మందుల్లేవ్‌! | no more medicines | Sakshi
Sakshi News home page

మందుల్లేవ్‌!

Published Tue, Sep 20 2016 10:21 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

జిల్లాస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు

జిల్లాస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు

  •  జిల్లాస్పత్రిలో దయనీయ పరిస్థితి 
  •  జర్వం, దగ్గు మందులు కూడా కరువు 
  •  ప్రతి చిన్న రోగానికి బయట కొనాల్సిందే
  •  అవస్థలు పడుతున్న నిరుపేద రోగులు
  • మహబూబ్‌నగర్‌ క్రైం: పేరుకే పెద్దాస్పత్రి.. ప్రతిరోజూ వందలాది మంది రోగులు తమ వ్యాధులను నయం చేసుకునేందుకు ఎంతో ఆశతో ఇక్కడికి వస్తున్నారు. కానీ వారికి కావాల్సిన మందులు దొరకడం లేదు. సీజనల్‌ వ్యాధుల కాలం కావడంతో కనీసం జ్వరం, దగ్గుకు సంబంధించిన మందులు సైతం అందుబాటులో లేవు. జిల్లా మందుల పంపిణీ కేంద్రం నుంచి కొన్ని రకాలే సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైన ఇతర మందులను ఆస్పత్రి అధికారులు బయట కొనుగోలు చేసి అందించాలి.. కానీ బడ్జెట్‌ లేదని చెబుతున్నారు. 
     
    బయట కొనాల్సిందే..
    జిల్లా మందుల పంపిణీకేంద్రం నుంచి సరఫరా కానీ మందులను జిల్లాస్పత్రి యంత్రాంగం కొనుగోలు చేసి రోగులకు అందించాలి. ఇందుకోసం అవసరమైన బడ్జెట్‌ ఆస్పత్రిలో లేదని అధికారులు చెబుతున్నారు. ఆరునెలల నుంచి బయట మందులు కొనుగోలు చేయడానికి రూ.6లక్షల బడ్జెట్‌ ఇప్పటివరకు రాలేదని ఓ అధికారి చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యులు రాసిచ్చిన మందుల్లో కొన్ని మాత్రమే దొరుకుతున్నాయి. మిగతా మందులు బయట కొనుగోలు చేసుకోవాలని స్థానిక విధుల్లో ఉన్న సిబ్బంది రోగులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సాధారణ మందులు కూడా లభించడం లేదు. ఇటీవల వాతావరణ మార్పుల కారణంగా చాలామంది చిన్నారులు జ్వరం, జలుబుతో ఆస్పత్రికి వస్తున్నారు. చిన్న పిల్లలకు టానిక్‌లు ఇవ్వాల్సి ఉంది. కాగా, జ్వరానికి అవసరమైన పారాసిటమాల్‌ టానిక్‌ కొన్ని రోజులుగా ఆస్పత్రిలో అందుబాటులో లేదు. అంటాసిడ్‌ సిరప్, క్యాల్షియం, ఐరన్‌ పొలిక్‌ మాత్రలు కూడా లేవు. ఇక నొప్పులు తగ్గించడానికి వాడే మాత్రలు రెండురోజులు అందుబాటులో ఉంటే మరో రెండు రోజులు లభించడం లేదు. ఆర్థికస్థోమత ఉన్న రోగులు బయట ప్రైవేట్‌ మందుల దుకాణాల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. స్థోమత లేనివారు ఇచ్చిన మందుల వాడుతూ ఆరోగ్యం మెరుగుపడక ఇబ్బందులు పడుతున్నారు.
     
    అంతా సర్దుబాటే..
    ఔట్‌ పేషంట్లు పరిస్థితి ఇలా ఉంటే ఆస్పత్రిలో ఉండి వైద్యం పొందుతున్న రోగుల పరిస్థితి అందుకు విభిన్నంగా ఏమీ లేదు. వైద్యులు రాసిచ్చిన మందులు అందుబాటులో లేకపోతే బయటనుంచి తెచ్చుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు. లేదా ఉన్న మందులనే సర్దుబాటు చేస్తున్నారు. మందులన్నీ ఎందుకు లేవని రోగులు ప్రశ్నించలేని పరిస్థితి. ప్రశ్నిస్తే వైద్యులు, సిబ్బందికి కోపం వచ్చి సరిగ్గా వైద్యం అందిస్తారో లేదోననే భయం వారిలో ఉంది. 
     
    బడ్జెట్‌ రాక.. మందులు కొనక..  
    జిల్లా మందుల కేంద్రం నుంచి జిల్లా జనరల్‌ ఆస్పత్రికి మందులను సరఫరా చేయడానికి ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు రూ.30లక్షల నిధులు కేటాయిస్తోంది. అలాగే మందులు లేని సమయంలో అత్యవసర పరిస్థితుల్లో బయట మందులు కొనుగోలు చేయడానికి ప్రతి మూడు నెలలకోసారి రూ.3 లక్షల నిధులు ఇస్తోంది. ఆరు నెలలుగా ఈ నిధులు రాకపోవడంతో సమస్య తీవ్రమైంది. బడ్జెట్‌ కేటాయించిన తర్వాత సకాలంలో వాటిని విడుదల చేయకపోవడంతో మందులు కొనుగోలు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం 450 రకాల మందులు మాత్రమే సరఫరా అవుతున్నాయి. అత్యవసరమైన పిల్లల జ్వరం టానిక్‌(పారసిటమాల్‌) సైతం సరఫరా కావడం లేదు. విరేచనాలకు అవసరమైన ఫెరజోలడోన్, మానసిక రోగులకు, అత్యవసర రోగులకు నిద్ర కోసం అందించాల్సిన డైజోఫామ్‌ మాత్రలు, ఇంజక్షన్‌ సైతం సరఫరా లేదు. మరోవైపు మందులకు కేటాయిస్తున్న నిధులు.. ఖర్చు, సరఫరా చేస్తున్న మందులపైన సరైన పర్యవేక్షణ లేకుండాపోయింది. 
     
    అత్యవసర  మందులు కరువు
    ప్రస్తుతం ఆస్పత్రిలో అత్యవసరమందులు అందుబాటులో లేవు. పారాసిటమల్, సైక్లోఫామ్, డెరిఫైలిన్, ఆర్టిసోనేట్, ఈమాల్, క్వినైన్‌ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, కిటామైన్, మెడజోలం వంటి ఇంజక్షన్లు కూడా లేవు. డైక్లోఫెనాక్, సర్భిట్రేట్, బీకాంప్లెక్స్, డెపిన్‌(సబ్‌లింగ్‌వల్‌ క్యాప్సల్‌), విటమిన్‌ ‘ఏ’ ద్రవం ఆస్పత్రిలో దొరకడం లేదు. వీటిని కొనుగోలు చేస్తున్నామని వైద్యులు చెబుతున్నా.. రోగులకు మాత్రం ఇవ్వడం లేదు. 
     
    ఆరునెలల బడ్జెట్‌ రావాలి 
    మందుల నిల్వ కేంద్రంలో మందులు లేని సమయంలో బయట కొనుగోలు చేయడానికి అవసరమైన బడ్జెట్‌ ఆరు నెలల నుంచి రావడం లేదు. దీంతో కొంత ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాను. ప్రస్తుతం సీజనల్‌ కావడంతో అత్యవసరమైన మందులను తీసుకువస్తాం. –రాంబాబునాయక్, జిల్లాస్పత్రి సూపరింటెండెంట్‌ 
     
     
    ఐదు రకాలు రాస్తే.. ఒక్కటీ లేదు!
    జిల్లాకేంద్రంలోని పోలీస్‌లైన్‌ చెందిన సుమలత మంగళవారం మోకాళ్ల నొప్పులు రావడంతో వైద్యం కోసం జిల్లాస్పత్రికి వచ్చింది. నొప్పులు తగ్గడానికి డాక్టర్‌ ఐదు రకాల మందులు రాసిచ్చాడు. చీటి తీసుకుని మందుల సెంటర్‌కు వెళితే.. అక్కడ ఉన్న వారు చీటి చూసి ఇవీ లేవు బయట తీసుకోమని సలహా ఇచ్చారు. చీటిపై రాసిన ఐదు రకాల మందుల్లో ఏ ఒక్కటీ లేకపోవడంతో ఈ ఆస్పత్రికి రావడం లాభం లేదని ఆమె తిట్టుకుంటూ వెళ్లిపోయింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement