పన్నెండేళ్ల పండగ | 12years festival | Sakshi
Sakshi News home page

పన్నెండేళ్ల పండగ

Published Fri, Aug 12 2016 12:24 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

సంగమేశ్వరం - Sakshi

సంగమేశ్వరం

నేటి నుంచి కృష్ణా పుష్కరాలు
– తెల్లవారుజామున 5.54 గంటలకు నదీ హారతి
– సంగమేశ్వరంలో డిప్యూటీ సీఎం, శ్రీశైలంలో కలెక్టర్‌
– ముస్తాబవుతున్న శ్రీశైల మహాక్షేత్రం
– అందంగా రూపుదిద్దుకుంటున్న పురవీధులు
– సిద్ధమవుతున్న పుష్కరఘాట్‌లు
– ఇంకా అసంపూర్తిగానే పుష్కరనగర్‌లు
 
శ్రీశైలం నుంచి సాక్షి ప్రతినిధి: 
కృష్ణా పుష్కరాలకు సర్వం సిద్ధమయింది. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంతో పాటు సప్తనదుల సంగమంలోని సంగమేశ్వరం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున 5.54 గంటలకు హారతితో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. సంగమేశ్వరంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, శ్రీశైలంలో జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ హారతినిచ్చి పుష్కర స్నానం చేసి పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఇక శ్రీశైల పురవీధుల్లో శివరూపం ఉట్టిపడుతుండగా.. ఆలయం విద్యుద్దీపకాంతులతో వెలిగిపోతోంది. లింగాల గట్టు వద్ద ఎగువ, దిగువ ఘాట్లు.. పాతాళగంగ వద్ద ఎగువ, దిగువ ఘాట్లు భక్తులకు సాదర స్వాగతం పలుకుతున్నాయి. చివరి రెండు రోజుల్లో ఆగమేఘాలపై ఘాట్లను సిద్ధం చేశారు. సంగమేశ్వరం వద్ద కూడా పనులు పూర్తయ్యాయి. మొదటి రోజు వేలల్లో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వరుసగా సెలవులు కావడంతో సోమవారం వరకు భక్తుల రద్దీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే భక్తుల రద్దీకి తగ్గట్లు సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా దూర ప్రయాణంతో శ్రీశైలం చేరుకునే భక్తులు సేదతీరేందుకు నిర్మిస్తున్న పుష్కర నగర్‌లు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా ఘాట్ల వద్ద మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే గదులు రద్దీకి అనుగుణంగా లేకపోవడం కూడా ఇబ్బంది కలిగించే విషయమే. మొత్తం మీద ఈనెల 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న కష్ణా పుష్కరాల విజయవంతానికి జిల్లా అధికార యంత్రాంగం కంటి మీద కునుకు లేకుండా కృషి చేస్తోంది.
 
శ్రీశైలం.. శివమయం
శ్రీశైలంలోని పురవీధులకు కొత్త కళ వచ్చింది. వీధులన్నీ శివుని రూపాలతో పూర్తిస్థాయిలో భక్తిపారవశ్యం నింపుతున్నాయి. శివనామంతో వీధులన్నీ మార్మోగుతున్నాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏ దారి ఎటు వెళుతుందో దూరం నుంచి చూసినా కనిపించేలా సూచికలను కూడా ఏర్పాటు చేశారు. ఆలయం మొత్తం లైటింగ్‌తో అలంకరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లను నిర్మించారు. ఇక ఘాట్లలో ప్రమాదాలు వాటిల్లకుండా ముందస్తుగా ఈతగాళ్లను ఘాట్ల వద్ద చిన్న చిన్న బోట్లతో సిద్ధం చేశారు. పాతాళగంగ వద్దకు చేరుకునేందుకు వద్ధులు, వికలాంగులను రోప్‌వే ద్వారా అనుమతిస్తారా? లేదా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు వీఐపీల తాకిడి కూడా మొదలయింది. పుష్కరాల మొదటి రోజు శుక్రవారం శ్రీశైలానికి మండలి డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌రెడ్డి రానున్నారు. 
 
భయపెడుతున్న కొండ చరియలు
గతంలో విరిగిపడిన కొండ చరియల ప్రాంతంలో ఇంకా పూర్తిస్థాయిలో రక్షణ పనులు పూర్తి కాలేదు. మొత్తం రోడ్డుమార్గం అంతా ఐరన్‌మెష్‌ ఏర్పాటు చేయాలని స్వయంగా జియోలాజికల్‌ సర్వేఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) సూచనలు చేసినప్పటికీ కేవలం సగం వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన ప్రాంతంలో పనులు పూర్తికాకపోవడంతో కొండ చరియలు భక్తులను భయపెడుతున్నాయి. దీంతో దిగువఘాట్‌కు మెట్ల మార్గం ద్వారా మాత్రమే భక్తులను అనుమతివ్వాలని.. ఘాట్‌ రోడ్డులో ఎక్కువ సంఖ్యలో అనుమతి ఇవ్వకూడదని అధికారులు భావిస్తున్నారు. 
 
ఇవీ సమస్యలు...
– పాతాళగంగ దిగువఘాట్‌ వద్ద పుణ్యస్నానం చేసే భక్తులకు సరిపడా దుస్తులు మార్చుకునే షెడ్లు ఏర్పాటు చేశారు. అయితే, ఎగువఘాట్‌ వద్ద రెండు మాత్రమే ఏర్పాటు చేశారు. ఇక లింగాలఘాట్‌ వద్ద కూడా కేవలం రెండే నిర్మించారు. దీంతో ప్రధానంగా స్త్రీలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. 
– పాతాళగంగ వద్ద మరుగుదొడ్లు గతంలో శాశ్వతంగా నిర్మించినవి మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. కొత్తగా తాత్కాలికంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నప్పటికీ అవి కాస్తా ఏర్పాటు కాలేదు. ఫలితంగా భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
– పుష్కరనగర్‌లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు. ఇంకా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి.  
– ఇక శ్రీశైలం పురవీధుల్లోనూ ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేయడంతో వర్షం వస్తే బాగా చిత్తడి అయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా వర్షం రాకపోయినప్పటికీ దుమ్మురేగి ఇబ్బంది పెడుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement