసి చందూర్‌కు వచ్చారు. ట్రాన్స్‌కో ఏఈ గోపిని నిలదీశారు. వారంరోజులుగా విద్యుత్ సరాఫరాలో తీవ్ర అటంకం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి సబ్‌స్టేషన్ కార్యాలయానికీ తాళం వేసి ట్రాన్స్‌కో సిబ్బందిని నిర్బధించారు. కరెంటును నిరాటంకంగా సరాఫరా చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో చందూర్, గోవూర్ రైతులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ఊరట
గజ్వేల్, న్యూస్‌లైన్: నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఐదు సబ్స్టేషన్ల నిర్మాణానికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నిధుల కొరత కారణంగా ఈ ప్రక్రియ రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న విషయం తెల్సిందే. తాజాగా రూ.10 కోట్ల నిధులు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల్లో పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశమున్నట్టు సమాచారం.నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్ మండలాల్లో 33/11కేవీ సబ్‌సేష్టన్‌లు 21 వరకు ఉన్నాయి. గజ్వేల్‌లో అదనంగా 132/33కేవీ సబ్‌స్టేషన్ కూడా ఉంది. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డితోపాటు మెదక్ జిల్లాకు విద్యుత్ సరఫరానందించే 400 కేవీ సబ్‌స్టేషన్ కూడా ఇక్కడే ఉంది. నియోజకవర్గంలో అధికార, అనధికారికం గా కలుపుకొని 22 వేలకుపైగా వ్యవసాయ కనెక్షన్లు ఉండగా సీజన్లో నిత్యం 100 మెగావాట్లకుపైగా విద్యుత్ అవసరముంటుంది. నాణ్యమైన విద్యుత్‌ను అవసరమైన స్థాయిలో అందించేందుకు 400 కేవీ సబ్‌స్టేషన్ ఉన్నా ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు నియోజకవర్గంలోని గ్రామాల్లో తగినన్ని 33/ 11కేవీ, 132/33కేవీ సబ్స్టేషన్లు లేకపోవడం సమస్యగా మారింది. ఫలితంగా లో-ఓల్టేజీ సమస్యలు తలెత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వర్గల్ మండలం పాములపర్తి, సీతారామ్‌పల్లి, ములుగు మండలం క్షీరసాగర్, కొండపాక మండలం బందారం, జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్, తూప్రాన్ మండలం మల్కాపూర్, గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామాల్లో కొత్తగా ఏడు 33/11కేవీ సబ్స్టేషన్ల ఏర్పాటుకు రెండున్నరేళ్లక్రితం వర్గల్లో నిర్వహించిన రచ్చబండలో సీఎం అంగీకారం తెలిపారు. మొదటి విడతలో అప్పట్లోనే రెండింటికి మాత్రమే నిధులు మంజూరయ్యాయి. వర్గల్ మండలం పాములపర్తి, ములుగు మండలం క్షీరసాగర్‌లో 33/11కేవీ సబ్స్టేషన్ల ఏర్పాటుకు రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. పాములపర్తిలో పనులు ముగింపు దశలో ఉండగా క్షీరసాగర్‌లో చురుగ్గా సాగుతున్నాయి. ఇక పెండింగ్‌లో ఉన్న మిగిలిన ఐదు సబ్స్టేషన్ల నిర్మాణానికి తాజాగా రూ.10 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని ఏపీసీపీడీసీఎల్(ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) డీఈ రాజశేఖర్ ‘న్యూస్‌లైన్’ మాట్లాడుతూ ధ్రువీకరించారు. మూడు నెలల్లోపు టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమయ్యే అవకాశముందని ఆయన వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే గనుక రైతుల ఇబ్బందులు తీరనున్నాయి.