పని బారెడు..జీతం మూరెడు
పని బారెడు..జీతం మూరెడు
Published Tue, Jul 25 2017 11:19 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM
ఎస్‌ఎస్‌ఏలో కాంట్రాక్ట్ సిబ్బంది ఆవేదన
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
కొత్తపేట : విద్యాభివృద్ధి, ఉన్నత ప్రమాణాలు, ఉత్తమ ఫలితాలే లక్ష్యమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పాలకులు ఆచరణలో మాత్రం చిన్నచూపు చూస్తున్నారు. విద్యాశాఖలో సర్వ శిక్షాభియాన్ (ఎస్‌ఎస్‌ఏ)లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగుల పనితో పోలిస్తే ఎక్కువ పనిచేస్తున్నా తగిన ఫలితం మాత్రం పొందలేకపోతున్నారు. తమకు ఉద్యోగ భద్రత ,సమాన పనికి సమాన వేతనం, మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా ఏమాత్రం కరుణించడం లేదని సిబ్బంది వాపోతున్నారు. జిల్లాలో ఎస్‌ఎస్‌ఏ ద్వారా 1,175 మంది పని చేస్తుండగా వారిలో 287 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సీఆర్‌పీ), 64 మంది చొప్పున కంప్యూటర్ ఆపరేటర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, ఎంఆర్‌సీ అసిస్టెంట్స్, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు 696 మంది ఉన్నారు.
చాలిచాలని వేతనాలు
2011లో అప్పటి ప్రభుత్వం జిల్లా కమిటీ ఇంటర్వూలు ద్వారా గ్రాడ్యుయేట్‌తో బీఈడీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారిని రూ.5,500 వేతనంతో నియమించింది. 2013,14 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రూ.1,500 చొప్పున పెంచింది. ప్రస్తుతం రూ.8,500 జీతంతో తీవ్ర కష్టాల నడుమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లకు 2004లో అప్పటి ప్రభుత్వం రూ.1,500 వేతనంతో నియమించింది.తరువాత 2007 నుంచి 2014 వరకూ 5 దఫాలుగా రూ.8,500 పెంచాయి.ప్రస్తుతం రూ 10,000 జీతంతో పనిచేస్తున్నారు. 2012 లో అప్పటి ప్రభుత్వం ఎంఐఎస్ కోర్డినేటర్స్‌ను రూ.8,500 వేతనంతో నియమించింది. 2013,14ల్లో రూ.3,500 పెంచింది.ప్రస్తుతం రూ.12 వేలు జీతానికి పనిచేస్తున్నారు. 2005లో చేరిన ఎంఆర్‌సీ అసిస్టెంట్లు ప్రస్తుతం రూ.7,500కు పని చేస్తున్నారు.
రూ 6 వేలతో ఎలా బతికేదెలా?
2012–13 సంవత్సరంలో ఎస్‌ఎస్‌ఏ లో పార్టటైం ఇన్‌స్ట్రక్టర్లు (డ్రాయింగ్,క్రాప్టు, పీఈటీలు)గా జిల్లాలో సుమారు 696 మంది నియమితులయ్యారు. మొదట వారికి రూ.4,500 గౌరవ వేతనంగా చెల్లించారు.2014–15 లో రూ.6 వేలకు పెంచారు. గతంలో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లను విద్యా సంవత్సరం నిర్వహించిన విధులకు సంబంధించి వేతనాలు చెల్లించగా ఈ ఏడాది మే 3 నుంచే విధుల్లోకి తీసుకోవాలని ఆర్‌సీ నెంబరు 1707/ఏపీ ఎస్‌ఎస్‌ఏ/ఏ9-2017 ప్రకారం స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్‌పీడీ) మే 3న జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లాలో అధికారులు లేనిపోని సాకులు చూపుతూ అమలు చేయలేదని వారు వాపోయారు. కేవలం తమ టీచింగ్ విధులే కాక అదనంగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ తమను ఉపయోగించుకుంటున్నారని, తాజాగా విద్యార్థి గణన కార్యక్రమంలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేశారన్నారు.
పీఏబీ ప్రతిపాదిత జీతాలేవి?
ఎస్‌ఎస్‌ఏ కు సంబంధించిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) ప్రతిపాదించిన రూ.20,755 చొప్పున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తక్కువ వేతనాలు చెల్లిస్తూ మిగిలిన నిధులను వేరే పథకాలకు మళ్లిస్తూ ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల పొట్టకొడుతోందని వాపోతున్నారు. ఆర్‌పీ, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోర్డినేటర్లు, ఎంఆర్‌సీ అసిస్టెంట్లకు మే నుంచి, పీటీఐలకు కూడా ఎస్‌పీడీ ఉత్తర్వుల ప్రకారం 2 నెలలుగా జీతాలు విడుదల కావడం లేదు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ఎస్‌ఎస్‌ఏలో పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేస్తామని మరచిపోయారని విమర్శిస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 7న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు.
మూడేళ్లలో సుమారు 100 మెమోరాండాలు
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదు సరికదా టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి పెంచలేదు. ఈ మూడేళ్లలో సుమారు 100 మెమోరాండాలు ఇచ్చాం. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. అరకొర జీతాలతో కుటంబాల పోషణ చాలా ఇబ్బందిగా ఉంది.
-ఎం శ్రీనివాసరావు,ప్రెసిడెంట్, కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్, అల్లవరం
Advertisement
Advertisement