జల పర్వం.. జనసంద్రం
జల పర్వం.. జనసంద్రం
Published Mon, Aug 22 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
జిల్లాలోని 11 రోజుల్లో 13,24,743 మంది భక్తులు
– రోజుకు సగటున 1,20,431 పుణ్య స్నానాలు
– ఐదు ఘాట్లలోనూ భక్తిపారవశ్యం
– సీఎం పర్యటన నేపథ్యంలో స్తంభించిన ట్రాఫిక్
– రెండున్నర గంటల పాటు భక్తులు అవస్థలు
– సీఐ ఘటనతో అప్రమత్తమైన పోలీసు శాఖ
– ఆది పుష్కర ముగింపునకు భారీ ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
పుష్కర స్నానానికి భక్తులు పోటెత్తారు. జిల్లాలో ఐదు ఘాట్లు ఉండగా.. మొత్తం 11 రోజుల్లో 13,24,743 మందికి పైగా పుష్కరస్నానం ఆచరించారు. ఈ లెక్కన సగటున రోజుకు 1,20,431 మంది భక్తులు కృష్ణమ్మ దీవెనలందుకున్నారు. భక్తులకు తగిన సంఖ్యలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు లేకుండానే పుష్కర సందడి కొనసాగింది. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం లింగాలగట్టులోని దిగువఘాటుకు రావడంతో అటు హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం వస్తున్న సందర్భంగా గంటన్నర పాటు.. వెళ్లే సమయంలో ఒక గంట పాటు మొత్తం రెండున్నర గంటలపాటు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఫలితంగా పుష్కరభక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు కార్డ్‌అండ్ సెర్చ్‌లో ఒక మహిళతో సీఐ పట్టుబడిన ఘటన నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తమయింది. ఐజీ శ్రీధర్‌రావు.. జాగ్రత్తగా ఉండాలని పోలీసు సిబ్బందిని హెచ్చరించారు. ఈ ఒక్క ఘటన మినహా పుష్కర సందడి ఇప్పటి వరకు సాఫీగానే సాగింది. ఇకపోతే చివరిరోజు పుష్కరాలకు ఘనంగా ముగింపు పలికేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధమయింది..
చివర్లో తెలుగు తమ్ముళ్ల సందడి
పుష్కర సందడి మొదలై 10 రోజులు గడిచినప్పటికీ అటువైపు కొద్ది మంది మినహా తెలుగు తమ్ముళ్లు పెద్దగా ఎవ్వరూ సహాయ కార్యక్రమాలు చేపట్టలేదు. అయితే, సోమవారం సీఎం వస్తున్న సందర్భంగా ఎవరికి వారు భారీగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక ఎమ్మెల్యే మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లను పంచిపెట్టగా.. మరో నేత కుంకుమ, పసుపు, రవికెలను పంపిణీ చేశారు. అప్పటికప్పుడు ఫ్లెక్సీలను పెట్టి హంగామా చేసే ప్రయత్నం కనిపించింది.
కష్టపడ్డ జిల్లా యంత్రాంగం
పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడంలో జిల్లా యంత్రాంగం సమష్టిగా పనిచేసింది. ప్రధానంగా పోలీసు యంత్రాంగం సేవా కార్యక్రమాల్లో ముందుండగా.. రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లను ఎప్పటికప్పుడు భారీగా చేసింది. మరోవైపు పారిశుద్ధ్య సిబ్బంది ఎక్కడా చెత్త కనపడకుండా రేయింబవళ్లు కష్టపడ్డారు. ఏకంగా రాత్రి సమయాల్లోనూ కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఘాట్ల వద్దకు వెళ్లి శుభ్రపరిచే ఏర్పాట్లను చేశారు. గత నాలుగు రోజులుగా కలెక్టర్, ఎస్పీ కలియతిరుగుతూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మొత్తం మీద జిల్లా యంత్రాంగం కష్టానికి తగిన గుర్తింపు లభించింది. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు వరించింది.
Advertisement
Advertisement