మది కేరింత.. మనస్సు పులకరింత
మది కేరింత.. మనస్సు పులకరింత
Published Wed, Aug 17 2016 11:20 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
– ఆరవ రోజు కొనసాగిన భక్తుల రద్దీ
– సంగమేశ్వరానికి పెరిగిన తాకిడి
– శ్రీశైలంలో లింగాలగట్టు వద్ద భక్తిపారవశ్యం
– వలంటీర్లు, పోలీసుల సేవలకు ప్రశంసలు
– ఉన్నతాధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ
సాక్షి, కర్నూలు: కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటోంది. శ్రీశైలంతో పోలిస్తే.. సంగమేశ్వరంలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఇక లింగాలగట్టు లోలెవల్ ఘాట్ భక్తజన సంద్రంగా మారింది. పిండ ప్రదానాల అనంతరం భక్తులు పుణ్య స్నానాలతో తరించిపోయారు. ఉదయం 9 గంటల వరకు ఘాట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆ తర్వాత కొంత పలుచపడినా.. సాయంత్రం రద్దీ కాస్త పెరిగింది. జిల్లాలోని ప్రధాన ఘాట్ల వద్ద స్నానమాచరించిన భక్తులు.. సమీప ఆలయాలను దర్శించుకుంటూ భక్తిపారవశ్యంలో మునుగుతున్నారు. శ్రీశైలానికి అధికంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ప్రకాశం జిల్లా మార్కాపురం వాసులు వస్తున్నారు. సంగమేశ్వరంలో జిల్లా భక్తులతో పాటు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున పుష్కర స్నానం ఆచరిస్తున్నారు.
కాస్త తగ్గిన నీళ్లు
శ్రీశైలంలో పాతాళాగంగ పుష్కర ఘాట్‌కు వెళ్లాలంటే రోప్‌వే వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి. మెట్లమార్గంలో అయితే 600 మెట్లు ఎక్కి దిగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీరంతా లింగాలగట్టు వైపు చూస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని నుంచి వచ్చే భక్తులు నేరుగా లింగాలగట్టులోని లోలెవల్ ఘాట్ వద్ద పుణ్యస్నానాలు చేస్తున్నారు. నాలుగు, ఐదవ రోజు ఈ ఘాట్‌లో నీరు వెనక్కు వెళ్లడంతో.. అధికారులు స్పందించి జనరేటర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయించి ఆ నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఫలితం పుష్కర స్నానం సాఫీగా జరిగిపోతోంది.
పటిష్ట భద్రతా చర్యలు
గుంటూరు జిల్లాలో కృష్ణా నదిలో పుష్కర స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నీట మునిగి మృత్యువాతపడిన ఘటనతో జిల్లాలోనూ ఘాట్ల భక్తుల భద్రతకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అనధికార ఘాట్ల వద్ద ఎవ్వరినీ స్నానాలు చేయించకుండా పోలీసుల బందోబస్తు ముమ్మరం చేశారు. శ్రీశైలం, సంగమేశ్వరంతో పాటు నెహ్రూనగర్, ముచ్చుమర్రి ఘాట్ల వద్ద కూడా పోలీసు బలగాలను మోహరించారు. అదేవిధంగా ఘాట్ల వద్ద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్‌ఎఫ్)కు చెందిన 49 మంది సిబ్బందిని నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణలు శ్రీశైలంలోని ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తుండగా.. సంగమేశ్వరంలో జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్, అదనపు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలు పర్యవేక్షిస్తున్నారు.
సేవలు భేష్
పుష్కర ఘాట్ల వద్ద వలంటీర్లు అందిస్తున్న సేవలను భక్తులు కీర్తిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులకు వలంటీర్లతో పాటు పోలీసులు దగ్గరుండి సేవలందిస్తున్నారు. అదేవిధంగా ఉచిత అన్నదానాలతో నీళ్ల ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ చేస్తుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Advertisement