సాక్షి, నల్లగొండ : జిల్లాలో బ్యాంకర్ల అలసత్వం కొనసాగుతూనే ఉంది. మూడు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో బ్యాంకులు మూతపడగా.. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బ్యాంకులు తెరచిన నాడైనా ప్రజానీకానికి ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాల్సిన బ్యాంకర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలు వ్యాపార వర్గాలకు దొంగ దారిన ఇస్తున్నారని ఇంటెలిజెన్స్, సీబీఐ వరకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా.. సామాన్య జనాన్ని కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా మంగళవారంజిల్లాలో బ్యాంకర్లు ప్రాంతానికో రీతిలో, బ్యాంకుకో విధంగా వ్యవహరించారు. అకౌంట్ ఉన్న ప్రతి ఖాతాదారుడికి రూ.4వేలు రోజుకు కచ్చితంగా ఇవ్వాలన్న నిబంధనను కేంద్రమే విధించినా.. డబ్బులు లేవన్న సాకుతో దాన్ని రూ.2వేల వరకు కుదించారు. చాలాచోట్ల బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు పెట్టారు. టోకెన్లు ఇచ్చిన తర్వాత డబ్బులు లేవని చెప్పి పంపించేయడం వంటి ఘటనలు సైతం చోటుచేసుకోవడంతో పలు ప్రాంతాల ప్రజలు ఆగ్రాహావేశాలు వ్యక్తం చేశారు. ఉదయం 8 నుంచి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డా, సాయంత్రం వరకు ఎదురు చూసినా.. కావాల్సినంత డబ్బులు రాకపోవడంతో ఖాతాదారులు చేసేదేమీ లేక నిరాశగా వెళ్లిపోవాల్సి వచ్చింది. జిల్లాలో అధిక ప్రాంతాల్లో ఏటీఎంలు ఇంకా తెరచుకోలేదు. అక్కడక్కడా నాలుగైదు ఏటీఎం కేంద్రాలు తెరచినా, గంట సమయంలోనే డబ్బులు నిండుకున్నాయి.
జిల్లాలోని మంగళవారం నాటి పరిస్థితి..
మునుగోడు : నియోజకవర్గ వ్యాప్తంగా బ్యాంకుల వద్ద జనం బారులుదీరారు. చౌటుప్పల్‌లో బ్యాంకులకు జనం పెద్ద ఎత్తున రావడంతో తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చండూరులో రెండు బ్యాంకుల్లో మినహా ఇతర బ్యాంకుల వద్ద నో క్యాష్ బోర్డులే దర్శనమిచ్చాయి. మర్రిగూడలో రూ.4వేల నుంచి రూ.6వేల వరకు ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా 31 ఏటీఎంలు పనిచేయలేదు.
నాగార్జునసాగర్ : నియోజకవర్గంలో కూడా అన్ని బ్యాంకుల వద్ద డబ్బుల కోసం ప్రజలు క్యూ కట్టారు. త్రిపురారం మండల కేంద్రంలోని ఎస్‌బీహెచ్ వద్ద గంటల తరబడి క్యూలో నిల్చొన్న వారికి రూ.2వేలు ఇచ్చి పంపించారు. ఏపీజీవీబీలో మాత్రం ఖాతాదారులకు రూ. 4 వేలు అందించారు. హాలియా మండలంలోని ఎస్‌బీహెచ్‌లోé రూ. 4 వేలు ఇచ్చారు. 10 రూపాయల నాణేలు కావడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రాబ్యాంకులో ప్రజలకు రూ. 10 వేలు అందించారు. కార్పొరేషన్ బ్యాంకులో నోక్యాష్ బోర్డు పెట్టారు.
గుర్రంపోడు మండలంలోని కొప్పోలు ఎస్‌బీఐలో కూడా అదే పరిస్థితి కనిపించింది. గుర్రంపోడు ఏపీజీవీబీలో రూ.2వేలే ఇచ్చారు. పెద్దవూర మండలంలోని ఆంధ్రా బ్యాంకులో ముందుగానే 300 మంది ఖాతాదారులకు టోకెన్‌లు ఇచ్చి ఒక్కొకరికీ రూ. 10 వేల చొప్పున డబ్బులు అందించారు. ఏపీజీవీబీలో రూ. 2వేల చొప్పున అందించారు. సాగర్‌లో ఎస్‌బీహెచ్, కెనరా బ్యాంకులో ఖాతాదారులకు రూ. 2 వేల చొప్పున నగదును ఇచ్చారు. నిడమనూరు మండలంలోని ఏపీజీవీబీ బ్యాంకులో రూ. 3 వేలు, సెంట్రల్ బ్యాంకులో రూ. 4 వేలు, ఆంధ్రాబ్యాంకులో రూ. 5 వేల చొప్పున ప్రజలకు అందించారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని ఏటీఎం సెంటర్లలో నోమనీ బోర్డులే కనిపించాయి. మిర్యాలగూడ : పట్టణంలో బ్యాంకుల వద్ద పెద్ద బారులు కనిపించాయి. పట్టణంలో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం మాత్రమే తెరిచి ఉంది. మాడ్గులపల్లిలోని ఎపీజీవీబీలో నోక్యాష్ బోర్డు పెట్టారు. వేములపల్లిలోని నాగార్జున గ్రామీణ బ్యాంకు, ఎస్‌బీహెచ్‌లో భారీగా జనం బారులుదీరారు.అక్కడ రూ.2 నుంచి రూ.4వేలు మాత్రమే ఇచ్చారు. మిర్యాలగూడలోని ఎస్‌బీఐలో రూ.2 వేల నుంచి రూ.24వేల వరకు ఇచ్చారు. అవంతీపురంలోని సిండికేట్ బ్యాంకులో 15 రోజులుగా డబ్బులు లేకపోవడం వల్ల ఖాతాదారులు వచ్చి వెళ్లిపోతున్నారు.
నకిరేకల్ : నియోజకవర్గంలో బ్యాంక్‌లు తెరవకముందే ఉదయం నుంచే బారులుదీరారు. నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్, చిట్యాల, నార్కట్‌పల్లి, శాలిగౌరారం మండలాలలోని ఆయా బ్యాంక్‌ల వద్ద ప్రజలు కిక్కిరిసిపోయారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడంతో నో క్యాష్ బోర్డులు కనిపించాయి. నకిరేకల్‌లో ఎస్‌బీహెచ్, ఆంధ్రాబ్యాంక్‌లలో రూ.6వేలు లోపు మాత్రం నగదు చేతికి ఇచ్చారు. ఎస్‌బీఐలో ఖాతాదారులకు 150 టోకెన్లు ఇచ్చినప్పటికీ.. నగదు రాకపోవడంతో వెనక్కు పంపించారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల బ్యాంక్‌లో రూ.2వేలు ఇచ్చారు. కట్టంగూరు, ఈదులూరు గ్రామీణ వికాస బ్యాంక్‌ల ముందు పొదస్తమానం పడిగాపులు కాసినా నోక్యాష్ బోర్డులే దర్శనమిచ్చాయి. కేతేపల్లి మండలంలో గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున 100 మందికి రూ.4 లక్షలు ఇచ్చారు. శాలిగౌరారం మండలంలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ ఎస్‌బిహెచ్‌లో డబ్బులు రాకపోవడంతో నో క్యాష్ బోర్డులు పెట్టారు. చిట్యాల మండలంలో ఒకరికి నాలుగు వేల కంటె ఎక్కువ ఇవ్వలేదు. నార్కట్‌పల్లి మండలంలో ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐలో మాత్రం రూ.5వేలు ఇచ్చారు. మిగతా బ్యాంక్‌లలో రూ.2వేలు చొప్పున ఇచ్చారు.
నల్లగొండ : నగదు కోసం పట్టణ ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. పట్టణంలోని ఒక్క ఏటీఎంలో మాత్రమే డబ్బులు పెట్టారు. అవి మధ్యాహ్నం వరకు అయిపోయాయి. కొన్ని బ్యాంకుల్లో రూ.6వేలు, రూ. 10వేలు ఇచ్చారు. కనగల్, తిప్పర్తి, నల్లగొండ మండలాల్లోని డబ్బుల కోసం ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా మండలాల్లో నాలుగు రోజులుగా తెరచుకోని ఏటీఎంలు మంగళవారం మాత్రం తెరచుకున్నాయి.
దేవరకొండ : నియోజకవర్గంలో 17 ఏటీఎంలు ఉండగా ఇందులో మంగళవారం దేవరకొండ, కొండమల్లేపల్లిలోని మూడు ఏటీఎంలు మాత్రం పనిచేశాయి. మిగతా ఎక్కడా ఏటీఎంలు పని చేసిన దాఖలాలు లేవు. పీఏపల్లి మండల కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంకు వద్ద డబ్బుల కోసం వచ్చిన ఓ మహిళ గంటల తరబడి క్యూలో నిల్చొంది. ఈ క్రమంలో కళ్లు తిరిగి కిందపడగా.. క్యూలో ఉన్న వారు ఆమెకు సపర్యలు చేశారు.
ఒక్కో చోట తంతు
Published Wed, Dec 14 2016 3:29 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement