రాష్ట్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం లేఖ
సాక్షి, హైదరాబాద్: గోదావరి ఉపనది అయిన పెన్‌గంగపై డ్యామ్ దిగువన ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ నిర్మించతలపెట్టిన ఛనాఖా-కొరట బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. నిర్ణీత కాల వ్యవధిలో బ్యారేజీ విషయమై రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు తమ అంగీకారాన్ని శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ పీజీ మందాడే, తెలంగాణ ప్రభుత్వానికి లేఖద్వారా తెలియజేశారు. బ్యారేజీ నిర్మాణంపై తాము తీసుకున్న నిర్ణయాలను మినిట్స్ రూపంలో రాష్ట్ర అధికారులకు పంపారు.
పెన్‌గంగ నీటిని వినియోగంలోకి తెచ్చేందుకు ఛనాకా, కొరటల మధ్య 1.5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులను ఆరంభించేందుకు వీలుగా గత నెల 22న రాష్ట్ర ప్రభుత్వం రూ.368 కోట్ల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అనంతరం ఈ పనులకు అంగీకారం కోరుతూ రాష్ట్ర మంత్రుల బృందం గత నెల 24న ముంబై వెళ్లి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఆ చర్చల ఆధారంగా తాము తీసుకున్న నిర్ణయాలను రాష్ర్ట ప్రభుత్వానికి మహారాష్ట్ర తెలియజేసింది.
మహారాష్ట్ర ప్రధాన నిర్ణయాలు ఇవీ..
► వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోవాలి.
► ఛనాఖా-కొరట బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి అన్ని క్లియరెన్స్‌లను తెలంగాణ చూసుకోవాలి.
► ఈ బ్యారేజీ నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయం, మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు సంబంధించి పునరావాసం, భూసేకరణకు అయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరించాలి.
► ఛనాఖా - కొరట బ్యారేజీ నీటిలో గతంలో నిర్ణయించిన మేరకు తెలంగాణ, మహారాష్ట్రలకు 80ః20 నిష్పత్తిలో వాటా ఉండాలి.
► మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదం తీసుకున్న తర్వాత అంతర్రాష్ట్ర ఒప్పందం జరుగుతుంది.
హరీశ్‌రావు హర్షం
మహారాష్ట్ర తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం తెలిపినందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆ రాష్ట్ర జల వనరుల మంత్రి గిరీశ్ మహాజన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం తెలిపిన దృష్ట్యా, వచ్చేవారం టెండర్ల ప్రక్రియను ఆరంభించేందుకు సమాయత్తం కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. జనవరిలో ప్రాజెక్టు నిర్మాణపనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
‘ఛనాఖా-కొరట’ నిర్మాణానికి ఓకే
Published Sat, Dec 12 2015 4:36 AM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM
Advertisement