పోలీసుల అదుపులో నోట్ల మార్పిడి ముఠా | notes exchange gang under police custody | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో నోట్ల మార్పిడి ముఠా

Published Sat, Dec 10 2016 11:41 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

notes exchange gang under police custody

- సినీఫక్కీలో చేజింగ్‌
- కొనసాగుతున్న విచారణ
బండిఆత్మకూరు: నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సినీ ఫక్కీలో శుక్రవారం రాత్రి చేజింగ్‌ చేయాల్సి వచ్చింది. బండిఆత్మకూరు మండలం ఈర్నపాడు వద్ద ఇద్దరు నిందితులు అదుపులోకి తీసుకోగా, వెలుగోడు వద్ద ఆర్టీసీ వాహనంలో వెళుతున్న మరో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని మొత్తం ఐదుగురుని విచారిస్తున్నారు. అంతేగాక తప్పించుకున్న మరో ముగ్గురు కోసం విచారిస్తున్నారు. అయితే ఈ చేజింగ్‌లో డబ్బు లెక్కపెట్టె మిషన్‌ వారి వద్ద లభించినట్లు, నగదు లభించలేదని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు లోతుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 
సమాచార మిలా..
ఆత్మకూరులో  శుక్రవారం రాత్రి నోట్ల మార్పిడి ముఠా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు వారిని వెంబడించగా వారు టయోటా వాహనంలో తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు పోలీసుల నుంచి వెలుగోడు, బండిఆత్మకూరు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. 
చేజింగ్‌ ఇలా..
వెలుగోడు పోలీసులు అప్రమత్తమై ట్రాక్టర్‌ను రోడ్డుకు అడ్డంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రెప్పపాట కాలంలో టయోటా వాహనం ఆగకుండా వెళ్లింది. ఆ తర్వాత బండిఆత్మకూరు పోలీసులు సైతం వచ్చి బస్టాండ్‌ వద్ద వేచి చూశారు. దీంతో టయోటా వాహనంలో ఉన్న వ్యక్తులు అప్రమత్తమై తమ వాహనాన్ని ఓంకార క్షేత్రం వైపు తిప్పారు.  ఆ వాహనం అటువైపు వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు బోలెరో వాహనంతో వెంబడించారు. ఈ క్రమంలో టయోటా వాహనం సింగవరం, సోమయాజులపల్లె గ్రామం దాటి తెలుగుగంగ కాల్వ ప్రధాన కట్టపై నుంచి మణికంఠాపురం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. టయోటా వాహనం వెళుతున్న సమాచారాన్ని ఎస్‌ఐ విష్ణునారాయణకు చేరవేశారు. దీంతో ఈర్నపాడు వద్దకు ఎస్‌ఐ చేరుకొని ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డుగా ఉంచి కాపు కాశారు. ఈ క్రమంలో కొద్ది సేపటికి టయోటా వాహనం వచ్చింది. వాహనంలో ఉన్న వ్యక్తులు దిగి పరిగెత్తే ప్రయత్నం చేశారు. వెంటనే ఎస్‌ఐ ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మిగతా ముగ్గురు తప్పించుకొని పారిపోయారు. 
బనగానపల్లె వ్యక్తులు..
అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితుల్లో ఒకరు బనగానపల్లెలోని ఒక ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్‌గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మరో వ్యక్తి కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఈ క్రమంలో టయోటా వాహనంలో నుంచి దిగి తప్పించుకున్న ముగ్గురు వ్యక్తులు ఈర్నపాడు గ్రామంలోని ఒక వ్యక్తి బాత్‌రూంలో తల దాచుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తెల్లవారుజామున ఆ ముగ్గురు వ్యక్తులు తిరిగి వెళ్లినట్లు పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులకు పొలాల్లో డబ్బు లెక్క పెట్టే యంత్రం లభించినట్లు తెలుస్తోంది. ఎటువంటి నగదు దొరకలేదని సమాచారం.
ఆర్టీసీ బస్సులో మరో ముగ్గురు వ్యక్తులు..
వెలుగోడు పోలీసులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదే సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం టయోటా వాహనంలో వెళ్తున్న వీరికి ఆర్టీసీ బస్సులో నుంచి అదుపులోకి తీసుకున్న అనుమానితులకు గల సంబంధాల గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు. వారు టయోటా వాహనం దిగి ఆత్మకూరు సమీపంలో ఉన్న నల్లకాల్వ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి, తాలూకా సీఐ మురళీధర్‌రెడ్డి శనివారం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారమంతా ఆత్మకూరులోని ఒక హోటల్‌లో నోట్ల మార్పి భారీ ఎత్తున జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement