నో.. స్టాక్!
నో.. స్టాక్!
Published Thu, Aug 11 2016 11:08 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలో సీజనల్ వ్యాధుల ప్రభావం తీవ్రంగా ఉంది. మురికివాడల ప్రాంతాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాలు మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. నగరంలో 10 పట్టణ ఆరోగ్య కేంద్రాల (యూహెచ్‌సీ)తో పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఉంది. ఒక్కో పట్టణ ఆరోగ్యకేంద్రంలో 40–50 మంది వైద్య సేవల కోసం వస్తుండగా, జనరల్ ఆస్పత్రిలో ఆ సంఖ్య 320కి పైగా ఉంది. ఇందులో జ్వరాలు, డయేరియా, మలేరియా, డెంగీ తదితర కేసులే అధికంగా ఉన్నాయి. నగరంలోని మాలపల్లిలో వారం క్రితం ఐదు డెంగీ కేసులు నమోదయ్యాయి. జనరల్ ఆసుపత్రిలో 100–150 వరకు జ్వరాలకు సంబంధించి కేసులు నమోదవుతుండగా, డయేరియా కేసులు 50 వరకు ఉంటున్నాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 10–15 విష జ్వరాలు, డయేరియా కేసులు నమోదవుతున్నాయి. వీరికి తప్పనిసరిగా ఆర్‌ఎల్ సైలెన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవి అందుబాటులో లేవు. సిప్రో ప్లబ్ జేషన్ యాంటీ బయోటిక్ మెట్రోమోడజైల్ (ఐవీ వ్లూయిడ్స్) ఎన్‌ఎస్ సెలైన్ బాటిళ్లు కావాల్సినంత స్టాక్ లేవు. జెంటిమెడిసిన్ (యాంటి బయోటిక్) 100 ఎం.జీ. కొరతగా ఉంది. నొప్పులకు ఉపయోగించే మాత్రలు కూడా అందుబాటులో లేవు. వచ్చిన రోగుల కల్లా పారాసెటిమల్ మాత్రలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు.
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మందుల కొరత ప్రభావం తీవ్రంగా ఉంది. రోజూ 600–700 ఆర్‌ఎల్ సెలైన్ బాటిళ్లు అవసరం కాగా, ప్రస్తుతం 100లోపే అందుబాటులో ఉన్నాయి. ఐవీ ఫ్లూయిడ్స్ 25 వేలు అవసరం ఉండగా, స్టాక్ అస్సలే లేదు. ఏప్రిల్ నుంచి ఆస్పత్రికి మందుల కొరత ఉన్నా అధికారులు స్పందించలేదు. అత్యవసర మందులను ప్రతిరోజు కొనుగోలు చేస్తున్నారు. మందులు అందుబాటులో లేక రోగులు బయటకు వెళుతున్నారు.
మందులను కొనుగోలు చేస్తున్నాం..
ఆస్పత్రిలో మందుల కొరత ఉంది. అవసరమైన మందులను కొనుగోలు చేస్తున్నాం. ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం, మరో 2–3 రోజుల్లో అవసరమైన మందులు అందుబాటులోకి రానున్నాయి. కొరత తీరనుంది.
– నరేంద్రకుమార్, సూపరింటెండెంట్, జనరల్ ఆస్పత్రి
Advertisement