చేతికొచ్చేనా..?
Published Thu, Nov 24 2016 2:45 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
సాక్షి, నల్లగొండ : ఒకటో తేదీకి ఎనిమిది రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల నవంబర్ నెల వేతనాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకింగ్ పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకురావడంతో వేతనాలు పొందేందుకు ఎలాంటి సమస్యా లేకపోయినా, పొందిన వేతనాలను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీన వచ్చే వేతనాల కోసం 10 రోజుల ముందు నుంచే ప్రణాళికలు వేసుకుని ఉండే ఉద్యోగులు వేతనాలు వచ్చిన 10 రోజుల్లోనే తమ అవసరాల కోసం ఆ వేతనాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ, ఈ క్రమంలో ప్రస్తుతమున్న నిబంధనల కారణంగా తాము ఇబ్బంది పడాల్సి వస్తుందనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది, పింఛన్‌దారులు కలిసి కనీసం లక్ష మందికి పైగా ఉంటారని అంచనా. ఈ ఉద్యోగుల పరిస్థితి ఒకటో తేదీ తర్వాతేంటనే దానిపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కానీ స్పష్టత నివ్వకపోవడం మరింత గందరగోళానికి దారి తీస్తోంది.
రోజుకు రూ. 2వేలేనా?
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో నాలుగో తర గతి ఉద్యోగుల నుంచి శాఖాధిపతుల వరకు 35 వేల వరకు ఉద్యోగులున్నారు. వీరితో పాటు ఆరువేల మందికి పైగా టీచర్లు కూడా ఉన్నారు. పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎఫ్‌సీఐ, ఎల్‌ఐసీ తదితర సంస్థల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 5 వేల వరకు ఉంటారు. లెక్చరర్లు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో, ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు, పింఛన్‌దారులు కలిపి మొత్తం లక్ష మంది వరకు ఉంటారు. వీరే కాకుండా వివిధ ప్రైవేటు సంస్థలు, అన్ని రకాల దుకాణాల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. వీరంతా ప్రతి నెల ఒకటి నుంచి పదో తేదీ లోపు వేతనాలను తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులక యితే ఠంచన్‌గా ఒకటో తేదీన జీతం వస్తుంది. అయితే, జీతం పొందే విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి అనుమానం లేకపోయినా, పొందిన వేతనాన్ని తమ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలన్నదే సమస్యగా మారింది.
బ్యాంకుల్లో గంటల తరబడి ఉన్నా.. ఏటీఎంల వద్ద క్యూలలో పడిగాపులు కాసినా రోజుకు రూ.2 వేల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేకపోవడంతో నెలసరి ఖర్చులెలా అన్నది ఇప్పుడు ఉద్యోగులకు పెద్ద ప్రశ్నగా మారింది. ఇంటి కిరాయిలు, పాలు, కిరాణా దుకాణం ఖర్చులు, చిట్టీలు, పిల్లల ఖర్చులు... ఇలా అన్ని రకాల అవసరాల కోసం 5-10 తేదీల్లోపే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని, రోజుకు రూ.2 వేల చొప్పున ఇస్తే వీటికి ఎప్పటికి చెల్లింపులు చేయాల్సి ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సామాన్య ప్రజల్లాగా గంటల తరబడి ఏటీఎంల వద్ద ఉండే అవకాశం కూడా తమకు లేదని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తమకు వెసులుబాటు కల్పించకపోతే సాధారణ జీవనానికి ఇబ్బందులు తప్పవనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది. అయితే, ఈ వెసులు బాట్ల విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడం, ఒకటో తేదీ సమీపిస్తుండడం మరింత సమస్యగా మారుతోంది.
బ్యాంకుల్లోనే?
వాస్తవానికి, ప్రస్తుత పరిస్థితులు సర్దుమణిగేంత వరకు తమ నగదు రూపంలో వేతనాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే పరిమితులతో పాటు, ఉద్యోగుల వేతనాల నుంచి కొన్ని రకాల మినహాయింపులు చేసుకుని మిగిలిన జీతం చెల్లించాల్సి ఉండడం, నగదు రూపంలో ఇవ్వాలంటే ప్రతి ఒక్కరి దగ్గరా సంతకాలు తీసుకోవాల్సి రావడం సమస్యగా మారింది. దీనికి తోడు బ్యాంకర్లు కూడా అంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఎప్పటిలాగే బ్యాంకుల్లోనే నవంబర్ నెల వేతనాలు జమవుతాయని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. అయితే, నవంబర్ నెల వేతనంలో రూ.10 వేలను ప్రతి ఉద్యోగికి అడ్వాన్స్‌గా ఇస్తారని, లేదంటే సగం జీతం నగదు రూపంలో ఇస్తారని మొదట్లో చర్చ జరిగినా అది సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో జమ అయిన వేతనాలను తమకు ఇచ్చే విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ముఖ్యంగా తమ వేతనాల ఉపసంహరణ కోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్‌గా కనిపిస్తోంది. దీంతో పాటు బ్యాంకులు, ఏటీఎంల నుంచి ఉపసంహరణ చేసుకునే పరిమితిని కూడా పెంచాలని వారు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో.. బ్యాంకర్లు ఏ విధంగా సహకరిస్తారో వేచి చూడాల్సిందే.
నగదు ఇస్తేనే బాగుంటుంది..
పెద్ద నోట్ల రద్దు ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం నల్ల ధనాన్ని అరికట్టే విషయంలో మంచిదే అనుకున్నా.. ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ఉద్యోగుల పరిస్థితి సామాన్య ప్రజల కంటే భిన్నమైనది. ఉద్యోగులకు ఈనెల వేతనాలు నగదు ఇస్తేనే బాగుంటుంది. ఈ మేరకు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాం. మంగళ, బుధ వారాల్లో స్పష్టత వస్తుంది.
- పందిరి వెంకటేశ్వరమూర్తి,
టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు
ఎవర్నీ ఇబ్బంది పెట్టవద్దు.
జిల్లాలో 6 వేలకు మందికి పైగా టీచర్లున్నారు. వీరికి నెలసరి వేతనాలే జీవనాధారం. ఈ పరిస్థితుల్లో వేతనాలు డ్రా చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు బ్యాంకుల్లో జమ చేస్తే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలి. ఉపసంహరణ పరిమితిని పెంచాలి. మాతో పాటు సామాన్య ప్రజలకు కూడా కౌంటర్లు పెంచాలి. ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు.
- పెరుమాండ్ల వెంకటేశ్వర్లు,
Advertisement
Advertisement