ఉద్రిక్తం... పగిలిన అద్దాలు
ఉద్రిక్తం... పగిలిన అద్దాలు
Published Fri, Apr 28 2017 11:45 PM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM
బాహుబలి–2 బెనిఫిట్ షోలపై అమలాపురంలో ఆందోళన
థియేటర్లు, అయిదు కార్ల అద్దాల ధ్వంసం
పోలీసుల అదుపులో ముగ్గురు
భిన్న ఉత్తర్వులతో రెవెన్యూ, పోలీసు అధికారుల హైరానా
అమలాపురం టౌన్ : బాహుబలి–2 సినిమా బెనిఫిట్ షోలు అమలాపురంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వెంకట పద్మావతి సినీ ప్లెక్స్ థియేటర్ల అద్దాలను, అక్కడ పార్కు చేసి ఉన్న కార్ల అద్దాలను ధ్వంసం చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారుల ఆంక్షలను కాదని థియేటర్ల యాజమాన్యాలు బెనిఫిట్ షోలకు దిగటం ఈ పరిస్థితికి దారితీసింది. గతంలో ఇతర హీరోల చిత్రాలకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వని నేపథ్యంలో ఆ హీరోల అభిమానుల నిరసనలతో రోడ్డెక్కారు. నిరసనలు, పోలీస్ స్టేషన్ వద్ద బెఠాయింపు వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పటికే అధికారుల ఆంక్షలను ఖాతరు చేయకుండా థియేటర్ల యాజమాన్యాలు బెనిఫిట్ షోల కోసం ప్రేక్షకులకు ఒక్కో టికెట్‌ను రూ.1000 నుంచి రూ.1500 విక్రయించి షోలు వేసేందుకు సిద్ధమయ్యారు. కొంత మంది హీరోల అభిమానుల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్న ఈ సున్నితమైన విషయాన్ని ఆర్డీఓ జి.గణేష్‌కుమార్, డీఎస్పీ ఎల్.అంకయ్య అంతే సున్నితంగా డీల్ చేసి బెనిఫిట్ షోలు తెర మీద పడకుండా చర్యలు చేపట్టారు. ఇదంతా గురువారం అర్ధరాత్రిలోపు చోటు చేసుకున్న సంఘటనలు.
అర్ధరాత్రి దాటిన తర్వాత రాష్ట్ర పోలీసుశాఖ రెండో బాసు నుంచి అనుమతి తెచ్చుకున్న ఉత్తర్వు పత్రాలను చూపిస్తూ థియేటర్ యాజమాన్యాలు బెనిఫిట్ షోలు వేసేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారిని థియేటర్ల ప్రాంగణంలో ఉంచారు. అమలాపురంలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న 8 థియేటర్ల వద్ద పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో 8 మంది ఎస్సైలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇంతలో అర్ధరాత్రి దాటిన తరా>్వత వెంకట పద్మావతి థియేటర్లలో బెనిఫిట్ షోలు వేసేందుకు సమాయత్తమవుతుండటంతో ఆర్డీఓ, డీఎస్పీలు తక్షణం అక్కడకు చేరుకుని ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఇదే సమయంలో వేరే నియోజకవర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు అక్కడ వీరంగం చేసి బెనిఫిట్ షోలు వేసి తీరుతామని సవాల్ విసరటం కొసమెరుపు.
ప్రేక్షకుల ఆగ్రహం
గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో థియేటర్లు బెనిఫిట్ షోలకు టిక్కెట్లు విక్రయించటం... అర్ధరాత్రి ఒంటి గంటకు కూడా షోలు వేయకపోవటంతో రూ.1000 నుంచి రూ.1500 చెల్లించి టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకుల్లో అసహనం చోటుచేసుకుంది. ఎంతకీ షోలు వేయకపోవటంతో కొందరు ఆగ్రహంతో థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న అయిదు కార్ల అద్దాలనూ పగలగొట్టారు.
భిన్న ఉత్తర్వుల పర్యవసానమే...
ముందు రోజు బెనిఫిట్ షోలకు అనుమతి లేదని.. టికెట్ ధరలు అధికంగా విక్రయించరాదని కలెక్టర్ ఉత్తర్వులతో ఆర్డీఓ గణేష్‌కుమార్ ఆంక్షలు విధించారు. రాష్ట్ర పోలీసు శాఖ రెండో బాసు నుంచి బెనిఫిట్ షో వేసుకునేలా గురువారం రాత్రి మరో ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలెక్టర్ ప్రభుత్వ అధికారే... పోలీసు బాసు ప్రభుత్వ అధికారే. ఈ ఇద్దరి నుంచి భిన్నమైన ఉత్తర్వులు రావడంతో ఏ ఉత్తర్వులు అమలు చేయాలో తెలియక రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు అయోమయంతో హైరానా పడ్డారు. ఇలా ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి సమన్వయ లోపంతో భిన్న ఉత్తర్వులు ఇవ్వటం వల్ల అమలాపురంలో శాంతి భద్రతలు అదుపు తప్పేలా చేశాయి. హోం మంత్రి రాజప్పతో ఇదే విషయంపై డీఎస్పీ అంకయ్య శుక్రవారం ఉదయం చర్చించారు. థియేటర్, కార్ల అద్దాలు ధ్వంసం చేస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం వరకూ థియేటర్ యాజమాన్యం నుంచి గానీ... కార్ల యజమానుల నుంచి గానీ పోలీసులకు ఫిర్యాదులు అందకపోవడం గమనార్హం. ఎవరి నుంచైనా ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామని, లేకుంటే అదుపులోకి తీసుకున్న ముగ్గురిని విచారించి వారి వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాస్ విలేకర్లకు తెలిపారు. థియేటర్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజ్‌లను సేకరించి దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
Advertisement
Advertisement