రోడ్డెక్కిన రైతన్న
వ్యవసాయానికి కరెంటు కోతలపై కన్నెర్ర
సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో
సారంగాపూర్ : వ్యవసాయానికి అందించే త్రిఫేజ్ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాన్ని నిరసిస్తూ సోమవారం సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. సుమారు 150 మంది రైతులు చించోలి(బి) సబ్‌స్టేషన్ ఎదుట స్వర్ణ-నిర్మల్ ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. కొద్ది రోజులుగా వ్యవసాయానికి అందించే విద్యుత్ సరఫరాలో పదేపదే అంతరాయం కలగడంతో సక్రమంగా నీరందక పంటలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సరఫరా నిలిచిన సమయంలో సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేస్తే పైనుంచి పవర్ పోయిందని అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు.
అదే సమయంలో పక్కనే ఉన్న సారంగాపూర్, స్వర్ణ గ్రామాల్లోని సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా ఉంటోందని పేర్కొన్నారు. సమస్యను సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కార చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఆదివారం సైతం త్రిఫేజ్ సరఫరాలో నాలుగుసార్లు అంతరాయం కలిగిందని, సుమారు రెండు గంటల విద్యుత్ సరఫరాను నష్టపోయామని తెలిపారు. ట్రాన్స్‌కో ఏఈ మల్లేశ్ సబ్‌స్టేషన్‌కు చేరుకొని రైతులతో మాట్లాడారు. ఆదివారం జరిగిన కరెంటు నష్టాన్ని మిగతా రోజుల్లో భర్తీ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి వెనుదిరిగారు.