గత కొన్నేళ్లనుంచి క్రమం తప్పకుండా వచ్చి బెంబేలెత్తిస్తున్న వైరస్‌ల జాబితాలో నిపా కూడా చేరింది. కేరళలోని కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో బయటపడి ఆ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తూ మరణించిన ఒక నర్సుతోసహా ఇంతవరకూ పదకొండుమంది ప్రాణాలు కోల్పోయారు. నిపా వైరస్‌ను ఈ ఏడాది అత్యవసరంగా పరిశోధించదగిన 10 వ్యాధికారకాల్లో ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం వల్లనైతేనేమి...సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతుండటం వల్లనైతేనేమి ఆ వ్యాధి పేరెత్తితే జనం బెంబేలు పడిపోతున్నారు. పరిశోధించదగిన వ్యాధికారకమని చెప్పడమంటే ఈ వైరస్‌కు ప్రస్తుతం మందు లేదని ప్రకటించడమే.
అది కేరళలోని రెండు జిల్లాల్లో రెండు ప్రాంతాల్లో బయటపడింది తప్ప వేరెక్కడా దాని జాడ లేదని... వెంటనే ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నాం గనుక భయాందోళనలు అనవసరమని కేరళ ప్రభుత్వం ప్రకటించాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈలోగానే పొరుగునున్న కర్ణాటకలోని మంగళూరులో దాని ఛాయలు కనబడ్డాయని వార్తలు రావడంతో మళ్లీ వణుకు మొదలైంది. జ్వరంతో మొదలై శ్వాసకోశ ఇబ్బందులు, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు వగైరాలన్నీ చుట్టుముట్టి రోగిని ఊపి రాడకుండా చేస్తాయని... పది పన్నెండు రోజులకు అపస్మారక స్థితికి తీసుకెళ్తుందని వైద్యులు చెప్పే మాట. చివరిగా బ్రెయిన్ ఫీవర్‌తో మరణం సంభవిస్తుందని చెబుతున్నారు. వ్యాధి సోకినవారిలో 70 శాతంమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇప్పుడు నిపా వైరస్ కావొచ్చు... రెండేళ్లక్రితం జికా వైరస్ కావొచ్చు...అంతకు రెండేళ్ల ముందు ఆఫ్రికాను వణికించిన ఎబోలా కావొచ్చు... మధ్యమధ్యన అడపా దడపా కనిపిస్తూనే ఉన్న స్వైన్‌ఫ్లూ కావొచ్చు–ఇవన్నీ కొత్త వ్యాధులు కావు. కానీ కొత్తగా శక్తి సంతరించుకుని మళ్లీ మళ్లీ వస్తున్న మహమ్మారులు. నిపా కూడా మొదటగా 1999లో మలేసియాలోని కాంపంగ్ సుంగై నిపా అనే పట్టణంలో వెల్లడైంది. అప్పట్లో 300మందికి ఇది సోకగా వారిలో వందమంది చనిపోయారు. ఆ తర్వాత 2001లో పశ్చిమబెంగాల్‌లోని సిలిగుడిలో దీని జాడ వెల్లడైంది. దాన్ని నిపా వైరస్‌గా గుర్తించేసరికే ఆర్నెల్లు పట్టింది. ఈలోగా 45మంది ఆ వ్యాధితో మృత్యువాత పడ్డారు. అప్పటితో పోలిస్తే వ్యాధిని వెనువెంటనే గుర్తించగలిగారు. దాని నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయంలో కేరళ ప్రజారోగ్య సిబ్బందిని ప్రశంసించాలి. రెండో వ్యాధిగ్రస్తుడి తోనే ఈ వైరస్ ఉనికిని అక్కడి వైద్యులు పసిగట్టగలిగారు.
అయితే గతంతో పోలిస్తే ఒకచోటు నుంచి మరోచోటుకు రాకపోకలు కూడా బాగా పెరిగాయి గనుక ఒకచోట నియంత్రణకు పూనుకునే లోగానే మరోచోట అది కనబడే ప్రమాదం కూడా లేకపోలేదు. అందువల్లే ఇటువంటి వ్యాధుల విషయంలో తక్షణ స్పందన అత్యవసరం. ఆ ఉద్దేశంతోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలంగాణ ప్రభుత్వం అంటున్నది. వ్యాధి నిరోధక వైద్య సంస్థ(ఐపీఎం)ను నోడల్ ఏజెన్సీగా ఉంచి ప్రధాన ఆసుపత్రులన్నిటా ప్రత్యేక వార్డులు నెలకొల్పామని చెబుతోంది. దీంతోపాటు వ్యాధి లక్షణాలపై బాగా ప్రచారం చేసి, అవి కనబడిన వెంటనే తగిన వైద్య పరీక్షలు చేయించాలన్న అవగాహన పెంచాలి. ఒకరి నుంచి మరొకరికి నేరుగా వ్యాపించే లక్షణం నిపా వైరస్‌కు లేకపోవడం ఉన్నంతలో ఉపశమనమనే అనుకోవాలి. లేనట్టయితే అధిక జనాభా, అరకొర పారిశుద్ధ్యం ఉన్న మనలాంటి దేశాల్లో అది ఉగ్రరూపం దాల్చడం తేలిక.
నిపా వైరస్ ఆర్‌ఎన్‌ఏ వైరస్ గనుక అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులంటున్నారు. ఈ రకం వైరస్‌లలో ఆకస్మిక పరివర్తనం అధికంగా ఉండటమే అందుకు కారణం. అందువల్లే నిపా మనిషి శరీరంలో వేగంగా, అపరిమితంగా విస్తరిస్తుంది. వ్యాధిగ్రస్తుల్లో ఏకకాలంలో అనేక రకాల లక్షణాలు కనబడటానికి, మరణాల రేటు అధికంగా ఉండటానికి కారణం ఇదే. అయితే అంటు వ్యాధి కాకపోవడంవల్ల ఇతరులకు వేగంగా సోకే అవకాశం లేదు. ఇప్పుడు గబ్బిలాలు కొరికి పడే సిన పండ్లు తిన్నవారికి ఈ వ్యాధి వ్యాపిస్తోంది. అలాగే వ్యాధిగ్రస్తులకు పరిచర్యలు చేసే ఆసుపత్రి సిబ్బందికి, ఆ వ్యాధిగ్రస్తులతో సన్నిహితంగా మెలిగే బంధువులకు తగిన ముందస్తు చర్యలు తీసు కోనట్టయితే సోకే ప్రమాదం ఉన్నదని గుర్తించారు. కేరళలో మరణించిన 11మందిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం వెనక ఇలాంటి కారణమే ఉండొచ్చని అంచనా. అలాగే ఆ కుటుంబం నివసించే ఇంటి ఆవరణలో ఉన్న బావిలోని గబ్బిలాల వల్ల అక్కడ వ్యాధికారక వైరస్‌కు అవకాశం ఏర్పడిందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
వ్యాధులకు ఔషధాలున్నా వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం మన దేశంలో ప్రధాన సమస్య. వ్యాధి వ్యాప్తిని అరికట్టడం, వ్యాధిని నిర్మూలించడం వంటి అంశాలపై శ్రద్ధ పెట్టడానికి బదులు దాన్నుంచి ఎంత లాభం తీయొచ్చన్నదే ప్రధానమైనప్పుడు ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించడం అసాధ్యమవుతుంది. ఇప్పుడు నిపాతో వచ్చిపడిన సమస్యే మంటే దానికి ఇంతవరకూ మందే లేదు. వ్యాధిగ్రస్తుల్లో కనబడే వేర్వేరు లక్షణాలకు వేర్వేరు ఔషధాలు అందించడం ద్వారా దాన్ని అదుపు చేస్తున్నారు. ఈ వైరస్ విషయంలో ప్రభుత్వాలన్నీ అత్యంత అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. ఆసుపత్రులను అప్రమత్తం చేయాలి. జంతువులు, పక్షులు కొరికి వదిలేసిన పండ్లు తినకూడదని, పరిశుభ్రత అతి ముఖ్యమని జనంలో అవగాహన కల్పించాలి. అల్లోపతిలో ఔషధాలు లేవు గనుక హోమియో, ఆయుర్వేదం, యునాని రంగాల్లోని వైద్య నిపుణుల సేవలు కూడా ప్రభుత్వాలు వినియోగించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment