రైతన్నతో పరిహాసమా? | no loan Wavier, no exgratia to farmers in ananthapur district | Sakshi
Sakshi News home page

రైతన్నతో పరిహాసమా?

Published Thu, Jan 14 2016 3:23 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

రైతన్నతో పరిహాసమా? - Sakshi

రైతన్నతో పరిహాసమా?

రుణమాఫీ లేదు... పరిహారమూ లేదు...
* అనంతపురం జిల్లాలో బలవన్మరణాలు  * సాక్షి పరిశీలనలో వెల్లడైన రైతు, చేనేత కుటుంబాల దీనగాథలు
 
 ‘‘రుణమాఫీ చేసేశాం.. రాష్ర్టంలో రైతులంతా సుఖసంతోషాలతో ఉన్నారు’’ అని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు... తొలుత ఏపీలో ఆత్మహత్యలే లేవన్నారు.. తర్వాత ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. ఆ పరిహారాన్ని కూడా అందరికీ ఇచ్చేశామని ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతూ వచ్చారు.
 
 రుణమాఫీ హామీని నమ్ముకున్న రైతులు బ్యాంకులకు అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో ఆ అప్పులు అపరాధ వడ్డీతో కలసి తడిసి మోపెడయ్యాయని, అప్పుల బాధతోనే రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచీ చెబుతున్నారు. రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ... ప్రభుత్వం కళ్లు తెరిపించడం కోసం అనంతపురం జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’ చేస్తానని అసెంబ్లీలో ఆయన ప్రకటించారు. అందులో భాగంగానే  వైఎస్ జగన్ అనంతపురంలో ఇప్పటికి నాలుగు విడతలు భరోసా యాత్ర పూర్తి చేశారు. 70 కుటుంబాలను పరామర్శించారు.
 
 ఇంతకూ ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది..
 రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు నిజమేనా.. వారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేమిటి.. రుణమాఫీ జరిగిందా.. చనిపోయిన కుటుంబాలకు పరిహారం అందిందా.. అసలు ఆత్మహత్య చేసుకుంటున్న వారి కుటుంబాలేమంటున్నాయి... ఈ  అంశాలను సాక్షి పరిశీలించింది. నాలుగో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ జగన్ గతవారం అనంతపురం జిల్లాలో పరామర్శించిన 28 కుటుంబాలను ‘సాక్షి’ పలుకరించింది. తమ కుటుంబంలో ఆత్మహత్య చోటు చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులను వారు వివరించారు.. ఆత్మహత్యలకు కారణాలనే కాదు.. కారకులను కూడా వారు వేలెత్తి చూపుతున్నారు.. ఆ వివరాలను వారి మాటల్లోనే చూద్దాం..
 
 ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు..
 ‘గోల్డ్‌లోన్ రూ.50వేలు, డ్వాక్రా అప్పు రూ.20వేలు ఉంది.  ఎన్నికలకు ముందు డ్వాక్రా, బంగారు రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు. మాఫీ చేసి ఉంటే మాకు రూ. 70వేలు మాఫీ అయ్యేది! కానీ ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. అప్పుచెల్లించే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులు లేకపోయినా...ఉన్న అప్పుల్లో కొద్దిగా మాఫీ అయినా మా ఆయన బతికేవారు!  అసలు మా ఆయనపేరును ఆత్మహత్యల జాబితాలోకే చేర్చలేదంట! అందుకే పరిహారం ఇవ్వలేదు. అప్పులబాధతో పిల్లోన్ని కూడా చదివించుకోలేకపోతున్నాం!’  
 - ముత్యాలమ్మ, నారాయణస్వామి భార్య
 
 కప్పల నారాయణస్వామి (35) చేనేత కార్మికుడు
 భార్య: ముత్యాలమ్మ
 పిల్లలు: నవీన్‌కుమార్
 గ్రామం: వైఎస్సార్‌కాలనీ, ధర్మవరం
 ఆత్మహత్య చేసుకున్నది : 30-5-2015
 
 మాఫీ మోసం వల్లే నా కొడుకు ఆత్మహత్య
 ‘మాకు 20 ఎకరాల భూమి ఉంది. వేరుశనగ, కంది, వరి, పండ్ల తోటలు సాగు చేస్తున్నాం! రూ.2లక్షలు క్రాప్‌లోన్ తీసుకున్నాం! ఇందులో రూ.30వేలే మాఫీ అయింది. అది అపరాధ వడ్డీకి కూడా సరిపోలేదు. పంటరుణాలను పూర్తిగా మాఫీ చేయకుండా మోసం చేయడం వల్లే మా కొడుకు చనిపోయాడు. ఆత్మహత్యలు చేసుకునేందుకు మాఫీ ప్రకటన చేశారా? అని నాతో పాటు రైతులంతా వేదనపడుతున్నారు. అప్పులు కట్టలేక  చెట్టంత కొడుకును పొగొట్టుకోవల్సి వచ్చింది.ప్రభుత్వం ఆత్మహత్యను గుర్తించలేదు. పరిహారం ఇవ్వలేదు’
 -నెట్టం కేశన్న, కరుణాకర్ తండ్రి
 
 నెట్టం కరుణాకర్ (30) అవివాహితుడు, రైతు
 తల్లిదండ్రులు : నెట్టం కేశన్న, రత్నమ్మ
 ఊరు : కనగానపల్లి
 ఆత్మహత్య చేసుకున్నది : 27-8-2015
 
 అప్పులే ప్రాణం తీశాయి...
 ‘మాకు నాలుగు మగ్గాలున్నాయి. మాకు ఆర్టిజాన్ కార్డు లేక  బ్యాంకు అప్పు పుట్టలేదు. 18 నెలలుగా ముడిపట్టు రాయితీ అందడం లేదు. అప్పులు తీర్చడం భారమైంది. దీంతో నే ఆయన చనిపోయారు. అప్పులు లేకపోయి ఉంటే మా ఆయన ఈరోజు నా కళ్లముందు ఉండేవారు! ఈ ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించలేదు. పరిహారం ఇవ్వలేదు.’
 - సిరి, బండి రాము భార్య
 
 బండి రాము. (30) చేనేత కార్మికుడు
 భార్య: సిరి
 పిల్లలు: లేరు
 ఊరు: ధర్మవరం
 ఆత్మహత్య చేసుకున్నది: 29-10-2014
 
 
 ఆత్మహత్యను గుర్తించినా పరిహారం లేదు!
 ‘మాకు బ్యాంకు రుణం ఇవ్వలేదు. డ్వాక్రా రుణం రాలేదు. ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. అప్పులు చెల్లించలేక మా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించింది. అయినా ఇప్పటి దాకా రూపాయి కూడా ఇవ్వలేదు.’              - సుబ్బలక్ష్మి, మల్లికార్జున భార్య
 
 మల్లికార్జున (45) చేనేత కార్మికుడు
 భార్య: సుబ్బలక్ష్మి
 పిల్లలు: ముగ్గురు కుమార్తెలు, కుమారుడు
 ఊరు: ధర్మవరం
 ఆత్మహత్య చేసుకున్నది : 31-5-2015
 
 ఒక్క రూపాయీ పరిహారమివ్వలేదు
 ‘మగ్గం నేయడమే మా బతుకుదెరువు! మా అమ్మ ఇంట్లో జారిపడటంతో కాలు విరిగిపోయింది. మా నాన్న, అమ్మ మగ్గం నేసేవారు. మాకు ఆర్టిజాన్ కార్డు ఇవ్వలేదు. దీంతో బ్యాంకు అప్పు ఇవ్వలేదు. వడ్డీకి రూ.1.50లక్షలు అప్పు తెచ్చుకున్నాం. బతికేమార్గం లేక రేషన్‌కార్డు కూడా తాకట్టుపెట్టాం.   నాన్న ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించలేదు. రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు!’  
 - షాహినా, బాషా కుమార్తె
 
 షేక్ మహమ్మద్ ఉస్మాన్‌బాషా (45), చేనేత కార్మికుడు
 భార్య: షేక్ జుబేదా
 పిల్లలు: షాహినా, షెక్షావలి
 గ్రామం: ధర్మవరం
 ఆత్మహత్య చేసుకున్నది: 23-8-2015
 
 చావునూ గుర్తించలేదు
 ‘మా కుమారుడు నవీన్ 16 మగ్గాలు నేసేవాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మేం మగ్గాలు అమ్మేసి బెంగళూరులో గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం. మా కుమారుడి ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించలేదు. పైసా కూడా పరిహారం ఇవ్వలేదు.’    
   - గోపాలకృష్ణ, నవీన్ కుమార్ తండ్రి
 
  నవీన్‌కుమార్ (20) అవివాహితుడు, చేనేత కార్మికుడు
 తల్లిదండ్రులు: గోపాలకష్ణ, ఆదిరెడ్డమ్మ, ఇద్దరు అక్కలు ఉన్నారు.
 ఊరు : ధర్మవరం
 ఆత్మహత్య చేసుకున్నది: 10-10-2014
 
 అప్పుల బెంగతోనే నా బిడ్డ ఆత్మహత్య
 ‘రూ.33వేలు క్రాప్‌లోన్, మరో రూ. 35వేలు గోల్డ్‌లోన్, రూ.50వేలు డ్వాక్రా అప్పు ఉంది. మొత్తం అప్పులు మాఫీ అవుతాయని అనుకున్నాం! గోల్డ్, డ్వాక్రా లోను రూ.85వేలు అప్పు నిలబడి పోయింది. దీంతో మధు తీవ్రంగా వేదనపడ్డాడు. అప్పులు మాఫీ కాకపోతే ఎట్టా కట్టేది అని రోజూ ఇంట్లో కుమిలిపోతుంటే నేను ధైర్యం చెప్పేవాణ్ని! అయినా ఆత్మహత్య చేసుకున్నాడు, ప్రభుత్వం ఆత్మహత్యను గుర్తించలేదు. పరిహారం ఇవ్వలేదు.’
  - ఓబుళప్ప, మధు తండ్రి
 
 బోయ మధుకుమార్(23)
 అవివాహితుడు, రైతు
 తల్లిదండ్రులు: పద్మావతి, ఓబుళప్ప
 ఊరు: కందుకూరు, అనంతపురం రూరల్ మండలం
 ఆత్మహత్య చేసుకున్నది: 04-12-2014
 
 మాఫీ జరిగి ఉంటే.. అమ్మానాన్నలు బతికేవారేమో!
 ‘మా అమ్మా, నాన్న ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.  అప్పులు తీర్చలేక మా అమ్మా,నాన్న చనిపోయారు.  మగ్గాల కోసం అప్పుచేసిన రూ.1.60 లక్షలైనా ప్రభుత్వం మాఫీ చేసి ఉంటే ఊరట కలిగి మా అమ్మా, నాన్నా ఉండేవాళ్లేమో! అప్పులు మమ్మల్ని అనాథలను చేశాయి.ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.5లక్షలు ఇసానన్నారు. రూ.లక్ష మాత్రం ఇచ్చినారు.  పరిహారం పూర్తిగా రాకపోవడంతో మాకు అప్పు లు కట్టేమార్గం లేదు. ఎట్టా బతకాలో కూడా మాకు తెలీడం లేదు!’         
 -లతీష్, ఇందు (రమేశ్, రమాదేవి పిల్లలు)
 
 చట్టా రమేష్ (35) (చేనేత కార్మికుడు)
 ఆత్మహత్య చేసుకున్నది: 31-01-2015
 చట్టా రమాదేవి(34) (చేనేత కార్మికురాలు)
 ఆత్మహత్య చేసుకున్నది: 12-02-2015
 పిల్లలు: లతీష్, ఇందు
 గ్రామం: వైఎస్సార్‌కాలనీ, ధర్మవరం
 
 వడ్డీకి కూడా చాలని మాఫీ మొత్తం...
 ‘మాకు 14ఎకరాల పొలం ఉంది. పంటసాగుకోసం రూ.1.50లక్షలు తెచ్చుకున్నాం. సరిపోలేదు. బంగారం తాకట్టుపెట్టి మరో రూ. 1,42,485 తెచ్చుకున్నాం. డ్వాక్రా అప్పు రూ.50వేలు..కలిపి మొత్తం 3.42లక్షలు అప్పుంది. చంద్రబాబు హామీ ఇచ్చినట్లు రైతు, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేసి ఉంటే మా జీవితాలు సాఫీగా ఉండేవి. కానీ కేవలం రూ.20,754 మాత్రమే మాఫీ అయింది. అది వడ్డీకి కూడా సరిపోలేదు. దీంతో అప్పులు తీర్చలేక మా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం ఆత్మహత్యను గుర్తించలేదు. పరిహారం ఇవ్వలేదు.’  
 - తిప్పమ్మ, కుళ్లాయప్పభార్య
 
 గవ్వల కుళ్లాయప్ప (65), రైతు
 భార్య: తిప్పమ్మ
 పిల్లలు: కుమారులు ముగ్గురు, కూతుళ్లు ఇద్దరు.
 గ్రామం: ధర్మవరం
 ఆత్మహత్య చేసుకున్నది  : 26-9-2015
 
 బంగారు రుణం పైసా కూడా మాఫీ కాలేదు...
 ‘బ్యాంక్‌లో బంగారం తాకట్టుపెట్టి రూ.80 వేలు రుణం తెచ్చుకున్నాం.  కానీ ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలా అని బాధ...తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. బంగారు రుణం మాఫీ అయినా నా భార్య బతికి ఉండేదేమో!. ప్రభుత్వం  ఆత్మహత్యను గుర్తించలేదు. పరిహారం ఇవ్వలేదు.’  
 - నవీన్‌కుమార్, లక్ష్మీదేవి భర్త
 
 లక్ష్మిదేవి (28) చేనేత కార్మికురాలు
 భర్త పేరు: నవీన్‌కుమార్‌రెడ్డి
 పిల్లలు: భార్గవి, కీర్తన, రమ్య
 ఊరు: ధర్మవరం
 ఆత్మహత్య చేసుకున్నది: 02-6-2015
 
 మాఫీ కోసం ఇచ్చింది వడ్డీకి కూడా చాల్లేదు..
 ‘మా ఆయన రూ.31 వేలు క్రాప్‌లోన్ తీసుకున్నారు. బంగారం పెట్టి రూ. 95 వేలు తీసుకున్నాడు. నాపేరుమీద  రూ. 93,595 పంట రుణం ఉంది. క్రాప్‌లోన్, గోల్డ్‌లోన్ కలిపి దాదాపు రూ.2.20లక్షలు మాఫీ కావాల్సి ఉండగా అన్నీ కలిపి రూ.20వేలే మాఫీ అయింది. అది అపరాధ వడ్డీకి కూడా సరిపోలేదు. రుణమాఫీ జరిగి ఉంటే మా ఆయన బతికేవారు. ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించినా ఎలాం టి పరిహారమూ ఇవ్వలేదు.’
 -నాగేంద్రమ్మ,
 నారాయణరెడ్డి భార్య
 
 నారాయణరెడ్డి,(50) రైతు
 భార్య: నాగేంద్రమ్మ
 పిల్లలు: సుదర్శన్‌రెడ్డి, ఓబిరెడ్డి
 గ్రామం: యర్రగుంట, రాప్తాడు మండలం
 ఆత్మహత్య చేసుకున్నది : 29-7-2015
 
 మాఫీ జరిగితే నా భర్త బతికేవాడు..
 ‘మాకు ఐదెకరాల పొలం ఉంది. రూ. 80వేలు క్రాప్‌లోన్, రూ.40వేలు డ్వాక్రా లోన్ ఉంది. ప్రభుత్వం చెప్పినట్లు రుణమాఫీ చేస్తే రూ.1.20లక్షలు మాఫీ కావాలి. కానీ మాకు కేవలం రూ.12వేలు క్రాప్‌లోన్ మాఫీ అయింది. రుణాలు మాఫీ అయి ఉంటే మా ఆయన బతికే ఉండేవారు!  ఈ ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించింది కానీ పైసా కూడా పరిహారం ఇవ్వలేదు.’             - శివమ్మ, నాగేష్ భార్య
 
 చాపట్ల నాగేష్ (48) రైతు
 భార్య: శివమ్మ
 పిల్లలు : కుమారుడు, కుమార్తె
 ఊరు : యర్రాయపల్లి, బత్తలపల్లి మండలం
 ఆత్మహత్య చేసుకున్నది : 22-07-2015
 
 డ్వాక్రా అప్పు మాఫీ కాలేదు..
 ‘మాకు రెండు మగ్గాలున్నాయి.   డ్వాక్రా అప్పు రూ.30వేలు ఉంది.  మాఫీ అవుతాది అన్నారు. రూపాయి కూడా మాఫీ కాలేదు. అప్పులబాధతో మా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యను గుర్తించలేదు.  ఎలాంటి పరిహారమూ అందలేదు.’  
 - ఆరతి, బాలాజీ భార్య
 
 పూజారి బాలాజి (36) చేనేత కార్మికుడు
 భార్య: ఆరతి
 పిల్లలు: రూప, విధిత
 ఊరు:ధర్మవరం
 ఆత్మహత్య చేసుకున్నది: 07-06-2015
 
 పైసా పరిహారం ఇవ్వలేదు..
 ‘మా కొడుకే కుటుంబాన్ని పోషిస్తున్నారు.  27 ఏళ్లు దాటినా ఇంటికోసం ఇంకా పెళ్లి చేసుకోలేదు. అప్పుల వత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం గుర్తించింది కానీ, పరిహారం ఇవ్వలేదు.’
 -అమ్మన్ని, గోవర్ధన్ తల్లి
 
 చింతా గోవర్ధన్ (27),
 అవివాహితుడు, చేనేత కార్మికుడు
 తల్లిదండ్రులు: అమ్మన్ని, కుళ్లాయప్ప
 ఊరు: ధర్మవరం
 ఆత్మహత్య చేసుకున్నది: 20-09-2014

 డ్వాక్రా అప్పు మాఫీ కాలేదు
 ‘రూ.35వేలు డ్వాక్రా అప్పు తెచ్చుకున్నాం. రుణమాఫీ చేస్తాం.. అప్పు కట్టొద్దంటే నేను చెల్లించలేదు. వడ్డీ భారీగా పెరిగింది. అప్పు తీర్చేమార్గం లేక మా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కనీసం డ్వాక్రా అప్పు మాఫీ అయినా ధైర్యం తెచ్చుకునేవాడేమో! ప్రభుత్వం ఆత్మహత్యను గుర్తించలేదు. పరిహారం ఇవ్వలేదు.’ - త్రివేణి, వీరారెడ్డి భార్య
 
 తుమ్మల వీరారెడ్డి (40) చేనేత కార్మికుడు
 భార్య:  త్రివేణి
 పిల్లలు: మోహన్, విద్యాసాగర్
 ఊరు: ధర్మవరం
 ఆత్మహత్య చేసుకున్నది : 2-8-2015
 
 అప్పుల బాధతో ఆత్మహత్య
 ‘‘అప్పుల బాధతో మా ఆయన పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో పిల్లలు ప్రశాంతి( 5), అక్షయ్‌కుమార్(2)లను పోషించడమే కష్టంగా ఉంది’
 - ధనలక్ష్మి, ధనుంజయ భార్య
 
 సానే ధనుంజయ (30) రైతు
 భార్యపేరు: ధనలక్ష్మి
 గ్రామం: ఉప్పరపల్లి  
 ఆత్మహత్య చేసుకున్నది:  29-1-2015
 
 
 రుణాలు మాఫీ కాలేదు...
 ‘మాకు నాలుగు మగ్గాలుండేవి. ఆర్టిజాన్‌కార్డు ఉన్నా బ్యాంకు అప్పు ఇవ్వలేదు. ఏదైనా ష్యూరిటీ పెట్టాలన్నారు. దీంతో 12 తులాలు బంగారం తాకట్టుపెట్టి రూ.1.80లక్షలు అప్పు చేశాం! రూ. 50వేలు డ్వాక్రా అప్పు ఉంది.  రెండింటిలో ఒక్క అర్థ రూపాయి కూడా మాఫీ కాలేదు.    - అరుణ, పోతిరెడ్డి భార్య.
 
 బసిరెడ్డి గారి పోతిరెడ్డి (39) చేనేత కార్మికుడు
 భార్య: అరుణ
 పిల్లలు: కుమార్తె, కుమారుడు
 ఊరు: గొట్లూరు, ధర్మవరం (మం)
 ఆత్మహత్య చేసుకున్నది : 16-04-2015
 
 
 మా ఆయన్ను ప్రభుత్వమే చంపేసింది...
 ‘మాకు నాలుగెకరాల పొలం ఉంది.  పంటసాగు కోసం రూ. 80 వేలు పంటరుణం తీసుకొన్నాం. రూ.20వేలు డ్వాక్రా అప్పు ఉంది. రెండూ కలిపి రూ.లక్ష రూపాయలయ్యాయి. పైసా కూడా మాఫీ కాలేదు. మాఫీ కాక వేదనపడి మా ఆయన చనిపోయారు. మా ఆయన్ను ప్రభుత్వమే చంపేసింది. పైగా ఆయన ఆత్మహత్య రైతు ఆత్మహత్య కాదంట! ప్రభుత్వం గుర్తించలేదు. రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు’
 - సావిత్రమ్మ,
 సుధాకరరెడ్డి భార్య
 
 ఎం. సుధాకరరెడ్డి  (38) రైతు
 భార్య: సావిత్రమ్మ
 పిల్లలు: ఒక కుమారుడు, ఒక కుమార్తె
 ఊరు: పాతపాళ్యం, కనగానపల్లి మండలం
 
 
 రుణమాఫీ జరక్కపోబట్టే నా భర్త ఆత్మహత్య..
 ‘మాకు రూ. 1.20లక్షలు క్రాప్‌లోన్, రూ.1.70లక్షలు గోల్డ్‌లోన్ ఉంది. రూ. 19వేలు మాత్రమే మాఫీ అయింది. అది  అపరాధ వడ్డీకి కూడా రాలేదు. రూ.40వేలు డ్వాక్రా అప్పుంది. మాఫీ కాలేదు. రుణమాఫీ పూర్తిగా జరిగితే మా ఆయన ఆత్మహత్య చేసుకునేవారు కాదు.  ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించలేదు. పైసా కూడా పరిహారం ఇవ్వలేదు.                                      -రామేశ్వరమ్మ, సత్యనారాయణ గౌడ్ భార్య
 
 పండ్ల సత్యనారాయణ గౌడ్ (65) రైతు
 భార్య పేరు: రామేశ్వరమ్మ
 ఊరు: చిగిచెర్ల, ధర్మవరం మండలం
 ఆత్మహత్య చేసుకున్నది : 13-9-2015
 
 
 వడ్డీకి కూడా చాలని మాఫీ మొత్తం!
 ‘బ్యాంకులో రూ.84వేలు క్రాప్‌లోన్ తీసుకున్నాం. కేవలం రూ. 16వేలు మాఫీ అయింది. అది వడ్డీకి కూడా సరిపోలేదు. బోర్ల కోసం మరో రూ.2లక్షలు అప్పు చేశారు. అప్పులే మా ఆయన్ను చంపేశాయి. చిన్నపిల్లలతో ఎలా బతకాలో కూడా తెలీడం లేదు. ప్రభుత్వం ఆత్మహత్యను కూడా గుర్తించలేదు. పరిహారం ఇవ్వలేదు.       -సునీత, ఉదయ్‌కుమార్ భార్య
 
 బండి ఉదయ్‌కుమార్ (27) రైతు
 భార్య : సునీత
 పిల్లలు: ఉహశ్విణి, ఉజ్వల్
 గ్రామం: కందుకూరు, అనంతపురం రూరల్
 ఆత్మహత్య చేసుకున్నది : 06-7-2015
 
 
 పైసా కూడా పరిహారమివ్వలేదు
 ‘డ్వాక్రా అప్పు రూ.20వేలు ఉంది. మాఫీ కాలేదు. అప్పులభారంతో మా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించలేదు. పరిహారం పైసా కూడా ఇవ్వలేదు. అప్పులబాధతో చనిపోయినా రైతు ఆత్మహత్యగా గుర్తించకపోతే ఎట్టాసార్ మేం బతికేది!                                        
 - అక్కమ్మ, మారుతీప్రసాద్ భార్య
 
 పొన్నా మారుతీప్రసాద్, (28) రైతు
 భార్య : అక్కమ్మ
 పిల్లలు: వర్షిత (18 నెలలు)
 ఊరు: ఉప్పరపల్లి, అనంతపురం రూరల్ (మం)
 ఆత్మహత్య చేసుకున్నది: 26-7-2014
 
 మాఫీ జరక్కపోవడం వల్లే..
 ‘మాకు రూ.90వేలు క్రాప్‌లోన్ ఉంది. 3తులాలు బంగారంపై రూ.30వేలు అప్పుతీసుకున్నాం! దీర్ఘకాలిక వ్యవసాయ రుణం రూ. 3.30 లక్షలు ఉంది. డ్వాక్రా అప్పు రూ.50వేలు ఉంది. రుణమాఫీపై చంద్రబాబు చాలా చెప్పారు. కానీ రూపాయి కూడా మాఫీ కాలేదు. మాఫీ జరక్కపోవడం వల్లే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించలేదు. పరిహారం ఇవ్వలేదు.          - ఈశ్వరమ్మ, ఆదినారాయణరెడ్డి భార్య
 
 కె. ఆదినారాయణరెడ్డి (64) ైరైతు
 భార్య : కె. ఈశ్వరమ్మ
 పిల్లలు: రవీంద్రారెడ్డి, గోవిందరెడ్డి
 ఊరు: పూలకుంట, అనంతపురం రూరల్
 ఆత్మహత్య చేసుకున్నది:  28-10-2015
 
 
 రూపాయి కూడా పరిహారమివ్వలేదు..
 ‘మేం మగ్గం నేసి బతికేవాళ్లం. ఆరు తులాలు బంగారు తాకట్టుపెట్టి రూ.80వేలు అప్పు తెచ్చుకున్నాం. రూపాయి కూడా మాఫీ కాలేదు. రూ.7వేలు డ్వాక్రా అప్పుమాఫీ కాలేదు.  ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించింది. కానీ రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. రోజూ కూలిపనికి పోయి బతుకున్నాం’     - వరలక్ష్మి, రామాంజనేయులు భార్య
 
 బి. రామాంజనేయులు,(39) చేనేత కార్మికుడు
 భార్య : బి. వరలక్ష్మి
 పిల్లలు: సంధ్యారాణి, రాజ్‌కుమార్
 ఊరు: కొడిమి, అనంతపురం రూరల్ (మం)
 ఆత్మహత్య చేసుకున్నది:25-6-2015
 
 
 రూపాయి కూడా మాఫీ కాలేదు
 ‘మాకు 8 ఎకరాల పొలం ఉంది. రూ.లక్ష క్రాప్‌లోన్ తీసుకున్నాం. రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. డ్వాక్రా అప్పు రూ.25వేలు మాఫీకాలేదు.  పొలం పెట్టుకుని, కూలిపనికి పోతూ బిడ్డను చదివించుకుంటున్నా! ప్రభుత్వం గుర్తించలేదు. నుంచి ఎలాంటి పరిహారం లేదు.
 - ప్రమీలమ్మ, లక్ష్మన్ననాయక్ భార్య
 
 కె. లక్ష్మన్ననాయక్ (49) రైతు
 భార్య: ప్రమీలమ్మ
 పిల్లలు: ఇద్దరు కుమారులు, కుమార్తె
 ఊరు: నరసనాయునికుంట, అనంతపురం రూరల్ మండలం
 ఆత్మహత్య చేసుకున్నది: 25-12-2015
 
 
 మాఫీ కాకపోబట్టే ఆత్మహత్య
 ‘1.60 సెంట్ల పొలం వుంది. బ్యాంక్‌లో  రూ.12 వేలు పంట రుణం ఉంది. డ్వాక్రా అప్పు రూ.10 వేలు ఉంది. ఏవీ మాఫీ కాలేదు.  ఈ ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించింది. రూ.1.50లక్షలు మాత్రమే పరిహారం ఇచ్చారు. అప్పులు కట్టలేకనే మా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.   - ఈశ్వరమ్మ, లక్ష్మానాయక్ భార్య
 
 సుగాలి లకా్ష్మనాయక్ (50) రైతు
 భార్య : ఈశ్వరమ్మ
 పిల్లలు: ఇద్దరు కుమారులు  
 గ్రామం:  నరసనాయునికుంట, అనంతపురం రూరల్ మండలం
 ఆత్మహత్య చేసుకున్నది : 11-2-2014
 
 మాఫీ జరిగితే మా ఆయన బతికేవాడు..
 ‘రూ.70వేలు క్రాప్‌లోన్ తీసుకున్నాం. మాఫీ పేరుతో ఇచ్చిన రూ.14,806 వడ్డీకే చాలలేదు.  ఈ ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించలేదు.  రుణమాఫీ చేస్తామనే మాటను నిలుపుకుని ఉంటే మా ఆయన బతికేవారు’ - నాగలక్షుమ్మ, రామచంద్రారెడ్డి భార్య
 
 
 వన్నా రామచంద్రారెడ్డి (60)
 భార్య : నాగలక్ష్మమ్మ
 గ్రామం: వెంకటాంపల్లి, చెన్నేకొత్తపల్లి మండలం
 ఆత్మహత్య చేసుకున్నది : 11-10-2015
 
 అసలు, అపరాధ వడ్డీ తడిసి మోపెడయ్యాయి...
 ‘మాకు ఐదెకరాల పొలం ఉంది. రూ.30వేలు క్రాప్‌లోన్ తీసుకున్నాం. రూ.17,500 వడ్డీ అయింది. మొత్తం రూ.47,500లో ఒక్క రూపాయి మాఫీ కాలేదు.   ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. రుణమాఫీ చేసి ఉంటే మా ఆయన ఆత్మహత్య చేసుకునేవారు కాదు.’
                 - మేకల నిర్మల, నాగేంద్ర భార్య
 
 మేకల నాగేంద్ర (26) రైతు
 భార్య: మేకల నిర్మల
 పిల్లలు   : కుమారుడు, కుమార్తె
 ఊరు: కోనాపురం, కనగానపల్లి (మం)
 ఆత్మహత్య చేసుకున్నది :26-7-2015
 
 రుణమాఫీ కాకపోవడం వల్లే ఆత్మహత్య
 ‘పంటసాగు కోసం రూ. 1.76లక్షలు క్రాప్‌లోన్ తీసుకున్నాం. ఇందులో రూ.41వేలు మాత్రమే మాఫీ అయింది. అది వడ్డీకి కూడా చాలలేదు. లక్ష రూపాయలు గోల్డ్‌లోన్ ఉంది. రూపాయి కూడా మాఫీ కాలేదు.  దాంతో దాదాపు రూ.2.30లక్షల అప్పు మానెత్తిన పడింది. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో వేదనపడి చనిపోయారు. రుణమాఫీనే ఆ ఆయన్ను చంపేసింది. ఈ ఆత్మహత్యను ప్రభుత్వం గుర్తించింది. ఇంకా పరిహారం ఇవ్వలేదు.        -మాలతమ్మ, సోమశేఖర్ భార్య
 
 సోమశేఖర్ (45) రైతు
 భార్య: మాలతమ్మ  (40)
 పిల్లలు: కుమారుడు దయాసాగర్(6)
 గ్రామం: బసంపల్లి, చెన్నేకొత్తపల్లి (మం) ఆత్మహత్యచేసుకున్నది : 19-5-2015
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement