‘మందు’లేని పాములెన్నో | No Medicine For Several Snake Bites | Sakshi
Sakshi News home page

‘మందు’లేని పాములెన్నో

Published Fri, Dec 13 2019 8:04 AM | Last Updated on Fri, Dec 13 2019 8:04 AM

No Medicine For Several Snake Bites - Sakshi

ఎవరికైనా పాము కరిస్తే ఏమనుకుంటాం.. 
సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్తే చాలు, ఇంజక్షన్‌ ఇస్తారు.. ప్రాణాపాయం తప్పిపోతుందని భావిస్తాం. కానీ, అదంతా ఓ భ్రమని.. అంత ధైర్యంగా ఉండే పరిస్థితి లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే పాము కాటు విరుగుడుకు వాడుతున్న ‘పాలివలెంట్‌ యాంటీ వీనమ్‌’ ఇంజక్షన్‌ పూర్తిగా ఆధారపడ్డది కాదని బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్సీ) అధ్యయనంలో వెల్లడైంది. కేవలం నాలుగు జాతుల పాముకాట్లకే అది విరుగుడుగా పనిచేస్తుందని.. మరో 60 విష సర్పాల కాట్లకు మందులేదన్నది చేదు నిజం అని తేల్చింది. 

ఆ నాలుగింటికే యాంటీ వీనమ్‌ ఇంజక్షన్‌..
దేశంలో పాముకాట్లకు వందేళ్లుగా ఒకే మందు వాడుతున్నారు. పాముకాటుకు గురైన వారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఒక్క ‘పాలివలెంట్‌ యాంటీ వీనమ్‌’ ఇంజక్షన్‌ను మాత్రమే ఇస్తున్నారు. కానీ, ఇది కేవలం నల్లత్రాచు, కట్ల పాము, రక్తపింజరి, ఇసుక పింజరి పాము కాట్లకు మాత్రమే విరుగుడుగా పనిచేస్తుందని.. అందులోనూ ఆ ఇంజక్షన్‌ పనితీరులో ప్రాంతానికి ప్రాంతానికి వ్యత్యాసం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకే జాతికి చెందినప్పటికీ పశ్చిమ బెంగాల్, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పాముకాట్లకు ఈ మందు ఒకే విధంగా పనిచేయడంలేదని వారు పసిగట్టారు. 

60 విషసర్పాల కాట్లకు విరుగుడేదీ?
ప్రస్తుతం మన దేశంలో 270 జాతులకు చెందిన పాములు ఉన్నాయి. వాటిలో 60 జాతులు విషపూరితమైనవి. కానీ, వీటి కాట్లకు ఈ యాంటీ వీనమ్‌ ఇంజక్షన్‌ విరుగుడుగా పనిచేయడంలేదని అధ్యయనంలో తేలింది. చిన్న పింజరి, సింధ్‌ కట్లపాము, బాండెడ్‌ కట్లపాము, పలు నాగుపాముల విషానికి ఈ ఇంజక్షన్‌ విరుగుడుగా పనిచేస్తుందో లేదోనని శాస్త్రవేత్తలు  పరిశీలించారు. కానీ, అది పనిచేయడంలేదని నిర్ధారించారు. ప్రధానంగా దేశంలోని పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో పాము కాట్లపై ఈ ఇంజక్షన్‌ ఏమాత్రం  ప్రభావం చూపించలేకపోతోందని గుర్తించారు. 

ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా పరిశోధనలు చేయాలి 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీవీనమ్‌ నాలుగు జాతుల పాము కాట్లకే విరుగుడుగా పనిచేస్తోందన్నది వాస్తవం. ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా పాము జాతుల విషానికి విరుగుడు మందు తయారీకి పరిశోధనలను విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. – డా. కంచర్ల సుధాకర్, హెచ్‌ఓడీ, జనరల్‌ మెడిసిన్‌ విభాగం, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, గుంటూరు  

ఏటా వేల మంది మృత్యువాత 
దేశంలో పాముకాట్లతో ఏటా దాదాపు 46 వేల మంది మృత్యువాతపడుతున్నారు. మరో 1.40 లక్షల మంది అంగవైకల్యానికి గురవుతున్నారు. సకాలంలో వారిని ఆస్పత్రులకు తీసుకువెళ్లి యాంటీ వీన మ్‌ ఇంజక్షన్లు వేయిస్తున్నప్పటికీ అవి సరిగా పనిచేయకపోవడమే అందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీ వీనమ్‌ ఇంజక్షన్‌ దాదాపు వందేళ్ల క్రితం దేశంలో ప్రవేశపెట్టారు. అప్పట్లో పాశ్చాత్య దేశాల్లో పాముకాట్లకు విరుగుడుగా కనుగొన్న యాంటీ వీనమ్‌ ఇంజక్షన్‌ను బ్రిటీషర్లు మన దేశంలోకి తీసుకువచ్చారు. కానీ, అప్పటి నుంచి భారత్‌లోని పాము జాతులు, వాటి విష తీవ్రతకు అనుగుణంగా పరిశోధనలు చేసి తగిన మందును ఇంతవరకు తయారుచేయకపోవడం విస్మయపరుస్తోంది.

ఐఐఎస్సీ అధ్యయనంలో వెల్లడి 

  • దేశంలో పాము కాట్లతో ఏటా మృతులు- 46 వేలు 
  • అంగవైకల్యం బారిన పడుతున్న వారి సంఖ్య- 1.40 లక్షలు  

-సాక్షి, అమరావతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement