ఉత్సవ విగ్రహాల్లా ఎస్‌ఎంసీ చైర్మన్లు
ఉత్సవ విగ్రహాల్లా ఎస్‌ఎంసీ చైర్మన్లు
Published Mon, Sep 26 2016 11:43 PM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM
ఎన్నికై రెండు నెలలైనా శిక్షణా లేదు, చెక్ పవరూ లేదు.. ∙
విధులూ, అధికారాలూ తెలియని స్థితిలో కమిటీలు
బాలాజీచెరువు (కాకినాడ) : పాఠశాలల అభివృద్ధికి అవసరమైన ని««దlులు ఉన్నా వాటిని వినియోగించుకోలేని నిస్సహాయ స్థితి లో పాఠశాలల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ)ల చైర్మన్లు ఉన్నారు. జిల్లావాప్తంగా ఉన్న పాఠశాలలకు ఆయా కమిటీల ఖాతాలలో స్కూల్ గ్రాంట్ రూపేణా రూ.2,60,86,000 ఉన్నా ఫలితం లేకపోతోంది. అలాగే మెయింటెనెన్స్ గ్రాంట్ రూపేణా రూ.2,90,55,000 ఈ నెల 18న ప్రభుత్వం జమచేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎంసీలను జన్మభూమి కమిటీల తరహాలో ఏర్పాటు చేద్దామని తొలుత ఆలోచించినా ఉపాధ్యాయసంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఎస్‌ఎంసీ ఎన్నికలను రెండు సార్లు వాయిదావేసి చివరికి నిర్వహించింది. అయితే ఎన్నికైన వారికి శిక్షణ ఇవ్వక పోవడమే నిధుల వినియోగానికి సంబంధించి కమిటీ చైర్మన్‌లతో బ్యాంక్ ఖాతాలు ప్రారంభింపజేయలేదు. దీంతో వారు ఎన్నికై రెండు నెలలు గడిచినా ఇప్పటికీ వారికి ఉన్న విధులు, అధికారాలు తెలియకపోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వేసిన నిధులను వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 4,308 పాఠశాలలకు విద్యాకమిటీ చైర్మన్‌లు ఎన్నికయ్యారు. ఎన్నికైన పదిరోజులకు వారికి ఆయా మండలాల వారీగా విధులు, అధికారాలపై మండల వనరుల కేంద్రంలో శిక్షణ తరగతులు ఇస్తామని ప్రకటించినా ఇప్పటి వరకూ వారికి ఏ విధమైన సమాచారం లేదు. దీంతో ఎన్నికైన చైర్మన్‌లు తమ విధులేమిటో తెలియని అయోమయంలో పడ్డారు. అధికారులను అడిగితే శిక్షణ తరువాతే అన్ని తెలుస్తాయని చెబుతున్నారు.
శిక్షణ బాధ్యత ప్రైవేట్ సంస్థకు
గతంలో అనుసరించిన విధానం ప్రకారం.. ఎంపిక చేసిన ఆరుగురు ఉపాధ్యాయులు ప్రతి జిల్లాలో ఆరుగురికి చొప్పున ఎస్‌ఎంసీలకు శిక్షణ ఇవ్వాలి. జిల్లాలో శిక్షణ పొందిన వారు ప్రతి మండలానికీ ఆరుగురికి చొప్పున అదే శిక్షణ ఇవ్వాలి. మండలస్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు గ్రామాల్లో ఎస్‌ఎంసీల ప్రతినిధులకు అవగాహన కల్పించాలి. అయితే ఈసారి ఎస్‌ఎంసీ సభ్యులకు ఇచ్చే శిక్షణ బాధ్యతను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఓ మంత్రికి కావలసిన సంస్థకు ఆ బాధ్యతను అప్పగించడం ద్వారా లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారని, శిక్షణ జాప్యమౌతోందని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. కాగా ఆగస్టు ఒకటిన నిర్వహించాల్సిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో కోరం సరిపడక, ఏకాభిప్రాయం కుదరక, వివిధ కారణాలతో వాయిదా పడిన 50 పాఠశాలల్లో ఎస్‌ఎంసీలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు.
Advertisement
Advertisement