ఆత్మ ఘోషిస్తోంది
కాలయాపనకే కమిటీలు
నిధులున్నా.. నిష్ప్రయోజనం..
అవగాహన సదస్సులు లేవు..
పట్టింపులేని వ్యవసాయ శాఖ
ఏడీఏల పనితీరుపై అసంతృప్తి
నిధుల ఖర్చుకు మరో మూడు నెలలే గడువే..
సుభాష్‌నగర్ : జిల్లాలో ఈ ఏడాది త్రేమాసికంలో ఎన్నుకున్న వ్యవసాయ సాంకేతిక, యాజమాన్య సంస్థ ’ఆత్మ’ కమిటీలు కాలయాపనకే పరిమితమయ్యాయి. వ్యవసాయశాఖ ఏడీలు ప్రత్యేక చొరవ తీసుకొని ఆత్మ కమిటీల పనితీరును మెరుగుపరిస్తే రైతులకు కొంతమేరకైనా లాభం చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏడీఏలు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో ఏటా ‘ఆత్మ’ నిధులు వెనక్కి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. జిల్లాలో వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా రైతులను చైతన్యపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2006 సంవత్సరంలో ‘ఆత్మ’ ను ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ అర్బన్ మినహా 8 డివిజన్లు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా లో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీంగల్, కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద డివిజన్లలో ఆత్మ పనిచేస్తోంది.
జిల్లాస్థాయిలో గవర్నింగ్ బోర్డు ఉంటుంది. ఈ బోర్డుకు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జిల్లా ’ఆత్మ’కు ప్రాజెక్టు డైరెక్టర్ ఉంటారు. ఇందులో వ్యవసాయ అనుబంధశాఖల జిల్లాస్థాయి అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రై తులు, ఇన్‌పుట్ డీలర్లు సభ్యులుగా ఉంటారు. మొత్తం 25 మందితో కమిటీ ఉంటుంది. డివిజన్ లెవల్‌లో బ్లాక్ ఫార్మర్ అడ్వయిజరీ కమిటీ ఉంటుంది. ఇందులో 25 మంది సభ్యులు ఉంటారు. అందరూ రైతులే ఉండి అందులో నుంచి ఒక రైతును చైర్మన్‌గా ఎన్నుకుంటారు. కన్వీనర్‌గా ఏడీఏ వ్యవహరిస్తారు. ఆత్మకు కేటాయించిన నిధులను కలెక్టర్ డివిజన్ లెవల్‌లో కమిటీలకు అందజేస్తారు. ఆ నిధులను ఏడీఏ, కమిటీ చైర్మన్ వివిధ శిక్షణ కార్యక్రమాలు, ప్రదర్శనల కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. నిధులతోపాటు కమిషనరేట్ నుంచి వచ్చిన యాక్షన్ ప్లాన్‌ను అప్పగిస్తారు.
శిక్షణా కార్యక్రమాలు శూన్యం
జిల్లాలో 61 శిక్షణా కార్యక్రమాల (రైతులకు పంటలపై అవగాహన) నిర్వహణకు రూ.9.80 లక్షలు, 134 ప్రదర్శనలకు (రైతులకు క్షేత్ర పర్యటనలకు తీసుకెళ్లటం) రూ. 5.37 లక్షలు, 19 యాత్రలకు(రైతులకు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లడం) రూ.8.81లక్షలను కేటాయించారు. కాగా ఇప్పటివరకు 46 శిక్షణా కార్యక్రమాలు, 67 ప్రదర్శనలు, 18 యాత్రలను నిర్వహించా రు. వీటితోపాటు ఆత్మ పొలంబడులు, ఫార్మర్ అవా ర్డు, రైతులతో శాస్త్రవేత్తల ఇంటరాక్షన్ తదితర కార్యక్రమాలు నిర్వహించి చైతన్యం తీసుకురావాలి. అన్ని ప్రదర్శనలు కలిపి జిల్లావ్యాప్తంగా 377 కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు కేవలం 133 మాత్రమే నిర్వహించారు. వీటికోసం దాదాపు రూ.44 లక్షలు కేటాయించగా, కేవలం రూ.12.50 లక్ష ల వరకు ఖర్చు చేశారు. జిల్లాలో ఎనిమిది ఆత్మ డివిజ న్లు ఉన్నాయి. అందులో ఇటీవల కాలంలో 7 డివిజన్ల లో కమిటీలు పూర్తయ్యాయి. ఒక్క నిజామాబాద్ డివిజన్‌కు మాత్రం ఇంకా చైర్మన్‌ను ఎన్నుకోలేదు. కమిటీలో కేటగిరీలవారీగా 25 మంది డైరెక్టర్లను నియామకం చేస్తారు.
అంతేగాకుండా కమిటీ చైర్మన్ ఎంపికలో రాజకీయ జోక్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని ద్వారానే నిజామాబాద్ డివిజన్‌లో కమిటీ చైర్మన్ ఎన్నికలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. ఒక్కో కమిటీ రెండేళ్లపాటు కొనసాగుతుంది. ఇంతవరకు జిల్లాలో సగం కమిటీలు సైతం శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించలేదు. ఆత్మ డివిజన్ కమిటీలు వ్యవసాయశాఖ ఏడీఏ పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఆయా డివిజన్ల పరిధిలో ఏఓలు, ఏఈఓలు, బీటీఎంలు, ఏటీఎంలు ఉంటారు.
నిధులు వెనక్కి..
డివిజన్ స్థాయిలో ఆత్మ కమిటీలు కార్యక్రమాలు నిర్వహించకపోవడం వల్ల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కేటాయించిన నిధులు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఏటా ఎంతో కొంత నిధులు కేటాయించే ప్రభుత్వాలు ఈ యేడాది గతేడాది నిధులే ఖర్చుచేయాలని ఆదేశించాయి. గతేడాది మిగిలిపోయిన బడ్జెట్‌నే ఈసారి సర్దుబాటు చేశారు. అందులో కార్యక్రమాల కోసం రూ.51,81,800, సిబ్బంది జీతాల కోసం దాదాపు రూ.68.52 లక్షలు.. మొత్తంగా రూ.1,20,33,800 కేటాయించారు. వచ్చే మార్చి 31 లోపు కేటాయించిన నిధులు ఖర్చు కాకపోతే వెనక్కి తీసుకుంటామని ఇప్పటికే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ కేటాయింపులు ఖర్చు చేసేందుకు మరో మూడునెలల గడువు ఉంది. ఇప్పటికైనా కమిటీలతో రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించేలా ఏడీఏలు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరముందని అంటున్నారు.