
శనివారం లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌ను కలసిన లక్ష్మమ్మ
ఆ అవ్వ కళ్లలో ఆనందం వెల్లివిరిసింది.. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూపాన్ని ఐదేళ్లుగా కళ్లలో పెట్టుకుని ఆరాధిస్తున్న ఆమె.. శనివారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసింది. ఆ మహానేత ప్రతిరూపాన్ని చూసిన వెంటనే ఆమె మోము కోటి కాంతుల దివ్వెలా వెలిగిపోయింది. ఆ మనవడి ఆప్యాయత, పలకరింపుతో పులకించిపోయింది. అనురాగంగా ‘అవ్వా ఎక్కడ నుంచి వచ్చావ’ని జగన్ అడగడంతో గుండెలనిండా సంతోషంతో ‘గుంటూరు జిల్లా ఈపూరు నుంచి వచ్చానయ్యా.. నాకు పింఛన్ ఇచ్చి అన్నం పెట్టిన ఆ మహానుభావుడు కనుమరుగైనప్పటి నుంచి నిన్ను చూడాలని కలలు కంటున్నా.. ఇన్నాళ్లకు కుదిరిందయ్యా’ అని చెప్పింది.
ఇది విన్న ప్రతిపక్ష నేత చిన్న పిల్లాడిలా మారిపోయి బామ్మను గుండెలకు హత్తుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, పార్టీ నాయకులతో సమావేశాలు వంటి కార్యక్రమాలను పక్కనపెట్టి స్వచ్ఛమైన చిరు దరహాసంతో ఆమెతో 15 నిమిషాలు మాట్లాడారు. ‘నిన్ను చాలా ఇబ్బంది పెట్టారయ్యా.. ఎవ్వరికీ భయపడకు.. నువ్వు సీఎం అవుతావు’ అంటూ అవ్వ ధీమాగా చెప్పి అక్కడి నుంచి సెలవు తీసుకుంది.. జగన్‌ను కలిసిన మధుర క్షణాలను గుండెలనిండా నింపుకుంటూ..
ఈపూరు (వినుకొండ)