కొండాపూర్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం నామమాత్రంగానే కొనసాగుతున్నది. ప్రతి గ్రామానికి 40 వేల మొక్కలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి దానికనుగుణంగానే హంగూ ఆర్భాటంతో హరితహారం కార్యక్రమం ప్రారంభించింది. అయితే ఫలితం మాత్రం శూన్యం.మొక్కలను నర్సరీల ద్వారా గ్రామాల్లోకి పంపిణీ చేసినప్పటికీ వాటిని చెత్తకుప్పల్లోనూ, పంచాయతీ కార్యాలయ వెనుకభాగంలోను దర్శనమిస్తున్నాయి. గుంతలను తవ్వి 20 రోజులు దాటినా మొక్కలను మాత్రం నాటడంలేదు. దీంతో వర్షాలకు గుంతలు పూడ్చుకుపోతున్నా కనీసం పట్టించుకునే మండల అధికారులే కరువయ్యారు.
మండలంలోని 22 గ్రామాలకు 8 లక్షల 80 వేల మొక్కలను ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఇప్పటి వరకు మండలంలో కేవలం 3 లక్షల 33 వేల మొక్కలను మాత్రమే నాటారు. అనంతసాగర్‌లో 4,910, దొబ్బకుంటలో 5,150, గారకుర్తి 1,095, తొగర్‌పల్లి 4,510, తేర్పోల్‌లో 8,100, సైదాపూర్‌లో 4,960, మారేపల్లిలో 3,520, మాందాపూర్‌లో 6,560, గిర్మాపూర్‌లో 7,330 మొక్కలను నాటినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి అయితే కేవలం ఇవి పేపర్ ప్రకటనలకే పరిమితమవుతున్నాయని, ఇప్పటివరకు ఏ గ్రామంలో కూడా కనీసం 5 వేల మొక్కలను కూడా నాటలేదని పలువురు పేర్కొంటున్నారు.
పలు గ్రామాలలోని ప్రజలు విమర్శిస్తున్నారు.తేర్పోల్ గ్రామంలో నర్సరీల ద్వారా తెచ్చిన మొక్కలు సుమారు 150కి పైగా పంచాయతీ కార్యాలయం వెనుక వున్న ముళ్ల పొదల్లో పడేశారు. ఈ విషయంపై గ్రామస్తులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. మారేపల్లి గ్రామంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొక్కలను నాటేందుకు గ్రామ శివారులో గల కొత్తకుంట కాలవ క్రింది భాగంలో గుంతలు తీసి 20 రోజులు దాటినా ఇప్పటి వరకు మొక్కలు నాటలేదు. వర్షం వచ్చి గుంతలన్ని మూసుకుపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా మండల అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ నాటిన మొక్కలైనా వాటిని సంరక్షిస్తే చాలనీ పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.