రోడ్లు బాగోలేని సమయంలో కూడా పల్లెలవైపు పరుగులు తీసిన ఆర్టీసీ బస్సులు నేడు అందుకు భిన్నంగా మారాయి.
శ్రీకాకుళం అర్బన్: రోడ్లు బాగోలేని సమయంలో కూడా పల్లెలవైపు పరుగులు తీసిన ఆర్టీసీ బస్సులు నేడు అందుకు భిన్నంగా మారాయి. ఆదాయమే ధ్యేయంగా భావిస్తున్న సంబంధిత అధికారులు బస్సు సౌకర్యాన్ని పల్లె ప్రజలకు దూరం చేస్తున్నారు. కనీసం పల్లె వెలుగు, తెలుగు వెలుగు బస్సులను కూడా మారుమూల ప్రాంతాలకు నడపకుండా ప్రజలను గాలికొదిలేసింది.
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలో 1100 పంచాయతీలు ఉండగా వాటికి అనుసంధానంగా 2, 600 గ్రామాలున్నాయి. 38 మండలాలకు గాను 11 మండలాల పరిధిలో వందకు పైగా తీరప్రాంత గ్రామాలు, ఏడు మండలాల పరిధిలో వందకు పైగా గిరిజన గ్రామాలున్నాయి. అయితే మూడు వంతులకు పైబడి గ్రామాలకు ఆర్టీసీ అధికారులు తెలుగు-వెలుగు సేవలను దూరం చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పట్టణాలకు రావాలంటే నానా అవస్థలు పడుతున్నారు.
ప్రైవేటు వాహనాలే గతి
పల్లెప్రాంత వాసులు పట్టణానికి రాకపోకలు సాగించాలంటే ప్రైవేటు వాహనాలే గతిగా మారారుు. గతంలో నడిచే పల్లెవెలుగు బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దీంతో ఆర్థికంగా నష్టపోవడంతోపాటు, ఒక్కోసారి ప్రమాదాల బారినపడుతున్నారు.
ఇబ్బందుల్లో విద్యార్థులు
గతంలో పల్లె వెలుగు బస్సులు గ్రామాలకు వస్తుండడంతో విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఉండేవికావు. కాలక్రమేణా నష్టాల సాకుతో ఒక్కో బస్సును తీసివేయడంతో ప్రజలతోపాటు విద్యార్ధులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాలకు తిరుగుతున్న బస్సులు కూడా సకాలంలో రాకపోవడంతో సమయానికి పాఠశాలలు, కళాశాలలకు చేరలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.
తెలుగు-వెలుగు బస్సుల వివరాలు
శ్రీకాకుళం జిల్లాలో ఐదు డిపోల పరిధిలో 485 ఆర్టీసీ బస్సులు ఉండగా... అందులో తెలుగు వెలుగు 237 ఉన్నాయి. శ్రీకాకుళం ఒకటో డిపో పరిధిలో 51, రెండవ డిపో పరిధిలో 53, పాలకొండలో 51, టెక్కలిలో 35, పలాస పరిధిలో 47 తెలుగు వెలుగు బస్సులు నడుస్తున్నాయి.
బస్సులు వెళ్లని పల్లెలు
శ్రీకాకుళం పట్టణ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే ఎన్నో పల్లెలకు ఆర్టీసీ సేవలు అందుబాటులో లేవు. శ్రీకాకుళం పట్టణం నుంచి కలెక్టరేట్, కల్లేపల్లి, కిల్లిపాలెం, వాడాడ, బొంతలకోడూరు, రూరల్ మండలంలో తండ్యాంవలస, ఆమదాలవలస మండలంలో పొందూరు, సరుబుజ్జిలి మండలాల పరిధిలో బాణాం, తానేం, దళ్లిపేట, తుంగపేట, గోరింట, గోకర్ణపల్లి, పెద్దసవళాపురం, మతలబుపేట, తెలుగుపెంట, బూర్జ మండల పరిధిలో నీలంపేట, రూపేట, అల్లెన, గుత్తావల్లి ప్రాంతాలకు బస్సులు వెళ్లడం లేదు. అలాగే పాలకొండ, సీతంపేట, భామిని మండలాల పరిధిలో బాసూరు, కోటిపల్లి, ఓని, తలవరం, నీలానగరం, చిదిమి, తొత్తడి, వలగెడ్డ, కె.గుమ్మడ, మనుమకొండ, ఒడ్డంగి, తాలాడ, కోసలి, పాతపట్నం నియోజకవర్గ పరిధిలో ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు, మెళియాపుట్టి మండలాల పరిధిలో బడ్డుమర్రి, సీదిరోడ్డు నుంచి రొంపివలస, తురకపేట, దబ్బపాడు, మిరియాపల్లి, సిద్దాంతం, చొర్లంగి, కాశీపురం, కుంటిబద్ర, లబ్బ, కారిగూడ, మారడికోట, భరణికోటకు బస్సుల్లేవు. టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల పరిధిలో తెలగాం, తేలినీలాపురం, జెండాపేట, పెద్దరోకళ్ళపల్లి, బడగాం, సైలాడ, శివరాంపురం, కాశీరాజుకాశీపురం, ఆర్.ఎస్.పురం, రుంకు, డి.మరువాడ, చిన్నమరువాడ, కొత్తపల్లి, హరిశ్చంద్ర, లకండిడ్డి, తోటిపర్తి, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట మండలాల పరిధిలో డొంకూరు, బిర్లంగి, పురుషొత్తపురం, టి.బరంపురం, మకరాంపురం, జలంత్రకోట, గోకర్ణపురం, కుత్తుమ, దూగానపుట్టుగ, నెలవంక, ఇద్దువానిపాలెం, పొత్రఖండ, పాలవలస, రుషికుడ్డ, ఇస్కలపాలెం తదితర ప్రాంతాలకు గతంలో పల్లెవెలుగు బస్సులు తిరగేవి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత బస్సు పేర్లను ‘తెలుగు-వెలుగు’గా మార్పు చేసినప్పికీ బస్సులను మాత్రం నడపడం లేదు.