
వీణావాణిల గోడు పట్టని ‘నిలోఫర్’
♦ శస్త్రచికిత్స కోసం ఎయిమ్స్‌తో మాట్లాడాలని సర్కార్ ఆదేశం
♦ 15 రోజులు దాటినా స్పందించని నిలోఫర్ వైద్యులు
♦ అక్టోబర్ 15తో 13వ ఏట అడుగిడిన అవిభక్త కవలలు
సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణిలను వేరు చేసే ప్రక్రియ ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. వీరికి శస్త్రచికిత్స చేయడానికి ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులను సంప్రదించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మొదట్లో ఆదేశించినప్పటికీ నిలోఫర్ ఆస్పత్రి వైద్యుల్లో కదలిక కనిపించడంలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్‌కు చెందిన గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ డేవిడ్ డునావే, డాక్టర్ జిలానీల బృందం హైదరాబాద్‌కొచ్చి నిలోఫర్‌లో ఉన్న వీణావాణిలను పరిశీలించింది. వారిని లండన్‌కు తీసుకువస్తే శస్త్రచికిత్స చేసి వేరు చేస్తామని చెప్పింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం వీణావాణిలకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స నిర్వహిద్దామని, లండన్ నుంచి వైద్యులను ఇక్కడకే రప్పిస్తే బావుం టుందని భావించింది. ఇదే అంశంపై ఎయిమ్స్‌కు సమాచారం ఇచ్చింది. ఎనిమిది నెలలు గడచినా స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరలో ఎయిమ్స్ వైద్యులను సంప్రదించాలని వైద్య విద్యా సంచాలకుడి (డీఎంఈ)ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడాలని డీఎంఈ, నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఈనెల 5వ తేదీన ఆదేశించారు.
15 రోజులు దాటినా ఎయిమ్స్ వైద్యులతో ఇంతవరకూ మాట్లాడలేదని తెలుస్తోంది. అక్టోబర్ 15తో వీణావాణిలు 13వ ఏట అడుగు పెట్టారు. కవలలు పెద్దవాళ్లవుతుండటం, నీలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రి కావడంతో ఇబ్బందులొస్తాయంటున్నారు. జాప్యంపై నీలోఫర్ సూపరిండెంటెంట్‌ను ఫోన్‌లో సంప్రదించగా..ఆయన స్పందించలేదు.
2003 నుంచీ ఇదే పరిస్థితి..
► వరంగల్ జిల్లాకు చెందిన మురళి, నాగలక్ష్మిలకు 2003లో వీణావాణిలు జన్మించారు. అప్పట్నుంచీ ఇప్పటివరకూ ఈ అవిభక్త కవలల శస్త్రచికిత్స అంశం అనేక మలుపులు తిరుగుతోంది.
► 2003లో జన్మించిన ఈ కవలను డాక్టర్ నాయుడమ్మ గుంటూరు తీసుకెళ్లారు. అక్కడే 2006 వరకూ ఉన్నారు. ఆపరేషన్ కుదరక తిరిగి వీరిని నీలోఫర్‌కు చేర్చారు.
► 2007లో ముంబై బ్రీచ్‌కాండీ ఆస్పత్రి వై ద్యులు సర్జరీ చేయడానికి సిద్ధమయ్యా రు. చిన్నారులను ముంబైకి తరలించారు. అయితే చికిత్స కార్యరూపం దాల్చకపోవడంతో తిరిగి వెనక్కు వచ్చారు.
► 2009లో సింగపూర్‌కు చెందిన డాక్టర్ కీత్‌గో బృందం వీరిని పరిశీలించినా తల్లిదండ్రులు శస్త్రచికిత్సకు ఆమోదం తెలపకపోవడంతో ఆగిపోయింది.
► 2015 ఫిబ్రవరి 8న లండన్‌కు చెందిన డాక్టర్ డునావే, డాక్టర్ జిలానీలు నీలోఫర్‌కు వచ్చి వీణావాణిలను పరిశీలించి లండన్‌కు తీసుకొస్తే శస్త్రచికిత్స చేస్తామన్నారు. కానీ ప్రభుత్వం ఎయిమ్స్‌లో చేయాలని సూచించింది.
► ఆపరేషన్ తర్వాత వచ్చే సమస్యలను ఎదుర్కొనడానికి తమవద్ద సరైన వసతులు లేవనే అభిప్రాయంతో ఎయిమ్స్ వైద్యులు ఉన్నట్టు సమాచారం.