9 రోజులు... 36 వేల కేసులు | 'Helmet' challan issued by the cast in special drive | Sakshi
Sakshi News home page

9 రోజులు... 36 వేల కేసులు

Published Thu, Mar 10 2016 12:05 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

9 రోజులు... 36 వేల కేసులు - Sakshi

9 రోజులు... 36 వేల కేసులు

‘హెల్మెట్’ స్పెషల్ డ్రైవ్‌లో  చలాన్ల జారీ తీరిదీ
డ్రైవింగ్ లెసైన్స్ లేని వారి  వాహనాలు స్వాధీనం
యజమాని పేరు మారని 350 వాహనాలు కూడా..
వారెంట్లకు సిద్ధమవుతున్న అధికారులు

 
సిటీబ్యూరో: హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపేస్తామంటే ఇకపై కుదరదు. ‘ట్రాఫిక్ పోలీసులు చూడడం లేదు కదా... ఫర్వాలేదులే’ అనుకున్నా సాగదు. సీసీ కెమెరా కంటితో చూసి పట్టేస్తారు. నగర వ్యాప్తంగా ఈ నెల 1 నుంచి ‘హెల్మెట్ మస్ట్’ కార్యక్రమం ప్రారంభమైంది. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారిపై 9 రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు 36 వేల కేసులు నమోదు చేశారు. డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనం నడుపుతూ రెండోసారి చిక్కిన 40, యజమాని పేరు బదిలీ చేసుకోని మరో 300 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ట్రాఫిక్ విభాగం డీసీపీ-2 ఏవీ రంగనాథ్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు.

రెండు రకాలుగా...
ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేని వాహన చోదకులపై రెండు రకాలుగా కేసులు నమోదు చేస్తున్నారు. ఓ పక్క క్షేత్ర స్థాయి సిబ్బంది రహదారులపై వాహనాలను ఆపి జరిమానాలు విధిస్తున్నారు. మరోపక్క ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లోని సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా చౌరస్తాల్లో ఆగిన వాహనాల్లో హెల్మెట్  లేని చోదకులను గుర్తిస్తున్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందీ వారి చేతిలోని డిజిటల్ కెమెరాలతో ఇలాంటి వారి ఫొటోలు తీసుకున్నారు. వాహనాల నెంబర్ల ఆధారంగా చోదకులకు ఈ-చలాన్లు పంపిస్తున్నారు. ఈ తరహా కేసుల సంఖ్యా వేలల్లోనే ఉంటోందని డీసీపీ రంగనాథ్ వివరించారు.
 
డీఎల్ లేని 40 వాహనాలు స్వాధీనం
ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ నెల 2 నుంచి డ్రైవింగ్ లెసైన్స్ (డీఎల్) లేకుండా వాహనాలు నడుపుతూ పదే పదే చిక్కిన వారి వివరాలతో డేటాబేస్ రూపొందిస్తున్నారు. తరచూ ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించడానికి ప్రత్యేక డేటాబేస్ వినియోగిస్తున్న అధికారులు... బుధవారం వరకు 40 మందిని గుర్తించారు. ఇలాంటి వారు ఇళ్లవద్ద ఉన్న డీఎల్ తీసుకు వస్తామంటూ వాహనాలను వదిలి వెళ్తున్నారు. డీఎల్ లేకుండా పదే పదే చిక్కిన నేరంపై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలైతే ఒక రోజు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దీనికి భయపడిన పలువురు తమ వాహనాలను అలానే వదిలేస్తున్నారని రంగనాథ్ వివరించారు. ఈ 40 వాహనాలపై త్వరలో న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నామని చెప్పారు. కోర్టు ద్వారా చోదకులపై వారెంట్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తూ న్యాయస్థానానికి తీసుకువెళ్తామని ఆయన స్పష్టం చేశారు. గడిచిన ఎనిమిది రోజుల్లో డీఎల్ లేకుండా వాహనాలు నడుపుతూ 4 వేల మంది పోలీసులకు చిక్కారు.
 
కచ్చితంగా ‘యజమాని మారాల్సిందే’
ప్రస్తుతం నగరంలోని వాహనాల్లో దాదాపు ఎనిమిది లక్షలు చోదకుల పేర్లపై లేవని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ప్రధానంగా సెకండ్ హ్యాం డ్ మార్కెట్‌లో వాహనాలు ఖరీదు చేస్తున్న చోదకులు రిజిస్ట్రేషన్‌ను తమ పేరు మీదికి మార్చుకోవట్లేదని చెబుతున్నారు. ఇది చలాన్ల జారీతో పాటు అత్యవసర సందర్భాల్లోనూ ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత నెలలో విలేకరుల సమావేశం నిర్వహించిన ట్రాఫిక్ చీఫ్ జితేందర్ రిజిస్ట్రేషన్ మార్చుకోవాలని విజ్ఞప్తి చేయడంతో పాటు చర్యలు తప్పవనీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్‌ను మార్చుకోకుండా వాహనాలు వినియోగిస్తున్న వారిపై బుధవారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
 
తొలిరోజు 300...
సెకండ్ హ్యాండ్ వాహనాలను ఖరీదు చేసి, రిజిస్ట్రేషన్‌ను తమ పేరుకు మార్చుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న చోదకులపై బుధవారం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో 300 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీరు చెప్పిన వివరాలు, ఆర్టీఏ డేటాబేస్‌లో ఉన్న అంశాలతో సరిపోలకపోవడంతో సీజ్ చేసి గోషామహల్ పోలీసు స్టేడియంకు తరలించారు. యాజమాన్యం మార్పు చేసుకున్న తర్వాతే వీటిని చోదకులకు అప్పగించనున్నారు. మరోపక్క తప్పుడు నెంబర్ ప్లేట్లను పెట్టుకుని తిరుగుతున్న 50 వాహనాలను బుధవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహన చోదకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా వాహనాలను యజమానులకు తిరిగి ఇచ్చే అవకాశం లేదని నగర ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
 
అలాంటి వాటికి మినహాయింపు: ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ-2
నగరంలో అనేక మంది వాహన చోదకులు వివిధ కారణాల నేపథ్యంలో తమ వాహనాలను భార్య, కుటుంబీకుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. అలాంటి వారికి ‘యాజమాన్యం మార్పు’ నుంచి మినహాయింపు ఇస్తున్నాం. క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు వీరిని ఆపి తనిఖీ చేసినప్పుడు వివరాలు చెప్పాల్సి ఉంటుంది. దాంతో పాటు వాహనం ఎవరి పేరుతో ఉందో... వారికి సంబంధించిన ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్ తదితర ఏదో ఒక గుర్తింపు సమర్పించాలి. సాధారణంగా వీటిని ఎవరూ వెంట ఉంచుకోరు. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఇంటి నుంచి వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా తక్షణం తెప్పించమని కోరుతున్నాం. ఆ అవకాశం లేని వారికి తర్వాత చూపించే అవకాశం ఇస్తున్నాం. ఈ గుర్తింపు పత్రాల్లో ఉన్న వివరాలను ఆన్‌లైన్‌లో సరిచూసే అవకాశం పీడీఏ మిషన్లలో ఉంటుంది. వివరాలు సరిపోలని వాహనచోదకులు యాజమాన్యం మార్చుకోనట్లే భావించి చర్యలు తీసుకుంటాం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement