హెల్మెట్ ఉంటేనే రోడ్డెక్కండి..
► ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ను పకడ్బందీగా అమలు చేయండి
► అధికారులను ఆదేశించిన కలెక్టర్ జగన్‌మోహన్
► ఎస్పీ దుగ్గల్‌తో కలిసి నిర్మల్‌లో సమీక్ష
► ‘సాక్షి’ కథనంతో జిల్లా యంత్రాంగంలో చలనం
నిర్మల్‌రూరల్ : రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ విధానం ‘ఒక్కరోజు మురిపెం..!’ కాదని కలెక్టర్ జగన్‌మోహన్ స్పష్టం చేశారు. ఇక హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనదారులు రోడ్డు కూడా ఎక్కవద్దన్నారు. రోడ్డుభద్రత, హెల్మెట్ విధానం అమలుపై ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్‌తో కలిసి శుక్రవారం నిర్మల్‌లోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతిభవనంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూడాలన్నారు. జిల్లాలో ఫెలైట్ ప్రాజెక్టుగా చేపట్టిన నో హెల్మెట్-నో పెట్రోల్ విధానాన్ని పకడ్బందీగా అమలుపర్చాలన్నారు. పెట్రోల్ బంకులు ఈ విధానాన్ని పాటించేలా చూడాలన్నారు.
లేదంటే బంకులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. వీటి సహకారంతో హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారిపై చర్యలు చేపట్టాలన్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ వాహనదారులు హెల్మెట్ ధరించేలా చూడాలన్నారు. అలాగే హెల్మెట్, రోడ్డుభద్రతలపై విద్యాశాఖాధికారులు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. రెవెన్యూ, పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
కేసులు నమోదు చేయండి : ఎస్పీ దుగ్గల్
రోడ్డుభద్రత నిబంధనలను పాటించని వారిపై కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించాలని ఎస్పీ విక్రమ్‌జిత్‌దుగ్గల్ ఆదేశించారు. హెల్మెట్ విధానం కచ్చితంగా అమలయ్యేలా పోలీస్ సిబ్బంది చూడాలని చెప్పారు. సమావేశంలో ఆర్డీవోలు సీహెచ్ శివలింగయ్య, సుధాకర్‌రెడ్డి, నిర్మల్ డీఎస్పీ మనోహర్‌రెడ్డి, సీఐలు జీవన్‌రెడ్డి, పురుషోత్తమచారి, తహశీల్దార్లు జాడి రాజేశ్వర్, నారాయణ, రామస్వామి, స్రవంతి, శ్యాంసుందర్, సహాయ పౌరసరఫరాల అధికారి ఎండీ వాజిద్‌అలీ పాల్గొన్నారు.
‘సాక్షి’ కథనంతో చలనం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్2 నుంచి జిల్లా కలెక్టర్ జగన్‌మోహన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నో హెల్మెట్-నో పెట్రోల్ విధానం ఆ ఒక్కరోజుకే పరిమితమైంది. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, పర్యవేక్షణ లోపంతో మూడురోజుల ముచ్చటగా మారింది. దీనిపై సాక్షి దినపత్రిక ‘ఒక్కరోజు మురిపెం..!’ పేరిట శుక్రవారం కథనాన్ని ప్రచురించింది. ఈమేరకు కలెక్టర్, ఎస్పీ, జిల్లా రవాణాశాఖాధికారులు స్పందించి, సమీక్ష సమావేశం నిర్వహించారు.