ముంపు బాధితులను ఆదుకోరా?
Published Sat, Sep 24 2016 11:53 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
నాగర్‌కర్నూల్ : ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన ముంపు బాధితులను ఆదుకోవడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని నల్గొండ మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి ఆరోపించారు. శనివారం నాగర్‌కర్నూల్ పీఆర్ అతిథిగహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలలో భూసేకరణను 2013చట్టం ప్రకారం కాకుండా ప్రభుత్వం 123 జీఓ తెచ్చి రైతులకు నష్టం చేస్తోందని విమర్శించారు.
ర్యాలంపాడు రిజర్వాయర్‌లో ఆలూరు మంపు బాధితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరువులో రైతులను ఆదుకునేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.790 కోట్లను పుష్కరాలకు ఖర్చు చేసిందని ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యదర్శి జబ్బార్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా రెండున్నర లక్షల ఎకరాలను సేకరించాల్సి ఉందన్నారు. కాల్వలు, లైనింగ్ పనులు పూర్తి కాకముందే నీరు విడుదల చేయడంతో ఎక్కడికక్కడ గండ్లు పడుతున్నాయన్నారు.
మూడోవిడత రుణమాఫీ అమలుకాక రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలేదని, దీంతో వడ్డీ వ్యాపారుల దోపిడీకి గురవుతున్నారన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు డీపీఆర్ లేకుండా టెండర్లు పిలిచినందుకు నిరసిస్తూ త్వరలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు, జిల్లా నాయకులు ఆర్.శ్రీనివాసులు, కంది కొండగీత తదితరులు పాల్గొన్నారు.
Advertisement