రుయాలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు
– కలుషిత ఆహారమే కారణం
– రుయా అత్యవసర విభాగంలో వైద్య సేవలు
తిరుపతి మెడికల్ : రుయాలోని స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా పదిమంది జీఎన్‌ఎం నర్సింగ్ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలకు చెందిన 67 మంది విద్యార్థినులు రుయాలోని ‘ప్యూపిల్ నర్సస్ హాస్టల్’లో ఉన్నారు. విద్యార్థినులే కమిటీగా ఏర్పడి ఓ వంట మాస్టర్‌ను ఏర్పాటు చేసుకుని భోజనాలు తయారు చేయించుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో మధ్యాహ్నం చికెన్ తెప్పించుకుని చేయించారు. చికెన్ తినని విద్యార్థినులు కేక్, ఐస్‌క్రీం తెప్పించుకున్నారు. రాత్రి కూడా అవే తిన్నారు. ఉదయం లేచే సరికి పది మంది విద్యార్థినులకు వాంతులు, విరేచనాలయ్యాయి. తోటి విద్యార్థులు వారిని రుయా అత్యవసర విభాగానికి తరలించారు. సాయంత్రం సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీహరి హాస్టల్‌ను తనిఖీ చేశారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ప్రిన్సిపల్ రష్యారాణి, అధ్యాపకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ బి.సిద్దానాయక్ సాయంత్రం విద్యార్థినులను పరామర్శించారు. ప్రమాదం తప్పిందని తెలిపారు.