అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాయాంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేకుండా పోయిందని సీపీఐ అనుబంధ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జాతీయ కార్యదర్శి బీవీ విజయలక్ష్మి అన్నారు. అనంతపురంలో మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభలకు వచ్చిన సందర్భంగా సోమవారం ఆమె పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కాల్‌మనీ వ్యాపారానికి ప్రభుత్వమే మద్దతు పలుకుతోందన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మహిళా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం దారుణమని విజయలక్ష్మి అన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించిన అంగన్‌వాడీలను సీఎం చంద్రబాబు కొట్టించారని.. ఇలాంటి చరిత్ర ఆయనకు చాలా ఉందని ఆమె నిప్పులు చెరిగారు. రాజధాని కోసం అవసరానికి మించి 35 వేల ఎకరాల భూసేకరణ చేసి రైతులను రోడ్డున పడేసిందన్నారు. మద్యం మాఫియాను సర్కారే పెంచి పోషిస్తోందని విజయలక్ష్మి దుయ్యబట్టారు.