పుష్కర నీరాజనం
పుష్కర నీరాజనం
Published Tue, Aug 16 2016 12:44 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
కృష్ణా తీరం.. దీప హారతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ భక్తి పారవశ్యం పరవళ్లు తొక్కుతోంది. పుణ్య స్నానాలతో భక్తజనం పునీతమవుతున్నారు. వందలాది కిలోమీటర్ల దూరం.. జిల్లాలు, రాష్ట్రాలు దాటి వస్తున్న వేలాది ప్రజలు కష్ణమ్మ ఒడిలో తమను తాము మైమరిచిపోతున్నారు.
సాక్షి, కర్నూలు: కృష్ణా పుష్కరాలు నాలుగో రోజున స్నానఘాట్లు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. సోమవారం స్వాతంత్య్ర దినోత్సం సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాల హడావుడి మొదలైంది. పాతాళాగంగ, లింగాలగట్టు, సంగమేశ్వరం ఘాట్లకు పోటెత్తారు. కర్నూలు జిల్లాతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి బస్సులు, వాహనాల్లో వచ్చిన భక్తులు శ్రీశైలానికి చేరుకున్నారు. ఆర్టీసీ, పోలీసులు, రవాణశాఖ సమన్వయంతో ఎక్కడా అసౌకర్యం కలగకుండా వారిని ఉచిత బస్సుల్లో ఘాట్ల చెంతకు తరలించడంతో యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరించారు. వలంటీర్లు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థినులు పెద్ద సంఖ్యలో ఘాట్ల వద్ద వద్ధులు, పిల్లలు, వికలాంగులకు సేవలు అందించారు. లక్షమందికి పైగా భక్తులు తరలివచ్చినా ఎక్కడా ఎలాంటి సంఘటనలు నమోదుకాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
లక్ష మంది స్నానం
ముక్కంటికి ప్రీతికరమైన రోజు కావడంతో శ్రీశైలానికి సోమవారం భక్తుల తాకిడి పెరిగింది. శ్రీశైలంలోని పాతాళాగంగలో రెండు ఘాట్లలోనూ భక్తులు పోటెత్తారు. లింగాలగట్టు లోలెవల్ ఘాట్‌లోనూ, సంగమేశ్వరంలోని ఘాట్‌లలో రద్దీ విపరీతంగా పెరిగింది. జిల్లాలోని ఆరు ఘాట్లలోనూ దాదాపు లక్ష మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. శ్రీశైలానికి ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి అధికంగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళాగంగ ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించి.. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి క్యూలైన్లలో నిలబడ్డారు. గంటగంటకు భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ సతీసమేతంగా పాతాళాగంగ ఘాట్‌లో పుణ్యసాన్నాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకున్నారు. పుష్కరాల ప్రత్యేక అధికారి అనంతరాములు, డీఐజీ రమణకుమార్ ఘాట్లను పరిశీలించి యంత్రాంగానికి పలు సూచనలు చేశారు.
లింగాలగట్టులో భక్తులకు ఇబ్బందులు
లింగాలగట్టులోని లోలెవల్ ఘాట్‌లో నీటిమట్టం తగ్గడంతో వివిధ ప్రాంతాల నుంచి వేకువజామునే అక్కడికి తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 11 గంటల వరకు పరిస్థితిలో మార్పులు రాలేదు. దీంతో భక్తులు తమ వెంట తెచ్చుకున్న చెంబులతోనే పుణ్యస్నానమాచరించడం కనిపించింది. కొందరు వద్ధులు నీట మునిగితేనే పుణ్యస్నానమాచరించినట్లని భావించి మోకాటిలోతున్న నీళ్లలో ఇబ్బందిగా మునకలు వేయడం గమనార్హం. దీంతో ఇరిగేషన్ అధికారులు స్పందించి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జలవిద్యుత్తు కేంద్రాల నుంచి నాలుగు జనరేటర్ల ద్వారా దిగువకు 18,242 క్యూసెక్కుల నీటిని కిందికి వదలడంతో నెమ్మదిగా నీటిమట్టం పెరిగింది. ఆ తర్వాత భక్తులు అక్కడ కేరింతలు కొట్టుతూ పుణ్యస్నానాలు ఆచరించారు.
Advertisement
Advertisement