అవగహన సదస్సులో మాట్లాడుతున్న మరియన్న
- భద్రాచలం ఐటీడీఏ ప్రాంత ఉద్యాన అధికారి మరియన్న
- ప్రభుత్వం ప్రోత్సాహాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
- పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు
దమ్మపేట: పామాయిల్ తోటలను సాగు చేయడం ద్వారా రైతులకు అధిక లాభాలు రావడమే కాకుండా వారి బంగారు భవిష్యత్‌కు బాట వేస్తోందని భద్రాచలం ఐటీడీఏ ప్రాంత ఉద్యాన అధికారి జి. మరియన్న సూచించారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఐటీడీఏ,ఈజీఎస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు సాగులో నీటి యాజమాన్యం,ఎరువుల వాడకం తదితర అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పామాయిల్ పంట సాగుకు ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు అధిక లాభాలు పొందాలని సూచించారు. పామాయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం ప్రథమస్థానంలో ఉందన్నారు.దేశంలో నీటి ఆధారంగా సాగుచేసే ఫామాయిల్ పంట 25 నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు.
పామాయిల్ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలమని తెలిపారు. అనంతరం ఈజీఎస్ ఏపీడీ అశోక్ మాట్లాడుతూ పామాయిల్ సాగు ఎకరాకు ఎరువులపై, ఐదెకరాల భూమిలో పామాయిల్ పంటకు అనుకూలంగా ఉన్న రైతులకు ఈజీఎస్ ద్వారా రాయితీ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆయిల్‌ఫెడ్ డిప్యూటీ మేనేజర్ రాజశేఖర్‌రెడ్డి, ఉద్యాన అధికారి ఉదయ్‌కుమార్, వ్యవసాయాధికారి ప్రసాదరాజు, ఈజీఎస్ ఏపీఓ వేముల సుధాకర్, పామాయిల్ రైతు సంఘం అధ్యక్షుడు దారా తాతారావు, మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
(ప్రత్యేక స్క్రీన్ వేయాలి)
– ఫామాయిల్ పంట సాగుకు ప్రభుత్వం రాయితీలు..
–పంట సాగుచేసే రైతులకు ఉద్యానశాఖ ద్వారా ఎకరానికి మొక్కలు, ఎరువులపై రూ. 9,592 రాయితీని నాలుగేళ్లు కల్పిస్తోంది.
– ఇదే కాకుండా ఫామాయిల్ మొక్కలు ఎదిగే వరకు సాగు చేసుకునే కూడా అంతర పంటలపై నాలుగేళ్ల వరకు ఏడాదికి రూ.1200 రాయితీ .
ఫామాయిల్ సాగు చేయటం ద్వారా నాలుగేళ్ల తర్వాత ఏడాదికి ఖర్చులు పోను ఎకరాకు రూ. 50 వేలు ఆదాయం పొందవచ్చు.
–సమీపంలో రవాణా, రవాణా, మార్కెట్, ప్రాసెసింగ్ సౌకర్యం,గిట్టుబాటు ధర కలిగిన పంట.
–దీనిలో అంతర పంటలు సాగు ద్వారా ఏడాదికి ఎకరాకు అదనంగా రూ. 15 వేలు నికరం ఆదాయం నాలుగేళ్లు పొందవచ్చు. తర్వాత అంతర పంటగా కోకో సాగు చేస్తే ఏడాదికి ఎకరానికి రూ. 25 వేలు నికర ఆదాయం వస్తుంది.