మండే ఎండ తప్పని బడి బాట
♦ మధ్యాహ్నం వేళ పాఠశాలల నిర్వహణపై
♦ తల్లిదండ్రులు మండిపాటు
పాపన్నపేట: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో మధ్యాహ్న పాఠశాలలు నడపడం దారుణమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. టెన్‌త పరీక్ష కేంద్రాలున్నచోట మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 వరకు పాఠశాలలు నడుపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగి పోయాయి. 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మెతుకుసీమ నిప్పుల కొలిమిగా మారుతుంది. చాలా ఉన్నత పాఠశాలలకు చుట్టు పక్కల గ్రామాల నుంచే విద్యార్థులు వస్తుంటారు. వీటిలో చాలా వరకు బస్సు సౌకర్యం లేని గ్రామాలే ఎక్కువగా ఉన్నాయి.
దీంతో మండుటెండల్లో ఆటోల ద్వారో..కాలి నడకనో పాఠశాలకు వస్తున్నారు. అక్కడకు వచ్చాక కనీసం తరగతి గదిలోనైనా కూర్చుందామంటే,వాటిలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నందున ఫర్నిచర్‌పై వేసిన నంబర్లు చెరిగి పోతాయన్న భయంతో వాటికి తాళాలు వేస్తున్నారు.దీంతో తరగతి గదుల కొరత ఏర్పడి గత్యంతరం లేని పరిస్థితుల్లో విద్యార్థులు ఆరుబయట,చెట్ల క్రింద కూర్చుంటున్నారు. మండుతున్న ఎండలతో చాలా పాఠశాలల్లో ఉన్న బో ర్లు ఎండిపోగా తాగు నీటికి కట కట ఏర్పడింది. మధ్యాహ్న పాఠశాలలు నిర్వహించడం భారం గా మారుతుందన్న ఆరోపణలున్నాయి.