
కబ్జాకు కంచె..
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణ శివారులోని చెలిమకుంట చెరువు ఆక్రమణపై అధికారులు స్పందించా రు. ‘సాయినగర్ ప్లాట్లకు చెలిమకుంటే దారి’ శీర్షిక న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో చెరువు శిఖం భూమిని రెవెన్యూ అధికారులు సోమవారం సర్వే చేశారు. హద్దులు ఏర్పాటు చేశారు. సర్వే నెంబర్ 1565తో గల ఈ కుంట విస్తీర్ణం 5 ఎకరాల 3 గుంటలు... పట్టణానికి అత్యంత చేరువలో ఉం డటంతో ఈ కుంట పక్కన ఉన్న బాలాజీ ఖండసారి షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 7 ఎకరాల భూమిని కామారెడ్డికి చెందిన కొందరు రియల్టర్లు కొనుగోలు చేశారు. 2014 జనవరిలో ఈ భూమిని చదును చేసి సాయినగర్ పేరిటప్లాటింగ్ చేశారు. అప్పట్లోనే చెలిమకుంట కబ్జాను గుర్తించిన రెవెన్యూ అధికారులు పనులు నిలిపివేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలవడంతో రెవెన్యూ అధికారులు బదిలీపై వెళ్లగా ఈ విషయం మరుగున పడింది. తమకు దొరికిన ఈ సమయాన్ని రియల్టర్లు ఉపయోగించుకున్నారు. శిఖం భూమి గుండా తమ వెంచర్‌కు 150 మీటర్ల పొడవు 30 ఫీట్ల వెడల్పుతో రోడ్డు వేసుకున్నారు. సాక్షి కథనంతో కదలిన రెవెన్యూ అధికారులు చెరువు శిఖంలో వేసిన రోడ్డును స్వాధీనంలోకి తీసుకునేందుకు సమాయత్తమయ్యారు. ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. శిఖం భూములు ఆక్రమణకు గురవకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. రెవెన్యూ సూపరింటెండెంట్ బాల్‌రెడ్డి,ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది చెరువు శిఖం సర్వేలో పాల్గొన్నారు.