లొంగితే అమెరికాలో ఉద్యోగమిస్తాం!
లొంగితే అమెరికాలో ఉద్యోగమిస్తాం!
Published Wed, Dec 23 2015 9:46 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
విజయవాడ: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కాల్‌మనీ-సెక్స్ రాకెట్‌లో ఒక ఎన్‌ఆర్‌ఐ పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది. అతడి ద్వారా అమెరికాలో ఉద్యోగాలిప్పిస్తామని ఆశపెట్టి చాలా మంది యువతులను లొంగదీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఉద్యోగం ఇప్పించక పోగా ఎంతో కొంత డబ్బు ఇచ్చేస్తామని, తమతో సర్దుబాటు చేసుకోవాలని వారి కుటుంబాలపై ఒత్తిడి తెచ్చినట్లు పలువురు బాధితుల ద్వారా తెలిసింది. కాల్‌మనీలో సదరు ఎన్‌ఆర్‌ఐ భారీగా పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు. ఈ ముఠా దగ్గర అప్పు తీసుకున్న ఒక మహిళ వడ్డీ కట్టలేకపోవడంతో ఆమెను బలవంతంగా లోబరుచుకొని చాన్నాళ్లపాటు లైంగికంగా వేధించారు. అంతటితో ఆగకుండా ఆమె కుమార్తెపై కూడా కన్నేశారు. తాము చెప్పినట్లు వింటే అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తామని ఆ యువతిని వశపరచుకున్నారు.
ముఠా సభ్యులంతా ఆమెపై లైంగిక దాడి చేయడంతోపాటు వేరే వ్యక్తుల వద్దకు కూడా పంపించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో విద్యుత్ శాఖ డీఈ సత్యానందం కీలకపాత్ర పోషించాడు. ఆ యువతిని అతడే తొలుత లోబరుచుకున్నాడని సమాచారం. అమెరికాలో తెలుగు వ్యవహారాలు చూసే ఓ ప్రముఖ సంస్థ మాజీ అధ్యక్షుడి ద్వారా అతని కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని వారు నమ్మబలికారు. గతంలోనూ చాలామందికి అలాగే ఉద్యోగాల ఎరవేసినట్లు సమాచారం. నమ్మినవారిని లైంగికంగా వేధించి, ఎన్‌ఆర్‌ఐ వద్దకు పంపుతారు. అలా పంపిన వారిలో చాలా కొద్ది మందికి ఉద్యోగాలు రాగా మిగిలిన వారిని వ్యభిచారంలోకి దింపారనే అనుమానాలు రేగుతున్నాయి.
ప్రముఖ సంస్థ గెస్ట్‌హౌస్ వినియోగం
కృష్ణానది కరకట్టపై సీఎం నివాసం ఉండడానికి గెస్ట్‌హౌస్ ఇచ్చిన సంస్థకే ఏఎన్‌యూ వద్ద మరో గెస్ట్‌హౌస్ ఉంది. అందులో కాల్‌మనీ ముఠా తమ లైంగిక ఆగడాలకు ఉపయోగించుకునేవారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. వీరిపై ఫిర్యాదు చేసిన తల్లీకూతుళ్లను ఈ గెస్ట్‌హౌస్‌కే చాలాసార్లు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఈ గెస్ట్‌హౌస్ యజమానులకు సీఎంతో సంబంధాలు ఉండడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూసేవారు కాదు.
Advertisement
Advertisement