కొత్త కార్డులకు అందని ‘కానుక’
- సంక్రాంతి కానుకల పంపిణీలో పలువురికి మొండిచేయి
- అందరికీ ఇస్తామన్న మంత్రి మాటలు నీటిమూటలే
- సర్కారు తీరుపై ప్రజల పెదవివిరుపు
అనంతపురం అర్బన్ : జిల్లాలో చాలామంది రేషన్‌కార్డుదారులకు సంక్రాంతి కానుకలు అందలేదు. మరీముఖ్యంగా కొత్త కార్డుదారులకు అందకపోవడంతో వారు ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు. కొత్త కార్డుదారులకూ కానుకలు ఇస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, జిల్లా అధికారులు ఘనంగా ప్రకటించారు. ఇది ఉత్తిదేనని క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. జిల్లాలో 11,20,323 పాత రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా 84,419 కార్డులు మంజూరయ్యాయి. వీటిలో 72,531 కార్డులను ఇటీవల ముగిసిన నాల్గో విడత జన్మభూమిలో పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
అంటే పాత, కొత్త కార్డులు కలిపి 11,92,854 లబ్ధిదారుల వద్ద ఉన్నాయి. వీటిలో శుక్రవారం నాటికి 10,46,342 కార్డులకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. దీన్నిబట్టి చూస్తే పాతకార్డుదారులకే ఇంకా పూర్తిస్థాయిలో అందజేయలేదని స్పష్టమవుతోంది. మొత్తమ్మీద 1,46,512 కార్డులకు సంబంధించి కానుకలు పంపిణీకి నోచుకోలేదు. దీనిపై పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ (డీఎం) శివశంకర్‌రెడ్డిని వివరణ కోరగా..కొత్తకార్డుల్లోనూ దాదాపు 30 వేల కార్డులకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేసినట్లు తమకు సమాచారం ఉందన్నారు. పూర్తిస్థాయి వివరాలు అందితే గానీ కచ్చితమైన లెక్కలు చెప్పలేమన్నారు.