benfit
-
ఉద్రిక్తం... పగిలిన అద్దాలు
బాహుబలి–2 బెనిఫిట్ షోలపై అమలాపురంలో ఆందోళన థియేటర్లు, అయిదు కార్ల అద్దాల ధ్వంసం పోలీసుల అదుపులో ముగ్గురు భిన్న ఉత్తర్వులతో రెవెన్యూ, పోలీసు అధికారుల హైరానా అమలాపురం టౌన్ : బాహుబలి–2 సినిమా బెనిఫిట్ షోలు అమలాపురంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వెంకట పద్మావతి సినీ ప్లెక్స్ థియేటర్ల అద్దాలను, అక్కడ పార్కు చేసి ఉన్న కార్ల అద్దాలను ధ్వంసం చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారుల ఆంక్షలను కాదని థియేటర్ల యాజమాన్యాలు బెనిఫిట్ షోలకు దిగటం ఈ పరిస్థితికి దారితీసింది. గతంలో ఇతర హీరోల చిత్రాలకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వని నేపథ్యంలో ఆ హీరోల అభిమానుల నిరసనలతో రోడ్డెక్కారు. నిరసనలు, పోలీస్ స్టేషన్ వద్ద బెఠాయింపు వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పటికే అధికారుల ఆంక్షలను ఖాతరు చేయకుండా థియేటర్ల యాజమాన్యాలు బెనిఫిట్ షోల కోసం ప్రేక్షకులకు ఒక్కో టికెట్‌ను రూ.1000 నుంచి రూ.1500 విక్రయించి షోలు వేసేందుకు సిద్ధమయ్యారు. కొంత మంది హీరోల అభిమానుల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్న ఈ సున్నితమైన విషయాన్ని ఆర్డీఓ జి.గణేష్‌కుమార్, డీఎస్పీ ఎల్.అంకయ్య అంతే సున్నితంగా డీల్ చేసి బెనిఫిట్ షోలు తెర మీద పడకుండా చర్యలు చేపట్టారు. ఇదంతా గురువారం అర్ధరాత్రిలోపు చోటు చేసుకున్న సంఘటనలు. అర్ధరాత్రి దాటిన తర్వాత రాష్ట్ర పోలీసుశాఖ రెండో బాసు నుంచి అనుమతి తెచ్చుకున్న ఉత్తర్వు పత్రాలను చూపిస్తూ థియేటర్ యాజమాన్యాలు బెనిఫిట్ షోలు వేసేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారిని థియేటర్ల ప్రాంగణంలో ఉంచారు. అమలాపురంలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న 8 థియేటర్ల వద్ద పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో 8 మంది ఎస్సైలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇంతలో అర్ధరాత్రి దాటిన తరా>్వత వెంకట పద్మావతి థియేటర్లలో బెనిఫిట్ షోలు వేసేందుకు సమాయత్తమవుతుండటంతో ఆర్డీఓ, డీఎస్పీలు తక్షణం అక్కడకు చేరుకుని ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఇదే సమయంలో వేరే నియోజకవర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు అక్కడ వీరంగం చేసి బెనిఫిట్ షోలు వేసి తీరుతామని సవాల్ విసరటం కొసమెరుపు. ప్రేక్షకుల ఆగ్రహం గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో థియేటర్లు బెనిఫిట్ షోలకు టిక్కెట్లు విక్రయించటం... అర్ధరాత్రి ఒంటి గంటకు కూడా షోలు వేయకపోవటంతో రూ.1000 నుంచి రూ.1500 చెల్లించి టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకుల్లో అసహనం చోటుచేసుకుంది. ఎంతకీ షోలు వేయకపోవటంతో కొందరు ఆగ్రహంతో థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న అయిదు కార్ల అద్దాలనూ పగలగొట్టారు. భిన్న ఉత్తర్వుల పర్యవసానమే... ముందు రోజు బెనిఫిట్ షోలకు అనుమతి లేదని.. టికెట్ ధరలు అధికంగా విక్రయించరాదని కలెక్టర్ ఉత్తర్వులతో ఆర్డీఓ గణేష్‌కుమార్ ఆంక్షలు విధించారు. రాష్ట్ర పోలీసు శాఖ రెండో బాసు నుంచి బెనిఫిట్ షో వేసుకునేలా గురువారం రాత్రి మరో ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలెక్టర్ ప్రభుత్వ అధికారే... పోలీసు బాసు ప్రభుత్వ అధికారే. ఈ ఇద్దరి నుంచి భిన్నమైన ఉత్తర్వులు రావడంతో ఏ ఉత్తర్వులు అమలు చేయాలో తెలియక రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు అయోమయంతో హైరానా పడ్డారు. ఇలా ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి సమన్వయ లోపంతో భిన్న ఉత్తర్వులు ఇవ్వటం వల్ల అమలాపురంలో శాంతి భద్రతలు అదుపు తప్పేలా చేశాయి. హోం మంత్రి రాజప్పతో ఇదే విషయంపై డీఎస్పీ అంకయ్య శుక్రవారం ఉదయం చర్చించారు. థియేటర్, కార్ల అద్దాలు ధ్వంసం చేస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం వరకూ థియేటర్ యాజమాన్యం నుంచి గానీ... కార్ల యజమానుల నుంచి గానీ పోలీసులకు ఫిర్యాదులు అందకపోవడం గమనార్హం. ఎవరి నుంచైనా ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామని, లేకుంటే అదుపులోకి తీసుకున్న ముగ్గురిని విచారించి వారి వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాస్ విలేకర్లకు తెలిపారు. థియేటర్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజ్‌లను సేకరించి దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. -
మినహాయింపు ఇలా..
ఆదాయపన్ను చెల్లింపుతో కలిగే ప్రయోజనాలివే.. రూ.2.5లక్షల పైబడి ఆదాయం పొందే వారు పన్ను పరిధిలోకి రాయవరం : వివిధ మార్గాల ద్వారా ఆదాయం పొందేవారు తప్పని సరిగా ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు తప్పనిసరిగా తమ ఆదాయ పన్ను రిటర్న్స్‌ను ఫిబ్రవరి నెలాఖరులోపు డ్రాయింగ్ అధికారికి చెల్లించాలి. వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలపైబడి ఉన్నవారు ఆదాయపన్నును చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం మొత్తం రూ.ఐదు లక్షలు మించని వారికి చెల్లించాల్సిన ఆదాయపు పన్ను నుంచి మరో రూ.రెండు వేలు మినహాయింపు లభిస్తుంది. హెచ్ఆర్ఏ మినహాయింపు.. * అండర్ సెక్షన్ 10(13ఏ) ప్రకారం మూడు అంశాల్లో ఏది తక్కువైతే ఆ మొత్తం ఆదాయం నుంచి మినహాయింపు పొందవచ్చు. * పొందిన ఇంటి అద్దె మొత్దం. * ఇంటి అద్దెగా చెల్లించిన మొత్తం 10 శాతం మూల వేతనం. * 40శాతం వేతనం ఇంటి అద్దె అలవెన్స్ నెలకు రూ.మూడు వేల కన్నా ఎక్కువ పొందుతున్న వారు మొత్తం హెచ్ఆర్ఏ మినహాయింపు పొందాలంటే రసీదు డీడీవోకు సమర్పించాలి. * చెల్లిస్తున్న ఇంటి అద్దె రూ.లక్ష దాటిన పక్షంలో ఇంటి యజమాని పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. * సొంత ఇంట్లో నివాసం ఉన్న వారికి హెచ్ఆర్ఏ మినహాయింపు వర్తించదు. మినహాయింపులు.. * సెక్షన్ 24 ప్రకారం హౌస్లోన్పై వడ్డీపై రూ.రెండు లక్షల వరకు మినహాయింపు ఉంది. * భార్య, భర్త ఇద్దరు జాయింట్‌గా రుణం పొందితే ఇద్దరికీ సమానంగా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా రూ.రెండు లక్షలు మినహాయింపు పొందవచ్చు. * ఇంటి రుణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుంటే అద్దెకు ఇస్తే ఇంటి రుణంపై వడ్డీ పూర్తిగా మినహాయింపు ఉంటుంది. కాని అద్దెను ఆదాయంగా చూపాలి * ఉన్నత చదువుల నిమిత్తం విద్యారుణంపై వడ్డీ మినహాయింపు కలదు. ఈ మినహాయింపు గరిష్టంగా ఏడేళ్ల వరకు వర్తిస్తుంది. * ఆదాయపన్ను చెల్లించే వారి ఇంట్లో దివ్యాంగులుంటే 80 డీడీ కింద మినహాయింపు ఉంటుంది. * వైకల్యం 80శాతం కన్నా తక్కువగా ఉంటే రూ.75వేలు, 80శాతం అంతకన్నా ఎక్కువ ఉంటే రూ.1.25లక్షలు మినహాయింపు ఉంటుంది. * 80యూ ప్రకారం ఆదాయపన్ను చెల్లించే వ్యక్తి దివ్యాంగులైనా, 80జీ ప్రకారం పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి వాటికి నూరుశాతం మినహాయింపు ఉంటుంది. * ఉద్యోగి తన కుటుంబం, తల్లిదండ్రుల కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ వేర్వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం చెల్లించిన సొమ్ము గరిష్టంగా రూ.25వేలు, ఉద్యోగి తల్లిదండ్రులకు మెడికల్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం గరిష్టంగా రూ.25వేలు, తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు సీనియర్ సిటిజన్ అయినా గరిష్టంగా రూ.30వేలు పొందవచ్చు. పొదుపు పథకాలపై మదుపు రూ.1.5లక్షలు.. * 80సీ ప్రకారం జీపీఎఫ్, జెడ్పీ జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, జీఐఎస్, ఎల్ఐసీ, పీఎల్ఐ, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, ఈఎల్ఎస్ఎస్, యులిప్స్ తదితర పథకాల్లో చేసిన సేవింగ్స్‌లో మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి, స్పౌస్ ఉన్నత చదువులకు చెల్లించిన ఫీజు, ఇంటి రుణంపై చెల్లించిన ప్రిన్సిపుల్ అమౌంట్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇల్లును కొంటే రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ రూ.1.5లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. * 80సీ, 80సీసీసీ, 80సీసీడీల పొదుపులపై మొత్తంగా రూ.1.5లక్షలు ఉంటుంది. అదనపు మినహాయింపు పొదుపు పథకం.. రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్ ద్వారా రూ.1.5లక్షలకు అదనంగా మినహాయింపు ఇస్తుంది. వార్షిక ఆదాయం రూ.పది లక్షల లోపు ఉన్న వారు గరిష్టంగా రూ.50వేల వరకు పొదుపు చేయవచ్చు. పొదుపు చేసిన సొమ్ములో 50శాతం మినహాయిస్తారు. అంటే గరిష్టంగా రూ.25వేలు మినహాయిస్తారు. * సేవింగ్స్ ఖాతాలో జమ అయిన వడ్డీని ఆదాయంగా చూపిన దాంట్లో నుంచి వడ్డీని గరిష్టంగా రూ.10వేలు వరకు 80టీటీఏ ప్రకారం రూ.1.5లక్షల సేవింగ్స్‌పై అదనంగా రూ.10వేల వరకు మినహాయింపు పొందే అవకాశం ఉంది. -
పామాయిల్ సాగుతో అధిక లాభాలు
భద్రాచలం ఐటీడీఏ ప్రాంత ఉద్యాన అధికారి మరియన్న ప్రభుత్వం ప్రోత్సాహాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు దమ్మపేట: పామాయిల్ తోటలను సాగు చేయడం ద్వారా రైతులకు అధిక లాభాలు రావడమే కాకుండా వారి బంగారు భవిష్యత్‌కు బాట వేస్తోందని భద్రాచలం ఐటీడీఏ ప్రాంత ఉద్యాన అధికారి జి. మరియన్న సూచించారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఐటీడీఏ,ఈజీఎస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు సాగులో నీటి యాజమాన్యం,ఎరువుల వాడకం తదితర అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. పామాయిల్ పంట సాగుకు ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు అధిక లాభాలు పొందాలని సూచించారు. పామాయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం ప్రథమస్థానంలో ఉందన్నారు.దేశంలో నీటి ఆధారంగా సాగుచేసే ఫామాయిల్ పంట 25 నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. పామాయిల్ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలమని తెలిపారు. అనంతరం ఈజీఎస్ ఏపీడీ అశోక్ మాట్లాడుతూ పామాయిల్ సాగు ఎకరాకు ఎరువులపై, ఐదెకరాల భూమిలో పామాయిల్ పంటకు అనుకూలంగా ఉన్న రైతులకు ఈజీఎస్ ద్వారా రాయితీ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆయిల్‌ఫెడ్ డిప్యూటీ మేనేజర్ రాజశేఖర్‌రెడ్డి, ఉద్యాన అధికారి ఉదయ్‌కుమార్, వ్యవసాయాధికారి ప్రసాదరాజు, ఈజీఎస్ ఏపీఓ వేముల సుధాకర్, పామాయిల్ రైతు సంఘం అధ్యక్షుడు దారా తాతారావు, మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. (ప్రత్యేక స్క్రీన్ వేయాలి) – ఫామాయిల్ పంట సాగుకు ప్రభుత్వం రాయితీలు.. –పంట సాగుచేసే రైతులకు ఉద్యానశాఖ ద్వారా ఎకరానికి మొక్కలు, ఎరువులపై రూ. 9,592 రాయితీని నాలుగేళ్లు కల్పిస్తోంది. – ఇదే కాకుండా ఫామాయిల్ మొక్కలు ఎదిగే వరకు సాగు చేసుకునే కూడా అంతర పంటలపై నాలుగేళ్ల వరకు ఏడాదికి రూ.1200 రాయితీ . ఫామాయిల్ సాగు చేయటం ద్వారా నాలుగేళ్ల తర్వాత ఏడాదికి ఖర్చులు పోను ఎకరాకు రూ. 50 వేలు ఆదాయం పొందవచ్చు. –సమీపంలో రవాణా, రవాణా, మార్కెట్, ప్రాసెసింగ్ సౌకర్యం,గిట్టుబాటు ధర కలిగిన పంట. –దీనిలో అంతర పంటలు సాగు ద్వారా ఏడాదికి ఎకరాకు అదనంగా రూ. 15 వేలు నికరం ఆదాయం నాలుగేళ్లు పొందవచ్చు. తర్వాత అంతర పంటగా కోకో సాగు చేస్తే ఏడాదికి ఎకరానికి రూ. 25 వేలు నికర ఆదాయం వస్తుంది. -
ఊరచెరువును రిజర్వాయర్‌గా మారిస్తే మేలు
ఎడమ కాల్వ పక్కనే ఉండి ఎండిపోతున్న మునగాల చెరువు రిజర్వాయర్‌గా చేస్తే వందలాది ఎకరాలకు సాగునీరు పరిసర ప్రాంతాల్లో పెరగనున్న భూగర్భ జలమట్టం పలు గ్రామాల్లో తీరనున్న తాగునీటి కష్టాలు చెరువు ఆక్రమణలకు చెక్ పడుతుందంటున్న స్థానికులు మునగాల : మండలకేంద్రంలోని ఊరచెరువుకు సాగర్‌నీరు అందించి రిజర్వాయర్‌గా మారిస్తే ఈ ప్రాంతం కొంతవరకు సస్యశ్యామలం కానుంది. ఇదేకాక పక్కనే ఉన్న మూడు గ్రామాలకు తాగునీటి సమస్య కూడా తీరనుంది. ఊరచెరువు విస్తీర్ణం దాదాపు 350ఎకరాలుండగా ఇప్పటికే దాదాపు సగానికి పైగా ఆక్రమణలకు గురైంది. ఈ చెరువులోకి వరదనీరు వచ్చే అవకాశం లేదు. గతంలో గట్టునుంచి వచ్చే వరద కాలువ సాగర్ ఎడమకాలువ తవ్వకంతో కనుమరుగైంది. దీంతో కొన్నేళ్ల తరబడి ఈ చెరువుకు పూర్తిస్థాయిలో వరదనీరు రాకపోవడంతో చెరువు ఆయకట్టు పరిధిలోని బోర్లు, బావుల్లో భూగర్భజల మట్టం తగ్గిపోతోంది. ఫలితంగా దాదాపు 600ఎకరాల సాగు స్థిరీకరణ కలిగిన ఈ చెరువు ఆయకట్టు కొంత మెట్టపంటల సాగుకు పరిమితంకాగా మిగతాది బీడుగా మారుతోంది. ఈ నేపథ్యంలో కొందరు చెరువు శిఖాన్ని ఆక్రమించుకుని అందులోనే బావులు తవ్వుకొని వరిసాగు చేసుకుంటున్నారు. ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తే... ఈ ఊరచెరువు పక్కనుంచే సాగర్ ఎడమ (పాలేరు)కాలువ పోతోంది. కేవలం కాలువకు, చెరువుకు మధ్య వంద అడుగుల దూరం మాత్రమే ఉంటుంది. ఎడమకాలువపె ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి నేరుగా చెరువులోకి సాగర్నీరును తరలించవచ్చు. ఇందుకోసం రెండు 100హెచ్‌పీ.మోటార్లు ఏర్పాటు చేస్తే సాగర్ ఎడమకాలువకు నీరు విడుదల చేసిన వెంటనే నేరుగా ఎత్తిపోతల ద్వారా నీటిని చెరవుకు మళ్లించే అవకాశముంది. ఇందుకోసం పెద్దగా వ్యయం కూడా కాదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ డిమాండ్ ఎప్పుటినుంచో ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రిజర్వాయర్ ఏర్పాటుతో మునగాల సస్యశ్యామలం మునగాల ఊరచెరువును రిజర్వాయర్‌గా మారిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడమే కాక మునగాలతోపాటు పక్క గ్రామాలకు తాగునీటి సమస్యకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చు. ఎత్తిపోతల పథకం కోసం కావల్సిన 16గంటలు విద్యుత్ సరఫరా లైన్ కూడా అందుబాటులో ఉంది. ఇందుకోసం చెరువు ఆయకట్టు రైతాంగమే ముందుకు వచ్చి విరాళాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటికైనా ఎడమకాలువపై ఎత్తిపోతల పథకానికి అనుమతిని తీసుకురావడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంత రాజకీయ పార్టీల నాయకులు ముందుకు రావాలని.. ప్రభుత్వం కూడా తమ సమస్యను దష్టిలో ఉంచుకుని ఊర చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. సాగునీరు పుష్కలంగా లభిస్తుంది – మిడిసినిమెట్ల నాగేశ్వరరావు,రైతు, మునగాల మునగాల ఊరచెరువును రిజర్వాయర్‌గా మార్చి సాగర్‌నీటితో పూర్తిస్థాయిలో నింపితే ఆయకట్టు పరిధిలో భూగర్భజల æమట్టం పెరిగి సాగునీరు పుష్కలంగా లభిస్థోంది. ఫలితంగా ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యే అవకాశముంది. రిజర్వాయర్ అయితే తీరనున్న కష్టాలు –వీరస్వామి, మునగాల మునగాల ఊరచెరువును రిజర్వాయర్‌గా మారిస్తే ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పుంజుకుంటాయి. రెండు సీజన్లలో పూర్తిస్థాయిలో పంటలు పండడమే కాక మునగాలలోని పదివేల జనాభాతోపాటు పక్కనున్న పలు గ్రామాలకు తాగునీటి సమస్యలకు పరిష్కారం కానున్నది. -
సింధుకు ఏసీఏ రూ.25 లక్షల నజరానా
విజయవాడ స్పోర్ట్స్ : ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రూ.25 లక్షల నజరానా ప్రకటించింది. కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.10 లక్షలు నజరానా అందించింది. ఐజీఎంసీ స్టేడియంలో మంగళవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు చేతులు మీదుగా నగదు చెక్కులను సింధు, గోపీచంద్ అందుకున్నారు.