ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి వర్షాలు
విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడనుంది. ఇది మంగళవారం మధ్యాహ్నం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుంది. అలాగే ఉత్తర బంగాళాఖాతంలోనూ మరో ఆవర్తనం స్థిరంగా ఉంది. సముద్రమట్టానికి ఇది 2.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. తమిళనాడుపై మరో ఉపరితల ఆవర్తనం ప్రభావం చూపుతోంది. వీటన్నిటి కారణంగా రానున్న 24 గంటల్లో రాయలసీమలో కొన్నిచోట్ల, కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది.
మరోవైపు ఈనెల 7వ తేదీ నుంచి రాష్ట్రం వర్షాలు ఊపందుకునే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం వల్ల రాయలసీమపై ఒకింత వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించడానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.